తెలంగాణను సాధించింది కేసీఆర్. కేసీఆర్ లేని తెలంగాణ ఉన్నదా? ఈ విషయం ఎవరిని అడిగినా చెప్తరు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నిజం చేసిన కేసీఆర్‌ను తెలంగాణ సమాజం జాతిపితగా పిలుచుకుంటది. కేసీఆర్‌ను జాతిపిత అన్నందుకు రేవంత్‌కు ఎందుకంత కడుపునొప్పి. విషమంతా కక్కిండు. ఎందుకు నోరు పారేసుకుంటున్నడు?
– హరీశ్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ) : ‘కాంగ్రెస్ రెండేండ్ల్ల పాలనలో జాబ్ క్యాలెండర్ పోయి.. స్కామ్ క్యాలెండర్ వచ్చింది. నిరుడు పన్నెండు నెలల్లో పన్నెండు కుంభకోణాలతో రికార్డు సృష్టించింది’ అంటూ బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్కామ్‌లు బయటపెడితే, స్కీమ్‌లపై నిలదీస్తే, 420 హామీల అమలేమైందని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బూతులు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పాలనా వైఫల్యాలను కప్పించుకొనేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణభవన్‌లో గురువారం ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కేవీ వివేకానందగౌడ్, పార్టీ నేతలు సుమిత్రాఆనంద్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, బొమ్మెర రామ్మూర్తితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
అమెరికా పర్యటన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడు రోజులు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే చాలా ఆవేదన కలుతున్నదని హరీశ్‌రావు విమర్శించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఉండొచ్చు కానీ, సీఎం వాడిన వికృత భాషతో సభ్యసమాజం చీత్కరిస్తున్నది.. ఛీ కొడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన వ్యక్తే.. రోజురోజుకూ దిగజారి ప్రవర్తించడం దారుణమైన విషయమని మండిపడ్డారు. ‘తెలంగాణను సాధించి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నిజం చేసింది కేసీఆర్.
ప్రపంచంలో, దేశంలో ఎక్కడాలేని రైతుబంధు పథకం తెచ్చి 60కోట్ల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది కేసీఆర్. 40లక్షల మంది అవ్వాతాతలకు నెలకు 2వేల పింఛన్ ఇచ్చింది కేసీఆర్. 24గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్. రైతుబీమా పథకం తెచ్చింది కేసీఆర్. వెయ్యి గురుకులాలు పెట్టి ఆరు లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించింది కేసీఆర్. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన కేసీఆర్‌ను ప్రజలు జాతిపిత అని పిలుచుకుంటరు. దీనికి నీకేం కడుపునొప్పి రేవంత్‌రెడ్డి? ఎందుకు నోరు పారేసుకుంటున్నరు? అంతకంటే గట్టిగా, పరుష పదజాలంతో, బూతులతో సమాధానం చెప్పగలం. కానీ మాకు సంస్కారం అడ్డు వస్తున్నది’ అని హరీశ్‌రావు స్పష్టంచేశారు.
తెలంగాణ ప్రతిష్ఠ దెబ్బతినేలా, దిగజార్చేలా ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై మేధావులు స్పందించాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ‘మేధావుల మౌనం దేశానికి ప్రమాదం అంటారు. ఇవాళ మన రాష్ర్టానికి రేవంత్‌రెడి అరాచకాలు, వికృత భాష కారణంగా తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటున్నది. రేవంత్‌రెడ్డి తీరుపై మేధావులు ఆలోచించాలి. తెలంగాణ చరిత్రను, ఔన్నత్యాన్ని తగ్గిస్తున్నారు. ముఖ్యమంత్రి కుర్చీకి ఉండే గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతున్నది. దీని గురించి మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ చరిత్రను చిన్నబుచ్చడం అంటే తెలంగాణ ఆత్మగౌరవంపై చేస్తున్న దాడిగానే పరిగణించాల్సి ఉంటది’ హరీశ్‌రావు హెచ్చరించారు.
రేవంత్‌రెడ్డి ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో లేరని, ఆయన కనీసం జై తెలంగాణ అనలేదని, అందుకే ఉద్యమాన్ని చిన్నబుచ్చే, మలినం చేసే ప్రయత్నం చేస్తున్నరని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఎలా తయారయ్యారో చూడండి.. అని కొండగల్ ప్రజలను కూడా కోరుతున్న. మీ ఎమ్మెల్యే ఎలా అదుపుతప్పి మాట్లాడుతున్నరో గమనించాలని కోరుతున్నా. ఓటు వేసి ఆయనకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించిన తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. ఎలా మాట్లాడుతున్నరో, ఎలా ప్రవర్తిస్తున్నరో తెలంగాణ సమాజం కూడా గమనించాలి. ముఖ్యంగా తెలంగాణలోని మేధావులు, బుద్ధిజీవులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, చదువుకున్న వాళ్లంతా ఆలోచించాలి’ అని విజ్ఞప్తి చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఏ రోజైనా తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. అధికారిక సమావేశమైనా, రాజకీయ మీటింగ్, ప్రెస్‌మీట్ అయినా, రైతు సమస్యల గురించి మాట్లాడారా? ఒక్క కొత్త పథకమైనా తెచ్చారా? అని నిలదీశారు. ‘గురుకులాల్లో పాముకాట్లు, కరెంట్ షాక్‌లు, కల్తీ ఆహారంతో పిల్లల ప్రాణాలు పోతుంటే ఏ రోజైనా రేవంత్‌రెడ్డి మాట్లాడారా? విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు గురించి ఏనాడైనా రేవంత్‌రెడ్డి ఆలోచన చేశారా? 20 లక్షల మంది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఊసే ఎత్తరు. అక్కాచెల్లెళ్లకు ఇచ్చిన హామీ గురించి మాట్లాడరు. బెటిఫిన్స్ అందక దవాఖానల్లో అనాథల్లా ఇబ్బందులు పడుతున్న రిటైర్డ్ ఉద్యోగుల ఆర్తనాదాల గురించి మాట్లాడరు. ఉద్యోగుల డీఏ, పీఆర్సీ, ఏరియర్స్ గురించి ఒక్క రోజు కూడా మాట్లాడరు. ఇవేమీ మాట్లాడరు కానీ, కేసీఆర్‌ను తిడుతా ఉంటారు’ అని విమర్శించారు.
కుసంస్కారంతో మాట్లాడే రేవంత్‌రెడ్డి వంటి వ్యక్తి రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం, దురదృష్టమని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. ‘కేసీఆర్‌ను గుర్తుచేసుకోవడం, కేసీఆర్ పోరాటాన్ని, త్యాగాన్ని, కృషిని రేవంత్‌రెడ్డి తక్కువ చేసి చూపిస్తున్నారు. రేవంత్‌రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యం. నీ భాష వల్ల తెలంగాణ ప్రజలు తలదించుకొనే పరిస్థితి వచ్చింది. రెండేండ్లుగా చేసిందేమీ లేక ప్రతిపక్షాల మీద, ప్రశ్నించే గొంతుల మీద కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రెండున్నరేండ్లలో ఒక్కసారైనా ప్రజలకు జరిగిన మేలు ఏమిటో ఆత్మపరిశీలన చేసుకున్నవా? కేసీఆర్ పేరు పలుకకుండా రేవంత్‌రెడ్డి మాట్లాడలేకపోతున్నరు. ఇది రాజకీయంగా దివాలాకోరు తనానికి నిదర్శనం’ అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై మిర్యాలగూడ సభలో సీఎం పచ్చి అబద్ధాలు చెప్పారని హరీశ్‌రావు విమర్శించారు. రెండేండ్లలో వంద మీటర్లు కూడా తవ్వకుండానే 8మంది కార్మికుల మరణాలకు కారణమైన రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్పై అభాండాలు వేయడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ప్రాజెక్ట్ కోసం రూ.4వేల కోట్లు ఖర్చుచేసింది నిజం కాదా? 11.5 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తిచేయలేదా? పెండ్లిపాక, డిండి రిజర్వాయర్లను నిర్మించింది కేసీఆర్ కాదా? రేవంత్‌రెడ్డీ.. దమ్ముంటే సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. రెండేండ్లలో నయాపైసా పనులు చేయకుండానే కుప్పకూల్చింది రేవంత్ కాదా? అని నిలదీశారు.
రేవంత్ దావోస్‌కు పోయి పెట్టుబడులు తెచ్చిందేమీ లేదని హరీశ్‌రావు దెప్పిపొడిచారు. నిజంగా ఏమైనా సాధించి ఉంటే ప్రెస్‌మీట్ పెట్టి చెప్పేవారని, కానీ ఉద్ధరించిందేమీ లేక ప్రతిపక్ష బీఆర్ఎస్పై అనుచిత విమర్శలకు దిగుతున్నారని ఆక్షేపించారు. పదేండ్ల కాంగ్రెస్ పాలనలో నల్లగొండకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఆనాడు ప్రధాని టేబుల్‌పై ఫ్లోరైడ్ బిడ్డలను పడుకోబెట్టిన దుస్థితి నిజం కాదా? అని నిలదీశారు. కానీ కేసీఆర్ పాలనలో వెయ్యి కోట్లతో నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధి చేసి, ఫ్లోరైడ్ రక్కసిని తరిమికొట్టారని గుర్తుచేశారు. నల్లగొండ జిల్లాకు మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు.
పాలనను గాలికొదిలిన రేవంత్‌రెడ్డి డైవర్షన్ డ్రామాల్లో ఆరితేరారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కేసీఆర్ చెప్పని మాటలు, ఇవ్వని హామీలను సైతం ఆయనకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఏనాడు ఇంటికో ఉద్యోగం ఇస్తామని అనలేదని, మ్యానిఫెస్టోలో పెట్టలేదని గుర్తుచేశారు. అలాగే కేసీఆర్ ఏనాడు రేవంత్‌రెడ్డిని దిగిపోవాలని చెప్పలేదని, ఆయన ఐదేండ్లు ఉంటేనే రాష్ట్రంలో కాంగ్రెస్ విత్తనం మళ్లీ మొలకెత్తదని చెప్పారని గుర్తుచేశారు.
కానీ రేవంత్ మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి.. డైవర్షన్ డ్రామాలు బంద్‌పెట్టి పాలనపై దృష్టిపెట్టాలని, లేకపోతే ప్రజలే నిన్ను డైవర్షన్ చేస్తరు జాగ్రత్త అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కరీంనగర్ సభలో తనపై కూడా వ్యక్తిగత విమర్శలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా తమపై శాపనార్థాలు పెట్టడం మాని ప్రజలకు మేలు చేసే పనులపై దృష్టిపెట్టాలని హితవుపలికారు. కాంగ్రెస్ పాలనలో గ్యారెంటీలు నిల్.. స్కామ్‌లు ఫుల్ అని దెప్పిపొడిచారు.
సీఎం కుర్చీని కాపాడుకొనేందుకే రేవంత్‌రెడ్డి బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. ఇందులో భాగంగానే తన సొంత జిల్లా నుంచి డీకే అరుణను ఎంపీగా గెలిపించి బీజేపీకి బహుమతిగా ఇచ్చారని స్పష్టంచేశారు. రాష్ట్రానికి వచ్చే బీజేపీ పెద్దలు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలవుతున్నదని ఆరోపిస్తరు.. గతంల మోదీ.. అమిత్‌షా అదే చెప్పిన్రు.. మొన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా అట్లనే మాట్లాడిన్రు.. వీళ్లు చెప్పుడు తప్ప చేసేదేమీ ఉండదు.. పొద్దంతా తిట్టుకుంటున్నరు.. చీకటి కాగానే అలయ్‌బలయ్ తీసుకుంటున్నరు’ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చీకటి ఒప్పందంలో భాగంగానే పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్స్, డిప్యూటీ సీఎం భట్టి ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగినా కేంద్రం చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. మోదీ దోస్తు అదానీకి రెడ్ కార్పెట్ వేసింది రేవంత్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు.
ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటూ గెలువలేదని సీఎం రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడడం దుర్మార్గమని హరీశ్‌రావు మండిపడ్డారు. ‘మరీ రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ మొన్న ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో కేవలం ఒకటి, రెండు సీట్లే గెలిచింది.. ఢిల్లీలో అడ్రస్ గల్లంతైంది. ఉత్తరాదిన 5, 6 రాష్ట్రాల్లో ఖాతా కూడా తెరువకుండా పత్తాలేకుండా పోయింది’ అని గుర్తుచేశారు. ఇదంతా కండ్ల ముందు ఉండగా కేసీఆర్‌ను ఉద్దేశించి సన్నాసి అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ రేవంత్‌రెడ్డి.. అసలు నువ్వు అంటున్నది.. కేసీఆర్నా? రాహుల్గాంధీనా? అని దెప్పిపొడిచారు. నోట్లకట్టలతో పట్టపగలు దొరికిపోయిన రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్ నేతలకు అవినీతి మకిలీ అంటించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. అందుకే పగ, ప్రతీకారంతో రగిలిపోతున్నారని దుయ్యబట్టారు. ఆయన కుయుక్తులు, కుట్రలు ఫలించవని తేల్చిచెప్పారు.
కేసీఆర్ పాలనలో కాళేశ్వరం నిర్మించి తెలంగాణను ధాన్యాగారంగా మార్చారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఐదారేండ్లు శ్రమించి 2021-22 నాటికే ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపారని చెప్పారు. కానీ రెండేండ్లలో ఏ ఒక్క ప్రాజెక్టు కట్టని, కనీసం ఎకరాకు నీళ్లివ్వని రేవంత్‌రెడ్డి నిస్సిగ్గుగా తన ఘనతగా చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం లేకున్నా పంట దండిగా పండిందని దగా మాటలు చెబుతున్నారని, దమ్ముంటే రేవంత్‌రెడ్డి తన నియోజకవర్గం సిద్దిపేటకు రా.. కాళేశ్వరం నీళ్లుచూపిస్తా.. ’అంటూ హరీశ్‌రావు సవాల్ విసిరారు. ఉద్యోగాల విషయంలోనూ ఇదే తీరున మాటలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పాలనలో నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు పెట్టి అంతా సిద్ధం చేస్తే కాయితాలు ఇచ్చిన రేవంత్‌రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం శోచనీయమన్నారు. గ్యారెంటీలు మరచి పొద్దునలేస్తే అబద్ధాలు చెబుతున్న రేవంత్‌రెడ్డికి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రేవంత్ రెండున్నరేండ్ల పాలనతో తనకే సంతృప్తి లేక చేతగానితనాన్ని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బూతు భాషను ఎంచుకున్నడు. నీతి లేకుండా జాతి జాతి అని మాట్లాడుతున్నడు. మేం మాట్లాడలేమా? మాకు మాట్లాడరాకనా?. అది పెద్ద విషయం కాదు. మీ కంటే దారుణమైన భాషలో జవాబు ఇవ్వగలం. మాకు సభ్యత, సంస్కారం ఉన్నది. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనుకుంటున్నం.
– హరీశ్‌రావు
మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి.. ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పుకోవడం సిగ్గుచేటని హరీశ్‌రావు మండిపడ్డారు. నాడు రోజుకూ నాలుగైదు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదని.. వారిచ్చింది ఉత్త కరెంటేనని ఎద్దేవా చేశారు. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చి రైతుల బతుకుల్లో వెలుగులు నింపారని గుర్తుచేశారు.
ఈ విషయంలో ఆయనకే పేటెంట్ దక్కుతుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కోతలు మొదలయ్యాయని ఆరోపించారు. ‘మొదటి ఏడాది 16 గంటల కరెంట్ ఇచ్చారు..రెండో ఏడాది 14 గంటలు..మూడో సంవత్సరం 12 గంటలే ఇస్తున్నరు..’అని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీ బకాయిలు ఆపింది కూడా రేవంత్ సర్కారేనని విమర్శించారు.
రైతురుణమాఫీ విషయంలోనూ సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పారని ఆక్షేపించారు. వేములవాడ రాజన్న, కాళేశ్వరం శివయ్యపై ఒట్టేసి మాట తప్పారని మండిపడ్డారు. రెండుసార్లు రైతుభరోసాతో పాటు బోనస్‌ను ఎగ్గొట్టిన ఘనత ఆయనకే దక్కిందని ఎద్దేవా చేశారు. అలాగే వడ్డీ లేని రుణాలపై సైతం బోగస్ మాటలు చెప్పారని మండిపడ్డారు.