నిజామాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :నిజామాబాద్ నగరానికి చెందిన మైనార్టీ నేతలు భారీ సంఖ్యలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. నిజామాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో భారీగా చేరికలు జరిగాయి. నగరంలోని డివిజన్ 12, 30, 31 నుంచి మ హ్మద్ ఇర్ఫాన్, మహ్మద్ మాజీద్, మహ్మద్ జైను, మహ్మద్ నయీం, మ హ్మద్ అలీం నేతృత్వంలో పెద్ద సంఖ్యలో చేరిన మైనార్టీలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కేసీఆర్‌పై ప్రజల్లో ప్రేమ తగ్గలేదని, అందుకు నిదర్శనమే ఈ చేరికలు అని పార్టీ నేతలు తెలిపారు.
బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో వెలుగులు విరజిమ్మితే ఇప్పుడు అంధకారం అలుముకున్నదని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. తాము పెట్టిన చెట్లకు ప్రస్తుత ఎమ్మెల్యే కనీసం నీళ్లు కూడా పోయించడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినప్పటికీ పార్టీలో చేరుతామంటూ మైనార్టీ యువత పెద్ద ఎత్తున ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. ‘మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏమీ చేయట్లేదని ప్రజలకు అర్థమైంది. పేదల ప్రభుత్వంగా గుర్తింపు పొందిన బీఆర్ఎస్ పార్టీని అనవసరంగా వదులుకున్నామని ఇప్పుడు బాధ పడుతున్నారని’ బిగాల తెలిపారు.
‘మా పాలనలో కేసీఆర్ కిట్, షాదీముబారక్, ఆసరా పింఛన్లు ఇలా ఒకటేమిటి అనేక పథకాలను అందించాం. పేదల కోసం ఆలోచించిన వ్యక్తి కేసీఆర్ మాత్రమే. మా హయాంలో నిజామాబాద్ అర్బన్‌లో గల్లీ గల్లీలో చమ్కా దియా. ఇప్పుడు నిజామాబాద్ హాలత్ మొత్తం ఖరాబ్ అయ్యిందని’ అన్నారు. రానున్న రోజులు బీఆర్ఎస్వే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గులాబీ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు 10 సీట్లు కూడా రావన్నారు. కేసీఆర్ సీఎం కావడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయన్నారు. పదేండ్ల పాలన తర్వాత బీఆర్ఎస్పై వ్యతిరేకత వస్తే, 10 నెలల్లోనే కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని తెలిపారు.
బీఆర్ఎస్లో చేరిన మైనార్టీ యువకులను చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో బిగాల గణేశ్ గుప్తా 50 వేల మెజార్టీతో గెలవడం ఖాయంగా కనిపిస్తున్నదని జీవన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే మార్పు వస్తదని అన్నారని, మార్పు ఏమిటో ప్రజలకు బాగానే అర్థమైందన్నారు. ‘మార్పు కావాలంటే బాగా మార్పు తెచ్చిండు. మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదు. బీఆర్ఎస్ను ఓడించినందుకు మాకు అనుభవం అయ్యిందని అంటున్నారని’ జీవన్‌రెడ్డి తెలిపారు. గల్లీలో, గ్రామాల్లో ఎక్కడ చూసినా సార్ కావాలి. కేసీఆర్ రావాలి అంటున్నారన్నారు.
బడే భాయ్ మోదీ ఎయిర్పోర్ట్, సీ పోర్ట్ అమ్మితే.. చోటే భాయ్ రేవంత్‌రెడ్డి ఒకడుగు ముందుకేసి యూనివర్సిటీ భూములు అమ్ముతున్నాడని మండిపడ్డారు. గిరిరాజ్ కాలేజీతో పాటు ఆర్మూర్‌లోని 60 ఎకరాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములపై కాంగ్రెస్ నేతలు కన్నేసినట్లు తెలిసిందనారు. హెచ్‌సీయూ భూములను అమ్మనిస్తే వచ్చే రోజుల్లో నిజామాబాద్, ఆర్మూర్‌లో భూములను కాంగ్రెస్ నేతలు అమ్మేస్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు సుజిత్‌సింగ్ ఠాకూర్, నీతూకిరణ్, ప్రభాకర్‌రెడ్డి, సత్యప్రకాశ్, జగత్‌రెడ్డి, మతిన్, ఇమ్రాన్, నవీన్ ఇక్బాల్, సనాఉల్లా తదితరులు పాల్గొన్నారు.