నిజాంషుగర్స్ ఫ్యాక్టరీ ఉమ్మడి రాష్ట్రంలో ఒక వైభవాన్ని చూసి, టీడీపీ హయాంలో జాయింట్ వెంచర్ పేరిట ప్రైవేట్ కంపెనీ చేతుల్లోకి వెళ్లింది. అనంతరం లేఆఫ్‌కు గురై మూతపడిన ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామంటూ కాంగ్రెస్ నాయకులు పదేపదే చెబుతుండడం సర్వత్రా చర్చకు దారితీసింది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓట్ల కోసం నిజాంషుగర్స్‌ను తెరిపిస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా బోధన్ నియోజకవర్గానికి వచ్చిన సుదర్శన్‌రెడ్డి.. నిజాంషుగర్స్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రైతులు చెరుకు పండించేందుకు ముందుకువస్తే.. నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామంటూ ప్రకటన చేశారు. అలాగే, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనే కాకుండా 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కాంగ్రెస్ నేతలు నిజాం షుగర్స్ పునరుద్ధరణ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో నిజంగానే ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తారా.. లేదంటే మాటలకే పరిమితమవుతారా.. అన్న విషయమై ప్రజలు చర్చించుకుంటున్నారు
1938లో నిజాంపాలనలో బోధన్‌లో ప్రారంభమైన నిజాంషుగర్స్ అంచెలంచెలుగా అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో విస్తరించింది. నిజాం షుగర్స్ విషయంలో నాటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా క్రమంగా ఆ ఫ్యాక్టరీ నష్టాల వైపుగా ప్రయాణం చేసింది. నష్టాలను నివారించి ఆ సంస్థను లాభాల బాటలోకి ఎక్కించాల్సిన బాధ్యతను విస్మరించిన చంద్రబాబునాయుడు తాను సీఎంగా ఉన్న కాలంలో.. 2002లో జాయింట్ వెంచర్ పేరిట డెల్టా కంపెనీకి అప్పగించారు. జాయింట్ వెంచర్ 51 శాతం వాటా ప్రైవేట్ కంపెనీకి, 49 శాతం వాటా ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, నిజాం షుగర్స్‌పై ప్రైవేట్ కంపెనీకే పెత్తనమంతా దక్కింది. నిజాం షుగర్స్ లిమిటెడ్ కంపెనీ కాస్త.. నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్‌గా మారింది. కొన్నేండ్ల పాటు ఫ్యాక్టరీని నడిపిన ప్రైవేట్ యాజమాన్యం 2015 డిసెంబర్ 23న లేఆఫ్ ప్రకటించింది. దీంతో అప్పటికి నిజాంషుగర్స్ యూనిట్లుగా ఉన్న శక్కర్‌నగర్ (బోధన్), మెట్పల్లి, మెదక్ యూనిట్లు మూతపడ్డాయి. లేఆఫ్ కింద నిజాం షుగర్స్ మూతపడి డిసెంబర్ 23 నాటికి 9 సంవత్సరాలు పూర్తయ్యింది.
సుప్రీంకోర్టులో ప్రైవేట్ కంపెనీ దావా వేసిన విషయాన్ని ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు పరిగణనలోకి తీసుకున్నారా…? ఇప్పుడైతే నిజాం షుగర్స్ పరిధిలో చెరుకు సాగు లేదు.. చెరకు పండించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించే చర్యల గురించి ఆలోచించారా.? ప్రైవేట్ కంపెనీతో ఉన్న చిక్కుముడుల్ని ఏ విధంగా ఇవ్వగలుగుతారు.. అన్న ప్రశ్నలను కర్షకులు, కార్మికులు వేస్తున్నారు.. వీటిపై ఎటువంటి కసరత్తు లేకుండా నోటిమాటగా నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామని కాంగ్రెస్ పాలకులు చెబుతున్నారా.. లేదా నిజాం షుగర్స్ పునరుద్ధరణ కోసం వారి వద్ద స్పష్టమైన కార్యాచరణ ఏదైనా ఉందా.. అన్న విషయమై స్పష్టత లేదు.. 2002లో చంద్రబాబు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయగా, 2004లో అధికారంలోకి వచ్చిన వైస్ రాజశేఖర్‌రెడ్డి నిజాం షుగర్స్ ప్రైవేటీకరణపై సభాసంఘం వేశారు. ఆ సభాసంఘంలో ప్రస్తుతం బోధన్ ఎమ్మెల్యేగా ఉన్న సుదర్శన్‌రెడ్డి సభ్యుడు. ఆ సభాసంఘం నిజాంషుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిఫార్సు చేసినప్పటికీ, ఆ సిఫార్సును నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయలేదు. అప్పటిలాగానే ఇప్పుడు కూడా ‘నిజాం షుగర్స్‌ను తెరిపిస్తాం’ అన్న హామీ మాటలకే పరిమితమవుతుందా.. లేదా నిజమవుతుందా అన్న విషయం తెలియాలంటే వేచిచూడక తప్పదు.
నిజాం దక్కన్ షుగర్స్ యాజమాన్యం తన వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల్లో అప్పులు ఉన్నాయని, వీటిని పరిష్కరించాలని 2016లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ)లో ఇన్సాల్వేన్సి పిటిషన్‌ను దాఖలుచేసింది. ఎన్సీఎల్టీ ప్రైవేట్ యాజమాన్యానికి అనుగుణంగా తీర్పు రావడంతో కేసీఆర్ నాయకత్వంలోని నాటి కేసీఆర్ ప్రభుత్వం స్పందించింది. నిజాం షుగర్స్ భూములు, ఆస్తులను రక్షించాలన్న తపనతో ఢిల్లీలోని ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యూనల్)కు కేసీఆర్ ప్రభుత్వం వెళ్లింది. ప్రైవేట్ యాజమాన్యం నిజాం షుగర్స్ లాభాలను అనుభవించిందని, తెలంగాణాలోని విలువైన నిజాం షుగర్స్ భూములను తాను చేసిన అప్పుల కింద అమ్మివేయించేందుకు కుట్ర చేస్తోందని అప్పిలేట్ ట్రిబ్యూనల్‌లో వాదించింది. దీంతో నిజాం షుగర్స్ లిక్విడేషన్ తీర్పుపై కేసీఆర్ ప్రభుత్వానికి అనుగుణంగా అప్పిలేట్ ట్రిబ్యూనల్ 2019లో తీర్పు ఇచ్చింది. అయితే, ప్రైవేట్ యాజమాన్యం దీన్ని సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఈ వివాదం ఉంది. ఇదంతా నిజాం షుగర్స్ పునరుద్ధరణ ప్రక్రియకు సాంకేతిక అడ్డంకిగా మారింది.