డిచ్పల్లి, జూలై 24 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో పూర్తిగా విఫలమైందని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, సంక్షేమపథకాలను కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారని ఆరోపించారు. డిచ్పల్లి ఖిల్లా రామాలయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ..కేటీఆర్ ప్రతిపక్ష హోదాలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలు, అన్యాయాలు, సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న అవినీతిని ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దౌర్జన్యాలు, అరాచకాలను ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఎదుర్కొని ముందుకు వెళ్తున్నారని తెలిపారు.
కార్యకర్తలకు తానెప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గడిచిన పదేండ్లలో రాష్ట్రం ఎలా ఉండేదని, కాంగ్రెస్ పాలనలో ఎలా ఉందనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం రేవంత్‌రెడ్డి తరం కాదన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 60 శాతం సీట్లను గెలుచుకుంటుందని బాజిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోర్టు మొట్టికాయలు వేయడంతో రేవంత్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూ హడావుడి చేస్తుందే తప్ప అమలుకు నోచుకోదన్నారు. అసెంబ్లీలో బీసీ తీర్మానం చేసిన వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లినట్లయితే ఇప్పటికే బీసీ రిజర్వేషన్ బిల్లు పాసయ్యే అవకాశం ఉండేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రె స్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సక్రమంగా లేదని బీజేపీ తప్పుబట్టిందని, బీసీ రిజర్వేషన్‌కు వారు మద్దతు తెలిపే అవకాశం లేదని అన్నారు. కులగణనలో 16 లక్షల మంది బీసీలను తగ్గించి ఓసీ జనాభాను పెంచి చూపించారని ఆరోపించారు.