హైదరాబాద్, ఫిబ్ర వరి 5 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖ అంటే సర్కార్ బడులను బలోపేతం చేయాలి. విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలి. కానీ, ఈ బాధ్యతల నుంచి ఆ శాఖ తప్పుకొన్నదన్న విమర్శలున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రే విద్యాశాఖ బాధ్యతలు కూడా పర్యవేక్షిస్తుండగా, ఈ శాఖ తీసుకున్న నిర్ణయమొకటి బూమరాంగ్ అయ్యింది. అంతిమంగా ప్రైవేట్ ఎడ్యుటెక్ కంపెనీకి కాసుల పంట పండించింది. సదరు సంస్థ ఉచిత పాఠాల పేరిట గాలం వేసింది. సబ్‌స్ర్కైబర్లను పెంచుకున్నది. చివరికి షేర్మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి కోట్లకు పడగలెత్తింది. ఈ ప్రైవేట్ ఎడ్యుటెక్ సంస్థ వ్యాపారానికి విద్యాశాఖ అధికారికంగా సపోర్టు చేసింది. ఇదంతా ఓ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగింది. దీనికి సపోర్టు చేసిన అధికారులపై టీచర్ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు (ఐఎఫ్‌పీ) ఉన్నాయి. మరికొన్ని బడుల్లో ట్యాబ్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్నాయి. వీటిని సవ్యంగా వాడటంలేదని విద్యాశాఖ ఆగ్రహం వ్యక్తంచేసింది. మొదట ఐఎఫ్‌పీ ప్యానళ్లు, డిజిటల్ డివైజ్‌లను వాడాలంటూ టీచర్లకు ఆదేశాలిచ్చింది. పాడైపోయిన డివైజ్‌ల రిపేర్ల కోసం నిధులు కూడా ఇచ్చారు. రిపేర్లు చేసిన తరువాత కొన్ని ఎడ్యుటెక్ సంస్థలు రంగప్రవేశం చేశాయి. ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి సమక్షంలోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చున్నాయి. కొందరు ఐఏఎస్ అధికారులు ఈ ఒప్పందం వెనుక కీలకపాత్ర పోషించారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
రాష్ట్రంలో జిల్లా పరిషత్, ప్రభుత్వ బడులు, మాడల్ స్కూల్స్, కేజీబీవీలు అన్ని కలిపితే దాదాపు ఆరువేల బడులుంటాయి. 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. వీటిల్లో విద్యార్థుల సంఖ్య దాదాపు 15 లక్షల వరకు ఉంటుంది. ఈ విద్యార్థులకు ఉచిత సేవలంటూ సదరు సంస్థలు రంగప్రవేశం చేశాయి. ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు జేఈఈ, నీట్, క్లాట్ కోచింగ్ అంటూ ఎర వేశాయి. అధికారులు సైతం ఉచితంగా విద్యార్థులు పాఠాలు వినొచ్చని గొప్పలు చెప్పారు. పై నుంచి ఆదేశాలుండటంతో ప్రైవేట్ ఎడ్యుటెక్ కంపెనీల వినియోగంపై టీచర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. ఆ తర్వాత లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లు క్రియేట్ చేశారు. ఒక్కో విద్యార్థికి ప్రత్యేకంగా ఒక లాగిన్ ఐడీ ఇచ్చారు. రోజుకు రెండు క్లాసులు వినాలంటూ టైమ్‌టేబుల్ ప్రకటించారు. విద్యార్థులు అలవాటు చేసుకుని వినడం మొదలుపెట్టారు. దీంతో యూట్యూబ్, ఆన్లైన్ వేదికలపై సదరు సంస్థలకు సబ్‌స్ర్కైబర్స్ పెరిగారు.
సదరు ఎడ్యుటెక్ కంపెనీలకు రాష్ట్ర విద్యాశాఖ సాగిలపడింది. టీచర్లు వ్యతిరేకించినా పైస్థాయి ఆదేశాల పేరిట బలవంతంగా రుద్దింది. మొదట్లో ప్రైవేట్ ఎన్జీవోలు, ఎడ్యుటెక్ కంపెనీల రాకను టీచర్లు, సంఘాలు వ్యతిరేకించాయి. అయితే, ముఖ్యమంత్రి సమక్షంలోనే ఒప్పందాలు కుదరడంతో అంతా గప్‌చుప్ అయ్యారు. పైస్థాయి అధికారులు జోరుపెంచారు. ఆయా ఎడ్యుటెక్ కంపెనీల పాఠాలెందుకు వినడంలేదని, తక్కువ మంది పిల్లలు ఎందుకు వింటున్నారని, సమీక్షల మీద సమీక్షలు నిర్వహించారు.
ఆన్లైన్ మీటింగ్స్ పెట్టి చీవాట్లు పెట్టారు. వ్యూయర్షిప్ తక్కువగా ఉన్నదని, సబ్‌స్ర్కైబర్లు పెరుగడంలేదని సమావేశాల్లోనే ప్రిన్సిపాళ్లు, హెచ్‌ఎంలపై చిర్రుబుర్రులాడారు. వారం వారం సమీక్షలు నిర్వహించారు. మీ స్కూళ్లో తక్కువ వ్యూయర్షిప్ ఉన్నదంటూ నివేదికలు పంపించారు. దీనిపై ఐఏఎస్ అధికారులు సైతం ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించారట. పర్సంటేజీలు పెంచాలంటూ టార్గెట్లు కూడా పెట్టారట. ప్రైవేట్ కంపెనీల యాప్‌ల వినియోగంపై ఐఏఎస్‌లు సమీక్షలు జరపడం గమనార్హం. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారు ఇలాంటి వాటిపై సమీక్షలు చేయడం పట్ల అప్పట్లోనే అనుమానాలు తలెత్తాయి.
అధికారుల ఒత్తిళ్లు, సమీక్షలతో మొత్తంగా విద్యార్థులు ఎడ్యుటెక్ కంపెనీల పాఠాలు వినడం మొదలుపెట్టారు. సబ్‌స్ర్కైబర్స్ పెరిగారు. ఆ తర్వాత స్కూళ్లోనే కాదు ఇంట్లో కూడా వాడాలని సూచించారు. సెల్ఫోన్లు, కంప్యూటర్లలో ఇండ్లల్లోనూ వినియోగించవచ్చని, వర్క్షీట్లు, ప్రాజెక్ట్ వర్క్, ప్రశ్నలు-సమాధానాలు ఆన్లైన్లో చేసుకోవచ్చని తెలిపారు. దీం తో విద్యార్థులు ఆకర్షితులయ్యారు. మొత్తంగా సదరు ఎడ్యుటెక్ కంపెనీకి లక్షల్లో సబ్‌స్ర్కైబర్లు పెరిగారు. అప్పుడు సదరు సంస్థ అసలు అస్ర్తాన్ని బయటికి తీసింది. సబ్‌స్ర్కైబర్లు పెరుగడంతో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించింది. గత నవంబర్‌లో ఐవోపీకు వెళ్లింది.
వంద రూపాయలుగా షేర్ ధరగా నిర్ణయిస్తే, రూ.140పైనే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యింది. ఈ ఒక్క ఐవోపీ ద్వారా సంస్థ రూ.మూడువేల కోట్లు సమీకరించుకున్నది. కొత్త గా రాష్ట్రంలో యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు కూడా ఇదే ఎడ్యుటెక్ కంపెనీ రెడీ అయ్యిందని, ఇందుకు సర్కార్ పెద్దలు ఓకే చెప్పారనే ప్రచారం జరుగుతున్నది. అయితే, సదరు సంస్థ పెట్టే వర్సిటీకి మార్గదర్శకాలే లేవట. దీంతో ఏకం గా ఓ మంత్రి ఇదే విషయంపై అధికారులను పిలిచి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారని చెప్పుకొంటున్నారు.
సర్కార్ తీరుపై టీచర్ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. సర్కార్ బడులను ఇలాంటి తప్పుడు విధానాలతో నాశనం చేస్తున్నారని మండిపడుతున్నాయి. ఉచితం పేరిట వచ్చే వారిని నమ్మితే ఇలాగే ఉంటుందని అంటున్నాయి. ఒక ప్రణాళిక ప్రకారం వ్యూయర్షిప్, సబ్‌స్ర్కైబర్లను పెంచుకునేందుకు సదరు సంస్థ పెద్ద ప్లాన్ వేసిందని టీచర్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సదరు సంస్థ రాష్ట్రంలోని కొందరు ఐఏఎస్ అధికారులను ప్రసన్నం చేసుకున్నట్టు ఆయా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
సబ్‌స్ర్కైబర్లు పెరిగాక ఐపీవోకు వెళ్లి లాభాలు సొంతం చేసుకున్నదని, ప్రైవేట్ సంస్థల లాభాల కోసం ప్రభుత్వం సహకరించడమేంటని సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కొందరు అధికారులు తమ అనాలోచిత నిర్ణయాలతో విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడుతున్నాయి. ఇకనైనా ్రప్రైవేట్ ఎన్జీవోలను ప్రోత్సహించవద్దని, టీచర్లపై నమ్మకం ఉంచి, వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాయి.