Former MLA Jeevan Reddy | ఆర్మూర్, డిసెంబర్ 4 : కేసీఆర్ పదేళ్ల పాలనలో మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి అమలు చేశారని, ఆర్మూర్ నియోజకవర్గంలో ముస్లిం సోదరులపై కాంగ్రెస్ అవినీతి కన్ను పడిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆర్మూర్ పట్టణంలోని జీరాయత్ నగర్ లో గురువారం ఆయన ‘నమస్తే ఆర్మూరు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మైనారిటీలతో సమావేశమై వారి యోగక్షేమాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు మైనారిటీ పెద్దలు గత ప్రభుత్వం తమకు మంజూరు చేసిన ఫంక్షన్ హాలు నిర్మాణం నిలిచి పోయిందని జీవన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆయన మైనారిటీ పెద్దలతో కలిసి ఫంక్షన్ హాలు నిర్మాణం పనులను పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో తాను వేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని తొలగించారని ఆయన చెప్పారు. కమిషన్ల కోసం కాంట్రాక్టర్ ను బెదిరించారని, తనకు అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే నిర్మాణం పనులను ఆపు చేయాలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి హుకూం జారీ చేశారని జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.కోటి నిధులు విడుదల కాకుండా అడ్డుపుల్ల వేసి నిలిపివేశారని మండిపడ్డారు.
ఇది కాంగ్రెస్ ఇంచార్జి పీ వినయ్ కుమార్ రెడ్డి (పీవీఆర్) కు సంబంధించి వెలుగు చూసిన మరో అవినీతి భాగోతమన్నారు. తాను ప్రారంభించిన జనతా గ్యారేజ్ లో పలువురు మైనారిటీలు దీనిపై పిర్యాదు చేశారని ఆయన అన్నారు. ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు తాను నమస్తే ఆర్మూర్ కార్యక్రమంలో భాగంగా ఈ ఫంక్షన్ హాలు నిర్మాణం పనులను పరిశీలించానని జీవన్ రెడ్డి పేర్కొంటూ ఇది తన జనతా గ్యారేజ్ లో నమోదైన పైసా వసూలు రెడ్డి (పీవీఆర్) క్రైమ్ నెంబర్ –3 అని వ్యాఖ్యానించారు. ఇకనైనా ఫంక్షన్ హాలు నిర్మాణం పనులను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే వేలాది మంది మైనారిటీలతో కలిసి మున్సిపల్ ఆఫీసును ముట్టడిస్తానని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ నేతల అక్రమాలపై జిల్లా కలెక్టర్ స్పందించాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో మైనారిటీలకు లెక్క లేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. షాదీముబారక్ స్కీమ్ ద్వారా పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు చేశామని ఆయన గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం చొప్పున ఇస్తామన్న హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. 120 మసీదులకు డబ్బులిచ్చామన్నారు. ఆర్మూర్ లో ఈద్గా కు రూ.25లక్షలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. రంజాన్ తోఫా ఇచ్చామని, మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన మంచినీటి సరఫరా చేశామని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
మైనారిటీల కోసం బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించిన చరిత్ర తొలి సీఎం కేసీఆర్‌దేనని ఆయన చెప్పారు. 70ఏండ్లుగా కాంగ్రెస్ మైనారిటీలను ఓట్లు వేసే యంత్రాలుగానే చూసింది తప్ప వారి సంక్షేమానికి చేసింది శూన్యమన్నారు. అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ విధానం కాగా కూల్చివేతలు, కాల్చివేతలు, పేల్చివేతలు కాంగ్రెస్ విధానమని ఆయన మండిపడ్డారు. నియోజకవర్గ వ్యాప్తంగా మైనార్టీలకు ఫంక్షన్ హాళ్ల నిర్మాణం చేశామన్నారు. పదేళ్లలో తాను చేసిన శంకుస్థాపన, ప్రారంభోత్సవ శిలాఫలకాలు తొలగించాలని కాంగ్రెస్ ఇంచార్జి పీవీఆర్ వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులను బెదిరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తన పేరు మైనారిటీల హృదయాల్లో లిఖించబడి ఉందని, శిలాఫలకాలు తొలగించినంత మాత్రాన తనను ప్రజలకు దూరం చేయలేరన్నారు.
పదేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంలో తన ఆనవాళ్లు చెరిపేయడం ఎవరి తరం కాదని జీవన్ రెడ్డి హెచ్చరించారు. పైసా వసూలు రెడ్డి అవినీతిపై ఇక నిరంతర యుద్ధమేనని, అతడి అవినీతి చెర నుంచి ఆర్మూర్ నియోజకవర్గానికి విముక్తం చేస్తానని ఆయన ప్రకటించారు. అధికార మదంతో పీవీఆర్ చేస్తున్న బెదిరింపులకు భయపడే వారెవరూ లేరని స్పష్టం చేశారు. మైనార్టీ ఫంక్షన్ హాలు నిర్మాణం నిలిచి పోవడానికి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కూడా కారణమని , ఆ ఫంక్షన్ హాలు నిర్మిస్తున్న జాగా పై ఎమ్మెల్యే కొర్రీలు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఒక జోకర్, కాంగ్రెస్ ఇంచార్జి పీవీఆర్ ఒక బ్రోకర్ అని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్, సీనియర్ నాయకులు పోల సుధాకర్, రాజేశ్వర్ రెడ్డి, అజీమ్, అర్షద్, మాలిక్ బాబా, సైఫ్ తదితరులు పాల్గొన్నారు.