భీమ్‌గల్, ఏప్రిల్ 17: భీమ్‌గల్ మండలంలోని కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమన్నది. పార్టీ మండల అధ్యక్షుడి నియామకం చిచ్చురేపింది. భీమ్‌గల్ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త బొదిరె స్వామి, వైస్ చైర్పర్సన్ భర్త జేజే నర్సయ్య, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు, డీసీసీ జిల్లా కార్యదర్శి కుంట రమేశ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అరిగెల జనార్దన్, గిరిజన నాయకుడు గోపాల్ నాయక్ సహా మండలంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డి వ్యవహార శైలిపై నిప్పులు చెరిగారు.
ఈ మేరకు ఆదివారం పట్టణంలో ఆయన దిష్టిబొమ్మను ఊరేగించి, ప్రధాన కూడలిలో దహనం చేశారు. ముత్యాల సునీల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పార్టీ పదవులు అమ్ముకున్న సునీల్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏండ్ల తరబడి పోరాడిన నాయకులకు అన్యాయం చేస్తున్నాడని, డబ్బులకు అమ్ముడు పోయి పార్టీలు మారిన వారికి పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. మండల అధ్యక్ష పదవిని మున్సిపల్‌కు చెందిన వ్యక్తికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అధిష్టానం చర్యలు తీసుకోకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
భీమ్‌గల్ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సొంత మండలం. ప్రధానంగా గిరిజన గ్రామాలు, జనాభా అధికంగా ఉన్న మండలం. మహేశ్‌కుమార్‌గౌడ్ స్వగ్రామం రాహత్‌నగర్ కూడా గిరిజన గ్రామమే. పార్టీ మండల అధ్యక్ష పదవికి 8మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా మున్సిపాల్కు చెందిన వ్యక్తికి పార్టీ మండల అధ్యక్ష పదవి ఎలా కట్టబెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టనష్టాలకు ఓర్చి, దెబ్బలు తిని పోరాడి అన్ని రకాలు బాధలు పడిన తమను కాకుండా పార్టీలు ఫిరాయించిన వ్యక్తులకు, ప్రజలు తిరస్కరించిన వారికి పదవులు ఎలా కట్టబెడతారంటూ తీవ్రంగా మండిపడ్డారు. తక్షణమే నియామకాన్ని రద్దు చేసి పార్టీ శ్రేణుల మనోభావాలకనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలని లేని పక్షంలో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షుడు కొరాడి రాజు, కౌన్సిలర్లు ఆరెపల్లి నాగేంద్రబాబు, నరేందర్ నేనావత్, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు
డీసీసీ అధ్యక్షుడు నగేశ్ రెడ్డి ఆదివారం జారీ చేసిన పార్టీ మండల అధ్యక్షుల నియామకం ఉత్తర్వులు పార్టీలో అగ్గిరాజేశాయి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా మల్లెల లక్ష్మణ్‌ను నియమించడమే దీనికి ప్రధాన కారణం. మల్లెల లక్ష్మణ్ గతంలో బీఆర్ఎస్ సాధారణ కార్యకర్తగా ఉండగా అప్పటి మంత్రి, ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేరదీసి కౌన్సిలర్‌గా గెలిపించి అతడి భార్యను మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. లక్ష్మణ్ పదవీ కాలంలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు.
అసెంబ్లీ ఎన్నికలు పూర్తవగానే తనకు ఇంతటి స్థాయి కల్పించిన ప్రశాంత్ రెడ్డికి వెన్ను పోటు పొడిచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరి ముత్యాల సునీల్ రెడ్డి పంచన చేరాడు. ముత్యాల సునీల్ రెడ్డి లక్ష్మణ్‌కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేదు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థిగా మల్లెల లక్ష్మణ్ భార్యను రంగంలోకి దించారు. కాంగ్రెస్ హవాలో సైతం ఆమె కౌన్సిలర్‌గా ఓటమి పాలయ్యారు. ఎలాగైనా మున్సిపల్లో పాగా వేయాలని మున్సిపల్లో కో-ఆప్షన్ సభ్యుడిగా ప్రయత్నించినా ఫలితంలేకపోయింది. దీంతో ముత్యాల సునీల్ రెడ్డి తన పంతం నెగ్గించుకునేందుకు పట్టుబట్టి పార్టీ మండల అధ్యక్షుడిగా నియమించాడు. దీంతో పార్టీ శ్రేణులన్నీ భగ్గుమన్నాయి. మున్సిపల్‌కు చెందిన వ్యక్తికి పార్టీ మండల బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ఆగ్రహం వ్యక్తంచేశాయి. మండల ఎస్టీ సెల్ ప్రధాన నాయకుడు గోపాల్ నాయక్ మాట్లాడుతూ సునీల్ రెడ్డి డబ్బులకు అమ్ముడు పోయాడని, పార్టీ పదవిని అమ్ముకున్నాడని ఆరోపించారు.