బోధన్, ఫిబ్రవరి 23: ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక తీరును పరిశీలిస్తే సర్కార్ బడులను, చిన్న చిన్న బడ్జెట్ స్కూళ్లను దెబ్బతీయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తున్నదని ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్- నిజామాబాద్ జిల్లాల బీఎస్పీ పట్టభద్రుల అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ విమర్శించారు. బోధన్ పట్టణంలో పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా ఒక కార్పొరేట్ విద్యాసంస్థ యజమాని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని నిలబెట్టిందని, దీన్నిబట్టి కాంగ్రెస్ అసలు ఉద్దేశంపై అందరిలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఆయన గెలిస్తే తన విద్యా వ్యాపారం కోసం మరిన్ని బ్రాంచీలను ఏర్పాటుచేసి చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్లను మింగేసే ప్రమాదం లేకపోలేదన్నారు. ఇలాంటి రేపటి రోజున సర్కారు బడుల సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలపై శాసనమండలిలో ఏం మాట్లాడగలుగుతారని ప్రశ్నించారు.
నిరుద్యోగులు, ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలు తెలియనివారు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని విమర్శించారు. తాను గెలిస్తే ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరుద్యోగుల సమస్యల కోసం పోరాడుతానని హామీ ఇచ్చారు విద్యా వ్యవస్థ బలోపేతం కోసం తనకున్న అనుభవం, ఆలోచన పరిజ్ఞానంతో కృషి చేస్తానన్నారు. పట్టభద్రుల గొంతుక అవ్వాలన్న ఉద్దేశంతోనే తాను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. 16 సంవత్సరాలుగా తన వేతనంలో 30 శాతం మొత్తాన్ని పేద విద్యార్థుల కోసం ఖర్చు చేస్తున్నానని చెప్పారు.
తనను ఎమ్మెల్సీగా గెలిచినట్లయితే నిరుద్యోగులకు ఉచిత కోచింగులు ఇప్పిస్తానని, జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తానని, జాబ్ క్యాలెండర్ ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని, గ్రంథాలయాల్లో ఉచిత మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయిస్తానని ప్రసన్న హరికృష్ణ హామీ ఇచ్చారు.. ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాడుతానన్నారు. విలేకరుల సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర నాయకుడు నీరడి ఈశ్వర్, బీఎస్పీ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల అధ్యక్షులు సింగాడే పాండు, హరిలాల్, నాయకులు దాసరి శ్యామ్, నీరడి శంకర్, గౌతమ్, ఇందూర్ సాయిలు, సుభాష్, సాయి చరణ్, సాగర్, పెద్ద సాయిలు, పవన్ తదితరులు పాల్గొన్నారు.