గాంధారి/ కామారెడ్డి, మార్చి 20: గాంధారి మండల కేంద్రంలో ఓ కారు బీభత్సం సృష్టిం చగా.. ఒకరు దుర్మరణం చెందారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న రవి కుమార్, సుభాష్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లపైకి అతివేగంగా కారు దూసుకురావడంతో రవి కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా.. సుభాష్ గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు రవి కుమార్ (38), సుభాష్ గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బస్టాండ్ సమీపంలోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద బైక్‌ను నిలిపి నిల్చున్నారు.
అదే సమయంలో కామారెడ్డి వైపు నుంచి అతి వేగంగా ఓ కారు (టీఎస్ 09 ఈఏ 9495) వీరిపైకి దూసుకువచ్చింది. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ రవి కుమార్ అక్కడిక్కడే మృతి చెందగా.. మరో కానిస్టేబుల్ సుభాష్ స్వల్పగాయాలతో తృటిలో తప్పించుకున్నాడు. విషయం తెలుసుకున్న గాంధారి ఎస్సై ఆంజనేయులు ఘటనా స్థలికి చేరుకొన్నారు. రవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా దవాఖానకు తరలించారు. బీభత్సం సృష్టించిన కారు దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అతి వేగంగా కారు నడిపిన సన్నిత్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కానిస్టేబుల్ రవికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. ఎస్పీ రాజేశ్చంద్ర, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి సందర్శించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబీకులతో మాట్లాడి సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో రవికుమార్ మృతిచెందడం డిపార్ట్మెంట్కు తీరని లోటని పేర్కొన్నారు. రవి కుటుంబానికి పోలీసు వ్యవస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ త్వరలోనే కుటుంబ సభ్యులకు అందజేస్తామని తెలిపారు. అంత్యక్రియలకు పోలీసు శాఖ తరఫున ఆర్ఐ నవీన్ కుమార్ రూ. 30 వేలు కుటుంబీకులకు అందజేశారు. కామారెడ్డి మున్సిపల్‌పరిధిలోని దేవునిపల్లిలో పోలీసు లాంఛనాలతో రవికుమార్ అంత్యక్రియలు నిర్వహించగా..ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సదాశివనగర్ సీఐ సంతోష్‌కుమార్, గాంధారి ఎస్సై ఆంజనేయులు, కానిస్టేబుళ్లు, జిల్లా పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్ వడ్ల రవి కుమార్ స్వస్థలం తాడ్వాయి మండలం దేమే గ్రామం. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. రవి కుమార్ మృతితో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందంటూ బంధువులు రోదించడం అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.