నిజామాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఏడాదిలో ఎంత మార్పు. కాంగ్రెస్ రాకతో పాత రోజులు పునరావృతమయ్యాయి. నిర్బంధాలు, అణచివేతలు తీవ్రమయ్యాయి. హామీల ఎగవేతలే కాదు, పేదల ఇండ్ల కూల్చివేతలు సర్వసాధారణమయ్యాయి. రేవంత్ సర్కారు గద్దెనెక్కి నేటి(డిసెంబర్ 7)తో ఏడాది పూర్తి కానున్నది. ఈ సంవత్సర కాలంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుకట్ట పడింది. కాంగ్రెస్ వస్తే రైతుబంధు సహా అనేక పథకాలను ఎగ్గొడతారన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరిక వాస్తవరూపం దాల్చింది. ప్రజాపాలన, ఆరు గ్యారంటీల పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ.. వాటి అమలులో పూర్తిగా విఫలమైంది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిపాలనను ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఉమ్మడి జిల్లా నుంచి ఏ ఒక్కరికీ మంత్రి పదవిని ఇవ్వకుండా వివక్షను ప్రదర్శించింది. రెండు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నా ఎవ్వరికీ మంత్రి యోగం పట్టలేదు. ఇన్చార్జి మంత్రి చుట్టపు చూపునకే పరిమితమయ్యారు. ఇక, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, ప్రొటోకాల్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలే పెత్తనం చెలాయిస్తున్నారు.
ఎన్నికలకు ముందు అనేక వరాలు కురిపించిన కాంగ్రెస్ అమలు చేయలేక ‘చేతు’లెత్తేసింది. 18 ఏండ్లు పైబడిన మహిళలందరికీ నెలకు రూ.2,500 ఇస్తామన్న రేవంత్‌రెడ్డి మాట నిలబెట్టుకోలేదు. పింఛన్లు పెంచుతామన్న హామీ ఏడాది కాలంగా అమలుకు నోచుకోలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నప్పటికీ తగినన్ని బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్లు, రూ.5లక్షల భరోసా కార్డు ఊసే లేదు.
పదేండ్ల కేసీఆర్ పరిపాలనలో క్రమపద్ధతిలో నడిచిన యంత్రాంగం ఏడాదిలోనే గాడి తప్పింది. పైనుంచి కింది స్థాయి దాకా ఏ అధికారికీ భయమన్నదే లేకుండా పోయింది. ప్రజల సమస్యలపై స్పందించే వారు కరువయ్యారు. నిజామాబాద్ సీపీ పోస్టు రెండు నెలల నుంచి ఖాళీగా ఉన్నా కొత్త వారిని నియమించలేదు. దీంతో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. దొంగతనాలు పెచ్చుమీరాయి. పోలీసు బాస్ కుర్చీ ఖాళీగా ఉండడంతో ఠాణాల్లో ఖాకీల ఇష్టారాజ్యం పెరిగింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. పట్టణాలు, నగరాల్లో పురపాలిక పట్టు తప్పింది. రేవంత్ ప్రభుత్వ ఏడాది పాలన ఎలా ఉందో చెప్పడానికి రోడ్లపైకి వస్తున్న జనాలే మంచి ఉదాహరణ.
రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది. రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు కాదు కదా.. గతంలో ఇచ్చినట్లు రూ.10 వేలు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టింది. రైతులందరికీ రూ.2లక్షల లోపు రుణమాఫీ చేస్తామన్న మాట నిలబెట్టుకోలేదు. ఉమ్మడి జిల్లాలో 1.50 లక్షల మందికి రుణమాఫీ చేయలేదు. అన్ని పంటలకు మద్దతు ధర, బోనస్ ఇస్తామని మాట తప్పింది. కేవలం సన్న ధాన్యానికి మాత్రమే రూ.500 బోనస్ ఇచ్చి దొడ్డు రకాలకు ఇవ్వకుండా రైతులను మోసగించింది.