బిచ్కుంద, మార్చి 15: మిషన్ భగీరథ నీళ్లు రంగుమారాయి. దీంతో గ్రామస్తు లు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘మిషన్ భగీరథ’ నీళ్లు ప్రతి పల్లెకూ ఇప్పటికీ అందుతున్నాయి. ఈ క్రమం లో కామారెడ్డి జిల్లా బిచ్కుంద మం డల కేంద్రంతోపాటు పలు గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ భగీరథ నీరు సరఫరా అవుతున్నది.
అయితే కొన్నిరోజులుగా నీరు కలుషితమై రంగుమారి సరఫరా అవుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ప్రత్యేక అధికారులు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. క్లోరినేషన్ చేసిన నీటిని అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, పంచాయతీ అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడంలేదని కింది స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు
మండల కేంద్రంలోని ప్రశాంత్ కాలనీకి వెళ్లే దారిలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ మరమ్మతుల జేసీబీతో ఓ భారీ గుంతను తవ్వి వదిలేశారు. దీంతో భగీరథ నీరు వచ్చి గుంతలో నిండిపోయి కలుషితమై సరఫరా అవుతున్నది. కలుషితంతోపాటు రంగుమారడంతో నీళ్లను తాగడానికి గ్రామస్తులు జంకుతున్నారు. మిషన్ భగీరథ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ప్రశాంత్ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రంగు మారుతున్న నీళ్లు రావడం వాస్తవమే. సింగూరు డ్యామ్‌లో నాచు పేరుకుపోవడంతో నీరు పచ్చరంగులో వస్తున్నది. అయినప్పటికీ క్లోరినేషన్ చేస్తున్నాం.ఆ నీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు రావు. మండల కేంద్రంలో పైప్‌లైన్ లీకేజీ మరమ్మతుల కోసం గుంతను తవ్వగా ఒకే చోట రెండు లీకేజీలు ఏర్పడడంతో సమస్య పెద్దగా మారింది.
మరమ్మతులు చేయడానికి కనీసం నాలుగు రోజుల సమయం పడుతుంది. ఎండాకాలం ఆరంభం కావడంతో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తుతా యని భావించి మరమ్మతులను నిలిపివేశాం. అత్యవస ర సమయంలో సింగూర్ నుంచి నీటి సరఫరా నిలిపి వేసినప్పుడు మరమ్మతులు చేపడుతాం.
-కౌశిక్, మిషన్ భగీరథ డీఈ