బోధన్, డిసెంబర్ 8 : పంచాయతీ ఎన్నికలు పచ్చని పల్లెల్లో చిచ్చుపెడుతున్నాయి. పదవుల పందేరాలు గ్రామాల్లో వైషమ్యాలకు దారితీస్తున్నాయి. పదవుల కోసం అభ్యర్థులు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. ఎలాగైనా అందలం ఎక్కాలనే ఉద్దేశంతో అలవికాని హామీలు ఇస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. మద్యం, డబ్బులతో ఓట్లు కొనుగోలు యత్నంలో తలామునకలవుతున్నారు. పార్టీలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికలు.. కులాలు, కుటుంబాలు, బంధుత్వాల్లో విచ్ఛిన్నానికి కారణమవుతున్నాయి.
సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. కొందరు అభ్యర్థులు మిన హా మెజార్టీ అభ్యర్థులు గెలుపు కోసం పడుతున్న పాట్లు వెగటు పుట్టిస్తున్నాయి. పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు.. పల్లెలు తమ స్వయంపాలిత వ్యవస్థలుగా వర్ధిల్లాలి’ అని గాంధీజీ కలలుగన్న ‘గ్రామ స్వరాజ్యం’ భావన పంచాయతీ ఎన్నికల్లో భ్రమగా మారింది. పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో వైషమ్యాలను పెంచుతుండడం ఆందోళన కలిగించే అంశం.
నిన్నటివరకు కలిసిఉన్న మిత్రుల మధ్య మనస్పర్థలు చోటుచేసుకుంటున్నాయి. మొదటి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బోధన్ డివిజన్లోని 11 మండలాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. డివిజన్లో మొత్తం 184 పంచాయతీలు ఉండగా.. వాటిలో కొన్ని పంచాయతీలకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. మిగతా 155 సర్పంచ్ స్థానాలకు, ఆ పంచాయతీల్లోని 1060 వార్డులకు ఈ నెల 11న పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ జరిగే 155 సర్పంచ్ స్థానాలకు 519 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావారణం వేడెక్కింది. అభ్యర్థులు ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు సొంత కులానికి చెందిన వారితో కుల రాజకీయాలు చేస్తున్నారు. ఉదాహరణకు సాలూరా మండలంలోని ఒక పంచాయతీలో రెండు ప్రధానమైన కులాలు ఉండగా.. ఆయా కులాలవారు తమ కుల అభ్యర్థి కోసం ఒకటి కావడం గమనార్హం. ఇక, ఎన్నికల్లో ప్రత్యర్థిని ఇరుకున పెట్టేందుకు వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు.
బోధన్ డివిజన్లో ఒకప్పుడు పంచాయతీ ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా జరిగేవి. ఎన్నికల తర్వాత గెలిచిన, ఓడిన అభ్యర్థులు కలిసిపోయేవారు.. ఇప్పుడా పరిస్థితి కనిపించడంలేదు. ఎన్నికల పుణ్యామా అని గ్రామాల్లో వైషమ్యాలు పెరుగుతున్నాయని, మనస్పర్థలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒకే కులం లేదా సామాజికవర్గం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులు పోటీచేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నది. ఈ పరిస్థితి సహజంగానే ఆయా అభ్యర్థుల బంధుత్వాలపై ప్రభావం చూపుతున్నది. డివిజన్లోని అనేక మండలాల్లో ఈ పరిస్థితి కనిపిస్తున్నది. కొన్ని చోట్ల ఎన్నికల్లో కులప్రభావం ఉండగా, ఇటువంటి పంచాయతీల్లో ఒకే సామాజిక వర్గం ప్రజలు చీలిపోవడం స్పష్టంగా కనిపిస్తున్నది.
డివిజన్లోని మేజర్ పంచాయతీల్లో పోటీ మరింత తీవ్రంగా ఉన్నది. ధనం, మద్యం పంపకాల కోసం అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. లక్షలాది రూపాయలను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఏదో రకంగా గెలవాలన్న ధ్యేయంతో డబ్బు పంపకాలకు పోలింగ్ రెండు రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి.
మద్యం పంపకాల కోసం ఇప్పటికే అనేక పంచాయతీల్లో మద్యం రహస్య ప్రదేశాలకు తరలించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు అలవికాని హామీలు ఇస్తున్నారు. ఆ హామీలను నెరవేర్చే అధికారం, అందుకు సంబంధించిన నిధులను సమకూర్చుకోవడం తమ చేతుల్లో లేదని తెలిసి కూడా హామీలు ఇస్తుండడం విస్తుగొల్పుతున్నది. మరో రెండు రోజుల్లో జరిగే పోలింగ్లో అభ్యర్థుల భవితవ్యంపై ఈ ప్రలోభాలు ఏ మేరకు ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే..