కంఠేశ్వర్ : సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ డివిజన్లో సమస్యలపై మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి బీ సుజాత మాట్లాడుతూ.. ప్రధానంగా నాగారం ప్రాంతంలో నీటి ఎద్దడి సమస్యలను పరిష్కరించాలన్నారు. టైలర్స్ కాలనీలో, బహుజన కాలనీలో మంచినీటి సమస్యను తీర్చాలని, మురికి కాలువలు ఏర్పాటు చేయాలని, సీసీ రోడ్లను నిర్మించాలని, స్తంభాలు, వీధిలైట్లు కేటాయించాలని
నాగారం 80 క్వార్టర్స్‌లో దాదాపు 15 సంవత్సరాలుగా అధికారులతో మొరపెట్టుకున్నా శ్మశాన వాటికకు ఇప్పటివరకు నిధులు కేటాయించలేదని అన్నారు.
శ్మశాన వాటిక నిర్మాణ పనులు చేపట్టలేదని, ఇప్పటికైనా స్మశాన వాటిక పనులు ప్రారంభించాలని, ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు వెళ్లిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని చెప్పారు. దొడ్డి కొమురయ్యనగర్కు సంబంధించి తాగునీటి సమస్య, మురికి కాలువల సమస్యలను పరిష్కరించాలని, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని, మరుగుదొడ్ల సౌకర్యం లేని గుట్ట ప్రాంతాలకు మరుగుదొడ్లకు వెళ్లడం వలన మహిళలపై దాడులు జరుగుతున్నాయని, పాముకాటుకు, తేలుకాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
స్థానిక సమస్యలపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, లేదంటే రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు స్థానిక సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, నగర కార్యవర్గ సభ్యులు కటారి రాములు, నగర కమిటీ సభ్యులు అనిత , అనసూయ, స్థానికులు రజియా రేష్మ, జై శ్రీ సంగీత, జ్యోతి, సునిత, లలిత, విమల భాయ్, సంపత, రేఖ తదితరులు పాల్గొన్నారు.