నిజామాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/బోధన్, రెంజల్, బోధన్ రూరల్ : తెలంగాణకు పట్టిన గతి తమకు రావొద్దనుకున్నారో ఏమో కానీ మరాఠా ప్రజలు హస్తం పార్టీకి రిక్త ‘హస్తం’ చూపించారు. ప్రచారంలో ఆరు గ్యారంటీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టారు. ఆరు గ్యారంటీ పేరిట కర్ణాటక, తెలంగాణ ప్రజలను నమ్మించినట్లే మహారాష్ట్ర వాసులను బుట్టలో వేసుకోవాలనుకున్న హస్తం నేతలకు పరాభవమే మిగిలింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి మూటగట్టుకున్నది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అక్కడి ప్రజలు కాంగ్రెస్‌ను ఛీకొట్టారు. కర్ణాటక, తెలంగాణలో గద్దెనెక్కాక హామీలను మరిచిన ఆ పార్టీని ఉతికి ‘ఆరే’శారు.
మహారాష్ట్రలో ముమ్మర ప్రచారం చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మరఠ్వాడ ప్రజలు షాక్ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విరివిగా ప్రచారం చేశారు. కానీ, వారు ప్రచారం చేసిన అన్నిచోట్లా హస్తం పార్టీని ఓడగొట్టారు. తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చిన అబద్ధాన్ని మరాఠా ఓటర్లు ఓడించారు.
ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని ఎన్ని గప్పాలు కొట్టినా మహారాష్ట్ర ప్రజలు బోల్తా పడలేదు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సమీపంలోని నాయగావ్, దెగ్లూర్, బోకర్, ముద్ఖేడ్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పక్కనున్న అర్ని, కిన్వట్ నియోజకవర్గాల్లోనూ చతికిలపడింది. ఆదిలాబాద్ తూర్పునున్న మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలతో కలిసి సరిహద్దు పంచుకుంటున్న అహేరి నియోజకవర్గంలో ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది. ఆసిఫాబాద్ పక్కనున్న చంద్రాపూర్ నియోజకవర్గంలోనూ హస్తం పార్టీకి ఓటమి తప్పలేదు.
తెలంగాణకు పశ్చిమ దిక్కున మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానం ఉంటుంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వసంత్‌రావు చౌహాన్ విజయం సాధించారు. ఎంపీగా గెలిచిన రెండు నెలలకే ఆయన మరణించడంతో అసెంబ్లీతో పాటే ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్‌ను ప్రజలు ఓడించినంత పనిచేశారు. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు రాహుల్‌గాంధీతోపాటు తెలంగాణ మంత్రులు, ఎంపీలు నాందేడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రధానంగా తెలంగాణ వాసుల దెబ్బ గట్టిగానే తగిలింది.
ఈ లోక్‌సభ పరిధిలోని నాయ్‌గావ్, దెగ్లూర్, ముఖేడ్, బోకర్‌లో తెలంగాణ వాసులు పెద్దసంఖ్యలో ఉన్నారు. నాందేడ్ నగరంలో 40వేల మంది వరకు తెలుగు మాట్లాడే వారున్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేయలేక ‘చేతు’లెత్తేసిన దరిమిలా.. మహారాష్ట్రలోని తెలుగు వారు నాందేడ్ లోక్‌సభ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో హస్తం పార్టీకి తగిన బుద్ధి చెప్పారు. సిట్టింగ్ స్థానమైన దెగ్లూర్లోనూ కాంగ్రెస్‌కు పరాజయమే మిగిలింది.
మహారాష్ట్రలో దశాబ్దాలుగా నివసిస్తున్న తెలంగాణ వాసులు ‘చేయి’ని మడతపెట్టి దెబ్బకొట్టారు.స్వరాష్ట్రం తెలంగాణలో తమ బంధువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మదిలో పెట్టుకుని ఓటుతో సమాధానమిచ్చారు. ఆరు గ్యారంటీల ఫెయిల్యూర్ స్కీములను అక్కడి తెలుగోళ్లు నమ్మలేదు. తెలుగు భాష పేరుతో ప్రచారానికి వచ్చిన తెలంగాణ ప్రాంత మంత్రులు, ముఖ్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలకు తగు రీతిలో బుద్ధి చెప్పారు. ఇచ్చిన హామీలను 11 నెలల కాలంలో అమలు చేయని అసమర్థ కాంగ్రెస్ తమకు వద్దే వద్దంటూ ఓటుతో తిరస్కరించారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రచారం తమకు లాభిస్తుందని భావించిన ఏఐసీసీ పెద్దలకు నిరాశే మిగిలింది. రేవంత్ అండ్ కో ప్రచారం ఏ మాత్రం ఉపయోగపడలేదన్న చర్చ కాంగ్రెస్‌లో మొదలైంది. జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ ఇన్చార్జిగా ఉన్న నాందేడ్ లోక్‌సభ పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఖాతా తెరువలేదు. ఏఐసీసీ ఆదేశాలతో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పీసీసీ డెలిగేట్స్ అంతా కలిసి ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఎదురైన పరాభవమే తెలంగాణలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల పోరులో కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఏడాది కింద మా పక్కన తెలంగాణాలో కాంగ్రెస్ మస్తు హామీలు ఇచ్చింది. ఆరు గ్యారెంటీలని ఏమో చెప్పిండ్రు.. ఒక్కటి కూడా అమలుకాలేదని తెలంగాణ ప్రజలు అంటుండ్రు.. ఆ ప్రభావం ఇక్కడ చూపించింది. మా నాందేడ్ జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిండు.. ప్రజలు నమ్మలేదు. తెలంగాణాలో హామీలు ఇచ్చి అమలు చేయని కాంగ్రెస్‌కు ఇక్కడ ఓట్లు వేయలేదు.
– చంద్రకాంత్ లోకాండె, సగ్రోలి పాఠక్, సరిహద్దు గ్రామాల సమస్యల పోరాట కమిటీ కో-ఆర్డినేటర్, దెగ్లూర్ – బిలోలి నియోజకవర్గం, మహారాష్ట్ర
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు.. తెలంగాణాలో బీఆర్ఎస్ సర్కార్ రైతుబంధు ఇచ్చింది. కాంగ్రెస్ వచ్చినంక రైతుబంద్ బంద్ చేసిండ్రు.. ఇక్కడ రైతులకు అటువంటి స్కీమ్‌లు కాంగ్రెస్ ఇస్తదన్న నమ్మకం లేకుండా పాయె.. కాంగ్రెసోళ్లు అది చేస్తాం.. ఇది చేస్తాం అని ప్రచారం చేసిండ్రు.. ఎవరూ వాళ్ల మాటలు పట్టించుకోలేదు..
– మారుతీ పటేల్, రైతు, కార్ల పాఠక్, దెగ్లూర్ – బిలోలి నియోజకవర్గం, మహారాష్ట్ర
మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.3 లక్షల రుణమాఫీ చేస్తామన్నరు.. అయినా.. మేం నమ్మలేదు. తెలంగాణలో కూడా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు.. చెప్పినంక ఏడాదికి రుణమాఫీ చేసిండ్రు.. అయితే, అందరికీ చేయలేదని తెలిసింది. తెలంగాణలో రూ.2 లక్షలే రుణమాఫీ చేయనోళ్లు ఇక్కడ ఏం చేస్తారు అని ప్రజలు అనుకున్నారు. కాంగ్రెసోళ్లు చెప్పిన మాటలు వినకుండా.. ఆ పార్టీకి ఓట్లేయలేదు..
– పర్చూరి, రైతు, ఏస్గీ, దెగ్లూర్ – బిలోలి నియోజకవర్గం, మహారాష్ట్ర
మా మరాఠ్వాడాలో కాంగ్రెస్ పార్టీ మస్తు హామీలు ఇచ్చినా ఎవరూ నమ్మలేదు.. నేను కూడా కాంగ్రెస్‌కు ఎన్నోసార్లు ఓటేశాను.. ఇప్పుడు ఆ పార్టీకి ఓటేయడం లేదు. మాకు పక్కనే తెలంగాణ సరిహద్దు గ్రామాలతో బంధుత్వాలు ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతున్నదో ఇక్కడి మందికి తెలిసిపోయింది. కాంగ్రెసోళ్లు రైతుబంధు ఆపివేసిండ్రని, రుణమాఫీ ఫుల్‌గా చేయలేదని ఇక్కడి మంది చెప్పుకుంటున్నరు. అక్కడ చేయనివాళ్లు ఇక్కడ ఎందుకు చేస్తారని అనుకుని కాంగ్రెస్‌కు ఓటేయలేదు.
– సుభాష్ దిగంబర్‌రావు నర్ధావార్, రైతు, నాయగావ్, నాయగావ్ అసెంబ్లీ నియోజకవర్గం, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం మహారాష్ట్రలో ఏమాత్రం ప్రభావం చూపలేదు. సాధ్యం కాని పథకాలను ఇక్కడి ఓటర్లను ఆకర్షించేందుకు రేవంత్‌రెడ్డి చేసిన మంత్రం బెడిసికొట్టింది. తెలంగాణ మంత్రులు, ఎంపీలు చెప్పిన మాయమాటలకు ఇక్కడి ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పారు.
– సాయినాథ్ సిర్పూరే, ధర్మాబాద్
తాము అధికారంలోకి వస్తే లాడ్కీ బైన్ యోజన పథకాన్ని రెట్టింపు చేస్తాం, ఫ్రీ బస్, ఇంటికో ఉద్యోగం ఇస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించినా.. ఓటర్లు తిరస్కరించారు. మోదీతోనే అభివృద్ధి సాధ్యమని అన్ని పట్టం కట్టారు. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న లాడ్కీ బైన్ యోజన అడపడుచులకు అపన్నహస్తంగా ధైర్యాన్ని ఇచ్చింది.
– వీరాలాల్ గోజాన్ జైన్, ధర్మాబాద్