వినాయక్‌నగర్, జూన్ 23: నిజామాబాద్ సీపీ సాయి చైతన్య సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీసుస్టేషన్లకు ఎవరైనా తమ సమస్యలను నేరుగా వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వెంటనే పరిష్కారమయ్యేలా సంబంధిత పోలీస్ సిబ్బందిని ఆదేశించనున్నారు.
ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించగా..తొలిరోజు ఐదు ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులను పరిశీలించిన సీపీ.. వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవలను వినియోగించు కోవాలని సీపీ ఈ సందర్భంగా సూచించారు.