నస్రుల్లాబాద్, నవంబర్ 21 : దశాబ్దాలుగా జెండా మోసిన వారిని కాదని వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. పార్టీ నాయకత్వ తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో గురువారం ధర్నాకు దిగారు. బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల పరిధిలో సీనియర్ కార్యకర్తలు ఉన్నా.. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన దుర్గం శ్యామలకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాదని ఇటీవల కాంగ్రెస్‌లోకి వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరులకు పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తమ ఆవేనను పార్టీ పెద్దలు గుర్తించక పోతే హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఎదుట నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌ను తొలగించి.. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, జహీరాబద్ ఎంపీ సురేశ్ షెట్కార్ ప్రతిపాదించిన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు బసవరాజ్, దివిటి శ్రీనివాస్, అబ్దుల్ అహ్మద్, పోగు నారాయణ, కమలాకర్‌రెడ్డి, అరిగె సాయిలు, లక్ష్మణ్, కార్యకర్తలు పాల్గొన్నారు.