నిజామాబాద్, అక్టోబర్ 28, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరోసారి రిక్త‘హస్తమే’ చూపింది. వెనుకబడిన వర్గాలను ఎప్పుడూ చిన్నచూపు చూసే కాంగ్రెస్ పార్టీ.. టికెట్ల కేటాయింపులోనూ మళ్లీ తన బీసీ వ్యతిరేక వైఖరిని చాటుకున్నది. నిజామాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఆరుచోట్ల అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా బీసీలకు కేటాయించక పోవడం విమర్శలకు తావిచ్చింది. ఇక మిగిలిన నిజామాబాద్ అర్బన్లోనూ బీసీలకు అవకాశం కల్పిస్తుందా.. లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. లోక్‌సభ పరిధిలో కనీసం రెండు స్థానాలైనా బీసీలకు టికెట్లు ఇవ్వాలని నియమం పెట్టుకున్న కాంగ్రెస్.. దానికీ కట్టుబడక పోవడంపై బీసీ వర్గాలు మండిపడుతున్నాయి.
బీసీ సంక్షేమం కోసం కృషిచేస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ… వారికి ఢోకా చేసింది. ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కనీసం 2 స్థానాలైనా బీసీలకు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుని వెనక్కి తగ్గింది. ఇందుకు నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో జరిగిన తంతు చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. అధికార బీఆర్ఎస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీల మాటెత్తకుండానే రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకొంటున్నది. బీసీలు ఎవరైనా అసెంబ్లీ స్థానం కోసం పోటీ పడితే వారిపై లేనిపోని బురద రాజకీయం చేసి బయటికి గెంటి వేస్తున్నారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటి వరకు 6 స్థానాలకు మొదటి, రెండు జాబితాల్లో పేర్లు ఖరారయ్యాయి. అర్బన్ నియోజకవర్గంలో ఎవరికి సీటిచ్చేది అన్నది ఎడతెగని ఉత్కంఠగా మార్చారు. ఇక్కడ కూడా ఆ వర్గానికి చోటు దక్కుతుందో లేదన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే మారింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 చోట్ల అగ్రవర్ణాలకే సీట్లు కేటాయించి కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున బీసీలను వంచించిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు గుప్పుమంటున్నాయి.
ఆశలు గల్లంతు…
కాంగ్రెస్ పార్టీలో రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ పనిచేస్తున్న బీసీలకు ఎనలేని అన్యాయం జరుగుతోంది. ఏండ్లుగా జెండా మోసిన వారిని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన జంపింగ్ జపాంగ్‌లకు చోటు దక్కుతోంది. గతంలో ఇతరత్రా పార్టీల్లో పని చేసి పారాచూట్ నేతలకు మాత్రమే కాంగ్రెస్ పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుండడంపై తీవ్ర అసంతృప్తి రగులుతోంది. రూరల్ నియోజకవర్గంలో బీసీ నేతలు ఎందరో ఉన్నప్పటికీ డా.భూపతిరెడ్డికి, ఆర్మూర్ నియోజకవర్గంలోనూ బీజేపీ నుంచి వచ్చి చేరిన వినయ్ రెడ్డికి టికెట్ కేటాయించారు. బోధన్‌లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, బాల్కొండలో ఇతర పార్టీల్లో కొనసాగి వచ్చిన సునీల్ రెడ్డికి టికెట్లు ఇచ్చారు. జిల్లాలో 5 నియోజకవర్గాలకు ఐదు స్థానాలను బీసీలకు కాకుండా ఇతర వర్గాలకే కేటాయించి కాంగ్రెస్ పార్టీ తన నైజాన్ని చాటుకున్నది. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోకి వచ్చే జగిత్యాలలో ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, కోరుట్లలో జువ్వాడి నర్సింగరావులకు టికెట్లు ఇచ్చారు. ఇందులో ఎక్కడా బీసీ నేతలెవ్వరికీ చోటు దక్కకపోవడం విస్మయానికి గురి చేస్తుండగా కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలంతా బీఆర్ఎస్లో చేరేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటి వరకు అభ్యర్థిత్వాలను ప్రకటించిన ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీసీ నేతలు ఉన్నప్పటికీ వారికి అవకాశమే ఇవ్వకుండా కాంగ్రెస్ తొక్కి పెట్టేయడం స్పష్టంగా కనిపిస్తోంది.
కామారెడ్డిలోనూ అంతే…
కామారెడ్డి జిల్లా పరిధిలో నాలుగు అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇవీ జహీరాబాద్ లోక్‌సభ పరిధిలోకి వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఇక్కడ కేవలం ఒకే సీటుకు అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మదన్ మోహన్ రావుకు టికెట్ కేటాయించడం ద్వారా ఈ ప్రాంతంలోనూ బీసీ వ్యతిరేక ముద్రను చాటుకుంది. ఈ ప్రాంతంలో బీసీ నాయకులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ వారిని కనీసం గుర్తించలేక పోయింది. దీంతో వారంతా ఇప్పుడు సమావేశమై పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే మదన్ మోహన్ రావుకు సీటు కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రంగా పోటీకి సై అంటున్నారు. జుక్కల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు స్థానం అయినందున ఇక్కడ అనివార్యంగా ఈ వర్గానికే సీటు కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. మిగిలిన కామారెడ్డి, బాన్సువాడల్లోనూ బీసీలకు మొండి చేయి దిశగానే కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది.