నిజాంసాగర్, మే 29: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సాగు చేసిన పంటలను అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడాల్సి వస్తున్నదని, ప్రభుత్వానికి అన్నదాతల శాపం తప్పక తగులుతుందన్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాలులో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, జాజాల సురేందర్, బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తా, ఉమ్మడి జిల్లాల సభ్యత్వ నమోదు ఇన్చార్జి వీజీగౌడ్, జుక్కల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి మఠం భిక్షపతి, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. తాను మద్నూర్‌కు వచ్చే రహదారిలో ఓ హోటల్ వద్ద ఆగి ఓ వ్యక్తిని అడిగితే పరిస్థితి ఇలాగే ఉంటే హన్మంత్‌షిండే రావడం ఖాయమని అన్నాడని చెప్పారు. ఇప్పుడు కూడా ఈ సమావేశాన్ని చూస్తుంటే మనం ప్రతిపక్షంలో ఉన్నట్లు లేదని, అధికారంలో ఉన్నట్లుగా ఉన్నదని పేర్కొన్నారు. కార్యకర్తల జోష్ చూస్తుంటే రానున్న ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తున్నదని ధీమా వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో ఎవరినీ పలుకరించినా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారని, మళ్లీ కేసీఆర్ రావాలి అంటున్నారని వేముల తెలిపారు. జొన్న సాగు చేసి పంట చేతికొచ్చి సుమారు 45 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ కొనుగోళ్లు పూర్తికాలేదన్నారు. జొన్నతోపాటు వరి ఇతర పంటలు సాగు చేసిన రైతన్నలు అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జొన్నపంట ఎకరాకు పది క్వింటాళ్లు కొనుగోలు చేస్తే మిగిలిన జొన్నలు ఎక్కడికి తీసుకెళ్లాలని ప్రశ్నించారు. రైతులు పండించిన పంట మొత్తాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. పింఛన్ రెట్టింపు, తులం బంగారం, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యార్థులకు భరోసా కింద రూ. 5 లక్షలు అంటూ హామీలు ఇచ్చి, గద్దెనెక్కిన కాంగ్రెస్.. అన్ని వర్గాల వారినీ మోసం చేసిందని మండిపడ్డారు. ప్రజలు కూడా తాము మోసపోయామనే బాధలో ఉన్నారని తెలిపారు. రైతు డిక్లరేషన్ ప్రకటించి ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పంటలు కొనడం లేదని చెబుతున్నారని, డిక్లరేషన్‌లో కేంద్రం పంటలు కొంటలేదని రాశారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పంటలు కొనడం లేదని చెబుతున్నారని, మరి రాష్ట్ర ప్రభుత్వం గడ్డిపీకడానికి ఉందా అని నిలదీశారు. యుద్ధం పేరిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లోనూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
తెలంగాణకు ఏనాటికైనా కేసీఆరే శ్రీరామ రక్ష అని వేముల అన్నారు. చంద్రబాబు శక్తుల నుంచి తెలంగాణను కాపాడాల్సి ఉన్నదని, ఆ బాధ్యత బీఆర్ఎస్ పార్టీ సైనికులదే అని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొన్న తెలుగుశం పార్టీ మహానాడు సమావేశంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బక్కని నర్సింహులు అసలు తెలంగాణ అనే పదమే లేదని అడ్డగోలుగా మాట్లాడడం దుర్మార్గమని మండిపడ్డారు. నర్సింహులకు ఎంత ధైర్యమని, ఆయన తెలంగాణ బిడ్డనేనా, తెలంగాణ ద్రోహా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్ ఆజ్ఞల ప్రకారం వారి తరపున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణను నాశనం, ధ్వంసం చేయడానికి కంకణం కట్టుకున్నాడని ఆరోపించారు. నర్సింహులు అంత మాట అన్నా ఇప్పటి వరకు రేవంత్‌రెడ్డి ఎందుకు ఖండించలేదని, బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. వీరంతా తెలంగాణ దోచుకోవడానికి ఇక్కడి ఆస్తిత్వాన్ని ఖతం చేయడానికి ఒక్కటయ్యారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన మంత్రులు ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టి, కేవలం తమ స్వలాభం కోసమే పనిచేస్తున్నారని వేముల విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు సాకులు మానుకొని, రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
సంస్థాగత నిర్మాణం ఏ రాజకీయ పార్టీకి అయినా అత్యంత కీలకం. కార్యకర్తలే పార్టీకి పిల్లర్లలాంటి వారు. పార్టీబలోపేతం వారి ద్వారానే సాధ్యమవుతుంది. ప్రతి కార్యకర్త ఉత్సాహంగా పనిచేస్తూ, రెట్టింపు స్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టాలి. భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాష్ట్రంలో ప్రస్తుతం విఫల పరిపాలన కొనసాగుతున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైంది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలి.
-వీజీ గౌడ్, ఉమ్మడి జిల్లాల సభ్యత్వ నమోదు ఇన్చార్జి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్లో అన్ని వర్గాలకు చెందిన నా యకులు ఉండడం పార్టీ సమానత్వానికి నిదర్శనం. కేసీఆర్ ప్రజలు అడిగిన ప్రతి సంక్షేమాన్ని అందించారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు మోసపోయారు. రేవంత్‌రెడ్డి వెనుక చంద్రబాబు నాయకుడు ఉన్నారు. తెలంగాణపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ను దేశంలో నంబర్‌వన్ నగరంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలు మరిచిపోలేదు
-బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే
గడిచిన రెండున్నరేండ్లలో జుక్కల్ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. కొత్త పనులేవీ ప్రారంభించకపోవడంతోపాటు గత ప్రభుత్వ హయాంలో ఆరు మండలాల్లో మంజూరైన సెంట్రల్ లైటింగ్ పనులు ఒక్కటి కూడా పూర్తిచేయలేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ రోడ్డు వేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క కొత్త పనికాదు కదా కొత్త రోడ్డు వేసిన దాఖలాలులేవు. కేసీఆర్ రాకముందు జుక్కల్ నియోజకవర్గానికి ఒకే ఒక్క రోడ్డు డబుల్ రోడ్డు ఉండేది. అలాంటిది కేసీఆర్ హయాంలో బిచ్కుంద- కథ్గాం, బీర్కూర్, డోంగ్లీ, లింబూరు, మద్నూర్-జుక్కల్, ఎక్స్ రోడ్డు, కంగ్టీ, మద్దెల్‌చెరువు, పిట్లం నిజాంసాగర్-బొగ్గుగుడిసె ఇవన్నీ రహదారులు డబుల్ రోడ్లుగా మార్చాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రహదారిపై పడిన గుంతలను పూడ్చలేని స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చింది. ఆ హామీలను గాలికి వదిలేయడంతో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసి మోసపోయామని బాధపడుతున్నారు.
-మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని జాతీయ సర్వే సంస్థలు, పలు మీడియా సంస్థలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రజలు తాము మోసపోయామని భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలందరూ రానున్న రోజుల్లో మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలుస్తారు.రైతులు పంటలు సాగు చేసినప్పటి నుంచి విక్రయించే వరకు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు.
-బిగాల గణేశ్‌గుప్తా, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే
పార్టీ పునర్నిర్మాణానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణగా సస్యశ్యామల రాష్ట్రంగా మారింది. చిన్న రాజకీయ తప్పిదం వల్ల ఓటమి ఎదురైంది. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా నెరవేరలేదు. రైతులకు కనీసం యూరియా కూడా సకాలంలో అందని పరిస్థితి నెలకొన్నది. కేంద్రంతో తెలంగాణ హక్కుల కోసం పోరాడగల నాయకుడు కేసీఆర్ మాత్రమే. మళ్లీ ఆయన నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది.
-మఠం భిక్షపతి, జుక్కల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి
అధికారంలో లేక పోయినా గ్రామాల్లో ప్రజలు ఇప్పటికీ వారి సమస్యలను బీఆర్ఎస్ నాయకులకే చెబుతున్నారు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నది. కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే రానున్న రోజుల్లో విజయం బీఆర్ఎస్దే. రైతును రాజుగా నిలబెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ప్రస్తుతం కల్లాల్లో ఎక్కడ చూసినా జొన్న పంటలు పేరుకుపోయి రైతులు ఆవేదనలో ఉన్నారు. వారి బాధలను వినేది కేవలం బీఆర్ఎస్ మాత్రమే. స్థానిక నాయకులను కాకుండా ఇతరులను గెలిపించుకున్నామంటూ ప్రజలు
బాధపడుతున్నారు.
-జాజాల సురేందర్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే
బిచ్కుంద,మే 29: సన్నాహక సమావేశంలో గోజేగావ్, సోనాల గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమక్షంలో బీఆర్ ఎస్‌లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై విసుగు చెంది జుక్కల్ నియోజక వర్గంలోని కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.