బోధన్ రూరల్, జూన్ 22: బోధన్ మండలంలోని ఊట్పల్లి గ్రామం లో విషాదం చోటుచేసుకున్నది. విద్యుత్ షాక్‌తో దంపతులు మృతిచెందారు. భర్తను కాపాడబోయి భార్య కూడా మృత్యువాతపడగా, బాధిత కుటుంబంలో విషాదం నింపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రత్నవత్ సంజీవ్ (46)కు ఇద్దరు భార్యలు రత్నవత్ జ్యోతి ( 44), తిరుమల, ఐదుగురు పిల్లలు ఉన్నారు. వ్యవసాయం చేసే సంజీవ్, జ్యోతి దంపతులు ఆదివారం రాత్రి పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చారు. ఇంటి ముందు ఉన్న ఓ రేకుల షెడ్డులో గేదెల కోసం గతంలో విద్యుత్ ఏర్పాటు చేశారు. ఆ రేకుల షెడ్డు నుంచి ఇంటి ముందు వరకు ఓ ఇనుప తీగను బట్టలు ఆరేసు కోవడానికి ఏర్పాటు చేసుకున్నారు.
సాయంత్రం చిన్న భార్య తిరుమల ఇంటి ముందర ఉన్న ఇనుప తీగపై ఆరబెట్టిన బట్టలను తీయడానికి వెళ్లగా విద్యుత్ తీగలు తెగిపోయి ఉండడంతో విద్యుత్ షాక్ కొట్టింది. ఈ విషయాన్ని ఆమె వెంటనే భర్త సంజీవ్‌కు చెప్పగా ఆయన వెళ్లి ఇనుప తీగను పట్టుకోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీంతో పక్కనే ఉన్న పెద్ద భార్య జ్యోతి ఇనుపతీగను లాగేందుకు ప్రయత్నం చేయగా ఆమె కూడా కరెంట్ షాక్‌కు గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడికి వచ్చిన చిన్న భార్య వారిద్దరినీ కాపాడేందుకు కర్రతో ప్రయత్నించగా ఆమె కూడా గాయపడింది. కూతురు గోదావరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం బోధన్ ఏరియా దవాఖానకు తరలించినట్లు బోధన్ రూరల్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.