నిజామాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గంలో బొక్కా బోర్లా పడింది. సీఎం కేసీఆర్‌పై పోటీ చేసేందుకు తొడలు కొట్టిన నేతలు నిర్వహించిన తొలి బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పట్టణంలోని ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించిన రణభేరి సభలో బీసీ డిక్లరేషన్‌కు స్పందన కరువైంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరైనప్పటికీ ఎక్కడా జనాల నుంచి అంతగా స్పందన రాకపోవడం గమనార్హం. వరుసగా పలువురు పీసీసీ ముఖ్యలు, సీపీఐ నేతలు నోరు పారేసుకున్నప్పటికీ జనాల నుంచి అంతగా ప్రతిస్పందన రాకపోవడంతో ఒకట్రెండు నిమిషాల్లోనే తమ ప్రసంగాలను మమ అనిపించారు. చివరాఖరకు పీసీసీ చీఫ్ మాట్లాడే సమయానికి సభలో సగానికి ఎక్కువ ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయి. సభలో జనాలే లేకపోవడంతో పీసీసీ చీఫ్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో చేసేది లేక తన రెచ్చగొట్టే వ్యాఖ్యలు, విద్వేషపు మాటలతో ప్రజలను కట్టిపడెయ్యాలని నోటికొచ్చినట్లు మాట్లాడినప్పటికీ జనాల ముందు రేవంత్ రెడ్డి పాచిక పారలేదు. రణభేరి కాస్త వెలవెలబోవడంతో శ్రేణులంతా తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. ఉమ్మడి జిల్లా నేతలతో సభా వేదిక నిండగా… సభకు తరలించిన అరకొర జనంలోనూ ఉమ్మడి జిల్లా నియోజకవర్గాలతో పాటుగా పొరుగున ఉన్న వేములవాడ నుంచి కూడా జనాలను తరలించాల్సిన దుస్థితి హస్తం పార్టీకి ఎదురైంది.
కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌లో వెనుకబడిన వర్గాలకు రాజకీయ అవకాశాలను కల్పించేందుకు నిర్ణయించినట్లు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. లోకల్ బాడీల్లో 23శాతం నుంచి 42శాతం రిజర్వేషన్ పెంచేందుకు నిర్ణయించామని ప్రకటించారు. సీన్ కట్ చేస్తే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనూ బీసీలకు సీటు ఇవ్వకపోవడాన్ని మహేశ్‌కుమార్ గౌడ్ విస్మరించడం శోచనీయం. నిజామాబాద్ అర్బన్ నుంచి ధర్మపురి సంజయ్, ఆకుల లలితతో పాటుగా మహేశ్ కుమార్ గౌడ్ సైతం ఒక దశలో పోటీ పడ్డారు. వీరంతా బీసీ నేతలే. వీరిని కాదని కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీని పట్టుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఆ వర్గాన్ని మోసం చేయడాన్ని ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఆర్మూర్‌లో 2018లో బీసీలకు టికెట్ ఇచ్చారు. ఈసారి ఆ వర్గానికి మొండి చేయి చూపి బీజేపీ నుంచి వచ్చిన వినయ్ కుమార్ రెడ్డికి కేటాయించారు. బాల్కొండలోనూ సునీల్ రెడ్డికి, బోధన్‌లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి, నిజామాబాద్ రూరల్‌లో భూపతి రెడ్డికి టికెట్లు ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో జుక్కల్ ఎస్సీ రిజర్వ్డు స్థానాన్ని వదిలేస్తే బాన్సువాడలో బీసీ లీడర్‌ను పక్కన పెట్టి బీజేపీ నుంచి వచ్చిన ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో స్థానిక బీసీ కాంగ్రెస్ లీడర్ పురుగుల మందు తాగారు. ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ రావుకు టికెట్ కేటాయించారు. ఇక్కడ కూడా 2018లో బీసీకే టికెట్ ఇవ్వగా ఈసారి విస్మరించారు. కామారెడ్డిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపున నామినేషన్ వేశారు. తొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్కటీ బీసీలకు సీటు ఇవ్వని కాంగ్రెస్ పార్టీ.. బీసీలపై మొసలి కన్నీళ్లు పెట్టుకోవడంతో ప్రజలంతా ఆలోచనలో పడ్డారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రసంగమంతా కన్నడ భాషలోనే కొనసాగింది. ఆయన ప్రసంగాన్ని తెలుగులో మరో కాంగ్రెస్ నాయకుడు తర్జుమా చేశారు. అయితే ఈ అనువాదం మక్కికిమక్కి దిగడంతో వ్యాకరణ దోషం, వ్యాక్య నిర్మాణ లోపంతో ప్రజలంతా అర్థం చేసుకోలేక నెత్తి పట్టుకున్నారు. మోదీ రోడ్ షోలతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి భారీ లాభం జరిగిందని సిద్ధరామయ్య అన్నారు. మోదీ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ వచ్చిందని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ వారు ప్రధానిపై ఎక్కువ నమ్మకం పెట్టుకుని గెలుస్తామనుకుంటే బీజేపీ నేల కూలిందన్నారు. తన రాజకీయ జీవితంలో మోదీలాంటి అబద్ధాలకోరును చూడలేదని, భవిష్యత్తులోనూ చూడబోమంటూ సిద్ధరామయ్య విమర్శించారు. తెలంగాణలోనూ ప్రజలకు చెవిలో పువ్వు పెట్టేందుకు మోదీ వస్తున్నారని అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. కేంద్రం లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి ఘోరం గా మారిందన్నారు. లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పారు. హైదరాబాద్‌లో మోదీ నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో బీసీలకు తానే యుగపురుషుడిగా దిగివచ్చినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. దేశంలో వెనుకబడిన బీసీలు మరింత వెనుకబడడానికి నరేంద్ర మోదీయే కారణమన్నారు. కేవలం 4శాతం మాత్రమే ఉన్న నాయకుల మాటలనే మోదీ వింటారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం మోదీ పని చేయరన్నారు. మోదీ బీసీల వ్యతిరేకి అని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్లో ముఖ్యులంతా 4శాతం ఆ వర్గమే ఉందని, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చోటే లేదన్నారు.
సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో ఏదో సాధిస్తామంటూ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీకి ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా రణభేరి సభ చేదు అనుభవాన్ని మిగిల్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై పోటీ చేయలేక మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఏకంగా నియోజకవర్గాన్ని మార్చుకున్నారు. కామారెడ్డిని వదులుకుని నిజామాబాద్ అర్బన్‌కు పలాయనం చిత్తగించారు. షబ్బీర్ స్థానంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతూ కామారెడ్డి వచ్చారు. తీరా చూస్తే తొలి సభనే సక్సెస్ చేసుకోలేక రేవంత్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గ ప్రజల ముందు పరువు పోగొట్టుకున్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన వేదికపై తొమ్మిది నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థులంతా ఆసీనులయ్యారు. ఇందులో ఒక్కరూ బీసీ లీడర్ లేకపోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకునేందుకు జవాబు లభించని దుస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్‌లో ఉన్న చిత్తశుద్ధికి 9 అసెంబ్లీ స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల సామాజిక వర్గీకరణ, సామాజిక కూర్పు ఒక్కటే గీటురాయిగా ప్రజలంతా భావిస్తున్నారు. ఎస్సీ రిజర్వుడు స్థానమైన జుక్కల్ నియోజకవర్గాన్ని వదిలేస్తే మిగిలిన స్థానాల్లో బీసీలకు ఒక్క సీటు కూడా లేకపోవడంపై ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.