తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన మహేశ్‌కుమార్‌గౌడ్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పదవులను అటుంచితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాయకత్వ మార్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో వ్యవహారం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారింది. ఉమ్మడి జిల్లాలో కీలక నేతలు ఉన్నా వారికి ప్రభుత్వంలో ఎలాంటి బాధ్యతలు లేవు.
సలహాదారు పోస్టులు తప్ప, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎవరికీ దక్కలేదు. తాజాగా పీసీసీ చీఫ్‌గా నిజామాబాద్ జిల్లాకు చెందిన బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఏఐసీసీ నాయకత్వం కట్టబెట్టింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగియగానే నామినేటెడ్ పదవుల భర్తీపై ఊహాగానాలు జోరుగా సాగాయి. పార్టీని నమ్ముకుని ఆది నుంచి పనిచేస్తున్న కీలకనేతలు ఎవరికీ వారుగా పైరవీలు మొదలు పెట్టారు. కాంగ్రెస్‌లో పాత నాయకత్వంతోపాటు కొత్తగా వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ఎవరికి పదవులు కట్టబెట్టాలో తెలియక పీసీసీ అయోమయంలో పడింది.
ఇలాంటి పరిస్థితిలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నేతల మధ్య పెరిగిన అగాధాన్ని, అసంతృప్తిని కొత్త పీసీసీ చీఫ్ ఏ విధంగా అధిగమిస్తారనే దానిపై ఆసక్తి నెలకొన్నది. జిల్లాలో పార్టీని సమన్వయ పర్చడంలో మహేశ్‌కుమార్‌గౌడ్ వేయబోయే అడుగులు ఏ విధంగా ఉంటాయోనని పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రధానంగా డీసీసీ అధ్యక్షుడి నియాకమంపై పీసీసీ చీఫ్‌కు తలనొప్పిగా మారనున్నది.
జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ)కి త్వరలో నూతన అధ్యక్షుడిని ఎంపిక చేయనున్న నేపథ్యంలో చాలామంది సీనియర్ లీడర్లు పోటీలో ఉన్నారు.2014లో అధికారంలో కోల్పోయిన తర్వాత కూడా పార్టీని వదిలి పెట్టకుండా కొనసాగిన వారికే అధ్యక్ష పీఠం కట్టబెట్టేందుకు అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం డీసీసీ చీఫ్‌గా కొనసాగుతున్న మానాల మోహన్‌రెడ్డిని రెండు నెలల క్రితం కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఒకే వ్యక్తికి రెండు పోస్టులు ఉండకూడదనే నిబంధన మేరకు డీసీసీ అధ్యక్షుడి మార్పు అనివార్యమైంది. మరోవైపు మానాల మోహ న్ రెడ్డి కూడా డీసీసీ ప్రెసిడెంట్‌గా తప్పుకునేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణలో భాగం గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి డీసీసీ పోస్టును ఆశిస్తున్నవారు వరుసలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాలను తీవ్రంగా అణచి వేసింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీకి తప్ప మిగితా వర్గాలకు మొండిచేయి చూపించింది. నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లోనూ అగ్రవర్ణాలకే టికెట్ కేటాయించి బీసీలను పక్కనబెట్టింది. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన వారిలో కొంత మంది కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. పీసీసీ చీఫ్‌గా బీసీ ఉండడంతో తమకు ఈసారి న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. ఇందులో మున్నూరు కాపు, పద్మశాలీ, యాదవ, గౌడ సామాజిక వర్గాలకు చెందిన నేతలు ముందు వరుసలో ఉన్నారు. ఈ నేపథ్యంలో డీసీసీ చీఫ్ ఎంపిక మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కత్తిమీది సాములా మారింది.
ఓ వైపు సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన భూపతిరెడ్డి, లక్ష్మీకాంతారావు, మదన్ మోహన్‌రావు, పీసీసీ ముఖ్య నాయకుడు షబ్బీర్ అలీ, నియోజకవర్గ ఇన్చార్జిలతో కాంగ్రెస్‌ను పట్టాలెక్కించడం కష్టతరంగా మారనున్నదనే చర్చ జరుగుతోంది. మహేశ్‌కుమార్‌గౌడ్‌కు రాజకీయ అనుభవం పుష్కలంగా ఉన్నప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు లేవు. దశాబ్దాలుగా ప్రజా జీవితంలో మమేకమైన నాయకులు ఉన్నారు.
పార్టీ పరంగా నిర్ణయాధికారం పీసీసీ చీఫ్‌కు ఉండగా, ఉద్దండ నేతలంతా ఆయన మాటను జవదాటకుండా పాటిస్తారా? లేదా? అనేది రాబోవు రోజుల్లో చూడాల్సి ఉంది. ఆర్మూర్, బాల్కొండ, బాన్సువాడ నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. ఒక నాయకుడైతే రెండు నియోజకవర్గాలపై పెత్తనం చెలాయిస్తూ సాగిస్తున్న తీరుపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తిగానే ఉంది. పీసీసీ చీఫ్ వెనకాల నేనున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో ఏం జరుగుతుందో కాలమే సమాధానం చెప్పాలి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీలో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల్లో కొద్ది మందికే అవకాశం కల్పించారు. చాలా మంది నేతలంతా క్యాబినెట్ ర్యాంకుతో కూడిన పదవులను, జిల్లా స్థాయిలో కీలక పోస్టులను కొల్లగొట్టేందుకు ఎవరికి వారు తీవ్రంగా కృషి చేస్తున్నారు. సమీప భవిష్యత్తులో లోకల్ బాడీ ఎన్నికలు సైతం రానుండడంతో ద్వితీయ శ్రేణి నేతలు సైతం ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలపై కన్నేశారు. ఒకవైపు ఆశావహులను సంతృప్తి పర్చడం సవాల్‌గా మారగా..మరోవైపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు సైతం అగ్ని పరీక్షగా మారనున్నాయి.
జిల్లావాసికి పీసీసీ చీఫ్ పదవి దక్కడంపై ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఒకింత ఉత్సాహం నెలకొనగా.. అదే స్థాయిలో నివురు గప్పిన నిప్పులా నేతల మధ్య అసంతృప్తి, ఆగ్రహావేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్లు, జూనియర్లతోపాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని సమన్వయపర్చడం సొంత జిల్లాలో పీసీసీ చీఫ్‌కు సవాలుతో కూడుకున్నది. డీసీసీ ప్రెసిడెంట్‌గా ఎవరిని నియమించినా..సొంత గడ్డపై పార్టీ పరువును నిలబెట్టడం అతి ముఖ్యమైనది.