శక్కర్‌నగర్, ఆగస్టు 6: పరిచయమున్న వ్యక్తే కదా అని నమ్మి వెళ్లిన పాపానికి బాలికను వంచించాడో కౌన్సిలర్. ఇంటికి తీసుకెళ్తానని కారులో ఎక్కించుకున్న నిందితుడు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. ఎడపల్లి శివారులో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన బోధన్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు కథనం ప్రకారం.. బోధన్ పట్టణంలోని మూడో వార్డు (శక్కర్‌నగర్) కౌన్సిలర్ కొత్తపల్లి రాధాకృష్ణకు నిజామాబాద్‌లో సోమవారం రాత్రి ఆటోలో వెళ్తున్న తన ప్రాంతానికి చెందిన, పరిచయమున్న బాలిక (16) కనిపించింది. దీంతో ఆమెతో మాట కలిపి, తాను బోధన్‌కే వెళ్తున్నానని చెప్పి కారులో ఎక్కించుకున్నాడు.
మార్గమధ్యంలో ఎడపల్లి నుంచి మంగళ్‌పాడ్ రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం ఎడపల్లికి వచ్చి వైన్స్‌లో మద్యం తీసుకుంటుండగా, కారులో ఉన్న బాలిక కేకలు వేసింది. గమనించిన స్థానికులు బాలికను ప్రశ్నించగా జరిగింది చెప్పింది. దీంతో కౌన్సిలర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడ్ని పోలీసులు బోధన్ సీఐ కార్యాలయానికి తరలించగా, బాధితురాలి సంబంధీకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆందోళనకు దిగారు.
నిందితుడ్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు ఏర్పాటుచేసిన పోలీసులు.. కౌన్సిలర్‌పై కిడ్నాప్‌తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, చట్టపరంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కౌన్సిలర్ అఘాయిత్యానికి పాల్పడిన ప్రాంతాన్ని ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ నరేశ్, ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణ మంగళవారం పరిశీలించారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపి, నిందితుడ్ని రిమాండ్‌కు తరలించారు.
కౌన్సిలర్ రాధాకృష్ణ సోదరుడు రవీందర్ సైతం గతంలో ఇలాగే ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఏడాదిన్నర క్రితం మూడో వార్డుకు చెందిన ఓ మైనర్‌పై దారుణానికి ఒడిగట్టిన కేసులో రవీందర్‌తో పాటు రాధాకృష్ణ కూడా జైలుకు వెళ్లొచ్చారు. ఆ ఉదంతం మరువక ముందే రాధాకృష్ణ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.