భీమ్‌గల్, జనవరి 3: మారుమూల ప్రాంతమైన భీమ్‌గల్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి గ్రహణం పట్టుకుంది. కేవలం రాజకీయ కక్ష, వివక్ష కారణంగా నిర్మాణ పనులకు బ్రేక్ పడింది!. మార్కెట్ పూర్తయి అందుబాటులోకి వస్తే ఎక్కడ బీఆర్ఎస్కు మంచి పేరు వస్తుందోనన్న భయంతోనే పనులను అటకెక్కించారన్న ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ హయాంలో ప్రజల సౌకర్యార్థం భీమ్‌గల్‌లో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను మంజూరు చేసింది. అప్పటి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చొరవతో కేసీఆర్ ప్రభుత్వం రూ.7 కోట్లు మంజూరు చేసి, యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించింది. దాదాపు 80 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మార్కెట్ పనులు అటకెక్కాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక పోవడంతో నిర్మాణ పనులు నిలిచి పోయాయి. మూడేండ్లుగా ఎవరూ పట్టించుకోక పోవడంతో తుమ్మలు మొలిచి, బూత్ బంగ్లాలా తయారైంది. సుమారు 108 షాపులతో రెండంతస్తులలో నిర్మాణమువుతున్న ఈ మార్కెట్ పూర్తయితే ప్రజలు, వ్యాపారులకు సౌకర్యంతో పాటు మున్సిపాలిటీకి ప్రతి నెలా రూ. లక్షల్లో ఆదాయం సమకూరేది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మార్కెట్‌కు మంగళం పాడేసింది.
భీమ్‌గల్ పంచాయతీని పట్టుబట్టి మున్సిపాలిటీగా చేయించిన ప్రశాంత్‌రెడ్డి స్థానికులకు సకల సౌకర్యాలు కల్పించాలనే తలంపుతో అప్పటి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి సమీకృత వెజ్-నాన్‌వెజ్ మార్కెట్‌ను మంజూరు చేయించారు. రూ. 3 కోట్ల నిధులు విడుదల చేయించి, టెండర్లు పూర్తి చేసి 2021 డిసెంబర్ 7న శంకుస్థాపన చేశారు. విడుతల వారీగా బిల్లులు మంజూరు చేయడంతో నిర్మాణ పనులు వేగంగా సాగాయి. దాదాపు 80 శాతం భవన నిర్మాణం పూర్తయింది. అయితే, ప్రభుత్వం మా రడంతో మిగిలిన పనులకు ఆటంకం ఏర్పడింది. కాంగ్రెస్ సర్కారు బిల్లులు ఇవ్వక పోవడంతో కాంట్రాక్టర్లకు పనులు నిలిపేశారు. రేవంత్ సర్కారు ఏర్పడి రెండున్నరేండ్లు పూర్తయినా ఇంత పెద్ద ప్రాజెక్టును పట్టించుకునే వారే లేకుండా పోయారు. కేవలం 20 శాతం పనులు పూర్తి చేస్తే మార్కెట్ నిర్మాణం పూర్తయి, పట్టణానికే శోభ చేకూరేది. చిరు వ్యాపారులకు తోడ్పాటుతో పాటు ప్రజలకు సౌకర్యం ఉండేది. కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయక పోవడంతో అది కాస్త మూలన పడింది. మార్కెట్ నిర్మాణం బీఆర్ఎస్కు, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఏకైక కారణంతోనే దాని పనులు సాగనివ్వడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మరోవైపు, మార్కెట్ పూర్తి కాకపోవడంతో వ్యాపారులు రోడ్లపైనే కూరగాయలను విక్రయిస్తున్నారు. అక్కడే ఫిష్ మార్కెట్ కొనసాగుతోంది. దీంతో రోడ్డు ఇరుకుగా మారి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వానికి మాత్రం ప్రజల కష్టాలు పట్టడంలేదు.
సమీకృత మార్కెట్ పనులు పూర్తి చేయించేందుకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పోరాడుతూనే ఉన్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించారు. నిధులు విడుదల చేసి, తుది దశలో ఆగిన పనులు పూర్తి చేయిస్తే ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని మంత్రి భట్టి విక్రమార్కకు శాసనసభ సాక్షిగా విన్నవించారు. మంత్రి సరేనన్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనంలేదు. మరోవైపు, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి గత నెలలో భీమ్‌గల్‌లో పర్యటించి మార్కెట్ పరిస్థితిని చూసి చలించిపోయారు. చివరి దశలో పనులు నిలిపివేయడం వల్ల ప్రజలకు ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ నిర్మాణం పూర్తయితే వీధి వ్యాపారులు నడి రోడ్డుపై ఎండలకు, వానలకోర్చి అమ్ముకునే పరిస్థితి తప్పుతుందని, మున్సిపాలిటీ కూడా రూ. లక్షల ఆదాయం వస్తుందని చెప్పారు. కాంట్రాక్టర్‌కు బకాయి పడ్డ సొమ్మును వెంటనే చెల్లించి పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు. కానీ సర్కారు నుంచి కనీస స్పందన లేకుండా పోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఉసురు తప్పకుం డా తగులుతుంది. మార్కెట్ నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. మిగిలిన అరకొర పనులను పూర్తి చేసి ప్రారంభిస్తే ప్రజలకు, వ్యాపారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేది. కానీ రేవంత్ ప్రభుత్వంలో ప్రజల కష్టాలను పట్టించుకునే వారు లేకుం డా పోయారు.
– నీలం రవి, కౌన్సిలర్