నిజామాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఉత్కంఠ వీడనున్నది. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపునకు ఎన్నికల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా డిచ్పల్లిలోని సీఎంసీలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. మే 13న జరిగిన పోలింగ్‌లో నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 17లక్షల 4వేల మంది ఓటర్లకు 12లక్షల 26వేల 133 మంది ఓటేశారు. ఎంపీగా ఎవరిని గెలిపించాలన్నది బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉన్నది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, సర్వీస్ ఓట్లను ముందుగా లెక్కిస్తారు. ఈ ప్రక్రియ 8గంటలకు మొదలైతే గంటసేపట్లో ఫలితం వెల్లడవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ తర్వాత సర్వీస్ ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. నిర్ణీత వ్యవధిలో పూర్తికాకపోయినా 8.30గంటలకు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించే అవకాశాలుంటాయి. అయితే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయితే కానీ ఈవీఎంల రౌండ్ల ఫలితాలను అధికారికంగా ప్రకటించడానికి వీల్లేదు. సంబంధిత రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలోనే పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు టేబుళ్లకు అదనంగా పోస్టల్ బ్యాలెట్ కోసం ఆర్వో వద్ద ప్రత్యేక టేబుల్‌ను ఏర్పాటు చేస్తారు. ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపునకు నియోజకవర్గానికి 14 టేబుళ్లపై సహాయకులు పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను క్రమపద్ధతిలో తీసుకొచ్చి ఉంచుతారు. సూపర్వైజర్ వాటిపై ఉండే రిజల్ట్ మీటను నొక్కి పార్టీల వారీగా పోల్ అయిన ఓట్లను నమోదు చేసుకుంటారు. మైక్రో అబ్జర్వర్ వాటిని పట్టికలో పొందుపర్చి ఆర్వోకు అందిస్తారు. అన్ని టేబుళ్ల లెక్కలను కలిపితే ఓ రౌండ్ ఫలితం వచ్చినట్లు పరిశీలన తర్వాత సంబంధిత ఆర్వో, పరిశీలకులు ఫలితాన్ని వెల్లడిస్తారు. చివరి రౌండ్ ఫలితం పూర్తయ్యాక అభ్యర్థి గెలుపును ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటిస్తుంది. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా ఉన్న కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు గెలుపొందిన వ్యక్తికి ధృవీకరణ పత్రాన్ని అందిస్తారు.
డిచ్పల్లి, జూన్ 3: కౌంటింగ్‌ను పారదర్శకంగా చేపట్టేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఏజెంట్లను కేంద్రంలోకి అనుమతిస్తారు. ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ పర్యవేక్షకుడు, సహాయకుడు, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. వీరిపై పర్యవేక్షణకు రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారులతోపాటు ఈసీ నియమించిన పరిశీలకులు ఉంటారు. డిచ్పల్లి సీఎంసీ స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగు అంచెల భద్రత నడుమ కౌంటింగ్ చేపడుతున్నారు. ఉద్రిక్తతలకు చోటు లేకుండా 144 సెక్షన్ విధించారు.