హైదరాబాద్ : గంజాయి ముఠా దాడిలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం కోసం సౌమ్యను హైదరాబాద్కు తరలించారు. కారుతో ఢీకొట్టిన ఇద్దరు నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న ముఠా సభ్యుల కోసం గాలిస్తున్నారు. కాగా, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లు తాము ప్రయాణిస్తున్న కారుతో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టగా, ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించిన విషయం తెలిసిందే.
కాగా, మాధవ్నగర్ వద్ద శుక్రవారం జరిగిన ఘటనలో ఎక్సైజ్ సీఐ స్వప్న ఫిర్యాదు మేరకు నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ శనివారం తెలిపారు. కానిస్టేబుల్ సౌమ్యను కారుతో ఢీకొట్టిన సోహెల్, రాహిల్, మతిన్తోపాటు మరొకరిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.