మోర్తాడ్, జూలై 17: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు అందించే గుడ్డు ధర ఏజెన్సీ నిర్వాహకులను ఆందోళనకు గురిచేస్తున్నది. మొన్నటి వరకు ఆరు రూపాయలుగా ఉన్న గుడ్డు ధర ప్రస్తుతం మార్కెట్లో 8 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. దీంతో నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,163 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో లక్షా 121 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ వారంలో మూడురోజుల పాటు కోడిగుడ్డును మధ్యాహ్నభోజనంలో అందించాల్సి ఉంటుంది. ఏజెన్సీ నిర్వాహకులకు గుడ్డు కోసం ప్రభుత్వం రూ.6 మాత్రమే చెల్లిస్తుంది. కానీ బయట గుడ్డు ధర మాత్రం రూ.8 వరకు ఉన్నది. ప్రభుత్వం చెల్లించే గుడ్డు ధరకన్నా బయట ధర దాదాపు రెండు రూపాయల వరకు ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నభోజన ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. వారానికి మూడు రోజులు కోడిగుడ్డును అందించాలంటే తాము తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు. బయట ఉన్న ధర ప్రకారమే తమకు చెల్లించాలని లేదా కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి చెల్లించే బిల్లులను చూస్తే బిత్తరపోవాల్సిందే. ప్రభుత్వపాఠశాలలో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థికి రూ.6.78, 6 నుంచి 8వ తరగతి వరకు రూ.10.17 చెల్లిస్తారు. అయితే ప్రభుత్వం చెల్లించే దాంట్లోనే వంట సరకులు కొని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉంటుంది. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఇచ్చే ఒక్కో గుడ్డుకు ప్రభుత్వం ఆరు రూపాయలు చెల్లిస్తుంది. కానీ 9,10వ తరగతులకు విద్యార్థికి రూ.13.17 చెల్లిస్తారు. వీరికి ఏజెన్సీ నిర్వాహకులు ఇచ్చే గుడ్డుకు మాత్రం చెల్లింపులు ఉండవు. మధ్యాహ్నభోజన ఏజెన్సీ నిర్వాహకులకు ఇద్దరికి రూ.3వేల చొప్పున వేతనం చెల్లిస్తారు. మధ్యాహ్నభోజనం తయారీ విషయంలోనే తమకు పడుతున్న కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదని వాపోతున్న తరుణంలో, పెరిగిన గుడ్డు ధర మరింత ఆందోళనకు గురిచేస్తున్నది. వంటసామాగ్రి, కోడిగుడ్లను ప్రభుత్వమే అందించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నభోజనంలో మూడు రోజులు కోడిగుడ్డును అందించాల్సి ఉంటుంది. మార్కెట్లో ధర ఎక్కువ ఉన్న కారణంగా కొన్ని పాఠశాలల్లో రెండురోజులు గుడ్డు, ఒక రోజు అరటిపండు అందిస్తున్నట్లు తెలిసింది. రెండురోజులు గుడ్డు ఒకరోజు అరటి పండు అందించినా ప్రభుత్వం కోడిగుడ్డుకు చెల్లించిన ధర తక్కువే అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సరకులను ప్రభుత్వమే అందించాలని ఏజెన్సీ నిర్వాహకులు కోరుతున్నారు.
వారంలో మూడు రోజులు కోడిగుడ్డును విద్యార్థులకు అందించాల్సిందే. ప్రతి పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం అందేలా చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులపై ఉంటుంది. ప్రతిరోజూ మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్నభోజనం అందేలా చూడాలి.
– ఆంధ్రయ్య, ఎంఈవో
వంట సరుకులు ప్రభుత్వమే అందిస్తే బాగుంటది. కోడిగుడ్డు మూడురోజులు పెడితే వారానికి ఒక విద్యార్థికే ప్రభుత్వం ఇచ్చే ధరకన్నా రూ. 4 నుంచి రూ.5 ఎక్కువవుతుంది. ఇలా లెక్కజేస్తే మేమే నష్టపోవాల్సి వస్తది. పిల్లలకు సేవచేయడానికి ముందుకు వచ్చాం. ప్రభుత్వం కూడా మా గురించి ఆలోచించి, సరుకులన్నీ అందించేలా చూడాలి.
– నిరంజన, మధ్యాహ్నభోజన ఏజెన్సీ నిర్వాహకురాలు