వినాయక్ నగర్, సెప్టెంబర్ 6: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏటా ప్రశాంతంగా, ఆధ్యాత్మిక భావనతో నిర్వహించే గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ఈసారి రాజకీయ ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. శోభాయాత్రను ప్రారంభించే విషయమై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య ఏర్పడిన వివాదం వాగ్వాదం, తోపులాటకు దారి తీసింది. రెండు పార్టీల లొల్లి చూసి భక్తులు ముక్కున వేలేసుకున్నారు.
సార్వజకిక్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో ఏటా గణేశ్ నిమజ్జన శోభాయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఎప్పటిలాగే దుబ్బ నుంచి శనివారం శోభాయాత్ర రథాన్ని ప్రారంభించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర ప్రారంభోత్సవానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తన అనుచరులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. కాసేపటికే పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా కార్యకర్తలతో కలిసి వచ్చారు.
శోభాయాత్రను ప్రారంభించాలని నిర్వాహకులు ఎమ్మెల్యేను కోరగా, ఆయన కొబ్బరికాయ కొట్టారు. జెండా ఊపి ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా, కాంగ్రెస్ కార్యకర్తలు జెండాను లాక్కొని తమ నాయకుడు పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌కు అందజేశారు. ఆయన జెండా ఊపి రథయాత్రను ప్రారంభిస్తుండగా, ఎమ్మెల్యే అనుచరులు వాగ్వాదానికి దిగారు.
ఆనవాయితీ ప్రకారం శోభాయాత్రను సార్వజనిక్ గణేశ్ మండలి బాధ్యులు లేదా ఎమ్మెల్యే ప్రారంభిస్తారని, కానీ కాంగ్రెస్ నేతలు ఎలా జెండా ఊపుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బీజేపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి చేయి దాటుతుండడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువురికి సర్దిచెప్పారు. ఎమ్మెల్యే, పీసీసీ చీఫ్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో శోభాయాత్ర ప్రశాంతంగా ముందుకు సాగింది.