నిజామాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రేవంత్ సర్కారు అబద్ధాలకు అంతే లేకుండా పోయింది. చేసే పనులకు, చెప్పే మాటలకు పొంతనే ఉండడం లేదు. రైతులందరికీ రూ.2 లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. పూర్తి స్థాయిలో అమలు చేయలేక చేతులెత్తేసింది. కానీ, వంద శాతం రుణమాఫీ చేశామని రేవంత్రెడ్డి ప్రకటించడం రైతులను గందరగోళంలోకి నెట్టేసింది. క్షేత్ర స్థాయిలో లక్షలాది మంది అన్నదాతలకు రుణమాఫీ వర్తించనే లేదు. రూ.లక్షలోపు ఉన్న రుణాలు సైతం మాఫీ కాలేదు. నాలుగో విడుత జాబితాలోనూ పేర్లు లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదేది పట్టని ప్రభుత్వం మాత్రం నూటికి నూరు శాతం రుణమాఫీ చేశామని చెప్పడం కర్షకులను కలవరపాటుకు గురి చేస్తున్నది.
రుణమాఫీ గందరగోళానికి వ్యవసాయ శాఖ పనితీరే ప్రధాన కారణం. జాబితా రూపకల్పనలో చోటు చేసుకున్న తప్పిదాల మూలంగా రైతులు నష్టపోతున్నారు. మరోవైపు సొసైటీల్లోనూ రుణాల రికార్డుల నిర్వహణలో గందరగోళమూ ఈ పరిస్థితికి కారణమైంది. పర్యవేక్షించాల్సిన జిల్లా ఉన్నతాధికారులు సైతం మిన్నకుండిపోవడంతో వ్యవసాయ శాఖ గాడి తప్పింది. కలెక్టర్ ఆదేశాలు సైతం సరిగా అమలు కావడం లేదు. రైతును ప్రభుత్వ ఉద్యోగిగా చూపించి నవ్వుల పాలైన వ్యవసాయ శాఖ కనీసం తన తప్పును సరిదిద్దుకోలేక పోయింది. అదే తప్పును నాలుగో విడుత వరకూ గుర్తించలేక చతికిలపడింది. మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన దళిత రైతు సుమన్ ఉదంతమే జిల్లా యంత్రాంగం పనితీరుకు అద్దం పడుతున్నది. దళిత రైతుకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు పట్టనట్లుగా వ్యవహరించడం గమనార్హం.
కాంగ్రెస్ ప్రభుత్వం పంద్రాగస్టు వరకు నాలుగు దఫాల్లో రుణమాఫీ నిధులు మంజూరు చేసింది. జూలై 18న రూ.లక్షలోపు రుణాలను, జూలై 31న రూ.లక్షన్నరలోపు రుణాలను, ఆగస్టు 15న రూ.లక్షన్నర నుంచి రూ.2లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తున్నట్లు తెలిపింది. నవంబర్ 30న నాలుగో విడుత నిధులు విడుదల చేసింది. పేరుకు రూ.2లక్షల్లోపు రుణాలు రద్దు చేశామని ప్రకటించుకున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. రూ.లక్ష లోపు రుణాలు ఉన్న వారికీ సైతం మాఫీ కాని రైతులు కూడా ఉన్నారు. ఒకింట్లో ప్రభుత్వ ఉద్యోగికి రుణమాఫీ మంజూరైతే, మరో ఇంట్లో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ మాఫీ కాలేదు. ఇదేందని అడిగితే వ్యవసాయ శాఖ అధికారులు సమాధానం చెప్పలేక దాటవేస్తున్నారు. ఏం జరిగిందో చెప్పకుండా వస్తది పో… అంటూ గర్జిస్తూ రైతులను వెనక్కి పంపుతున్నారు. రుణమాఫీ వర్తించని వారంతా ఫోన్లు చేస్తుండడంతో ఏఈవోలు, ఏవోలు ఫోన్లు స్విచాఫ్ చేస్తున్నట్లు తెలిసింది. నిజామాబాద్ జిల్లాలో 2,03,520 మందికి పైగా రుణాలు తీసుకున్న అర్హులైన రైతులున్నారు. ఇందులో మూడో విడుతల్లో కలిపి 83,061 మందికి సంబంధించిన రూ.626కోట్లు రుణాలు మాఫీ అయ్యాయి. నాలుగో విడుతలో 17,551 మంది రైతులకు రూ.155.81 కోట్లు రుణాలు రద్దు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించారు. మరీ రైతు వేదికల వద్ద రుణమాఫీ కోసం ఆందోళనకు దిగుతున్న వారు ఎవరన్నది అధికారులే సమాధానం చెప్పాలి.
మూడు విడుతల్లో వెలుగుచూసిన తప్పులే నాలుగో విడుతలోనూ పునరావృతమయ్యాయి. ఆగస్టు 15 తర్వాత జరిగిన తపొ్పుప్పుల సవరణలో వ్యవసాయ శాఖ ఏం చేసిందన్నది చర్చనీయాంశమైంది. అధికారుల తప్పిదం మూలంగా నాలుగు విడుతల్లోనూ మాఫీ వర్తించని రైతులు రైతువేదికలకు పరుగులు తీస్తున్నారు. కానీ వారిని పట్టించుకునే వారే కరువయ్యారు. గతంలో కేసీఆర్ హయాంలో రుణమాఫీ చేసిన లెక్కల ప్రకారం పోల్చితే.. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2,03,520 మంది రైతులున్నారు. వీరిలో 1,00,555 మందికి రూ.781 కోట్ల పంట రుణాలు రద్దయ్యాయి. ఇంకా 1,02,265 మందికి రుణమాఫీ వర్తించలేదు. కామారెడ్డి జిల్లాలో 1.76 లక్షల మంది రైతులకు గాను 1,01,417 మందికి రూ.736 కోట్ల రుణాలు రద్దయ్యాయి. ఇంకా 75 వేల మందికి రుణమాఫీ వర్తించలేదు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వమేమో నూటికి నూరు శాతం పంట రుణాలు రద్దుచేశామని అసత్యాలు వల్లే వేయడం గమనార్హం
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రూ.2లక్షలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పింది. నేను రైతును. నాకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదో అధికారులు సమాధానం చెప్పాలి. సీఎం రేవంత్రెడ్డి అధికారంలోకి రాగానే రూ.2లక్షలు రుణ మాఫీ అందిస్తామని వివిధ సభల్లో చెప్పారు. ఇప్పటివరకు ఆచరణకు రాలేదు.
-తీగల మహేందర్, వేల్పూర్ మండలం
వేల్పూర్, డిసెంబర్ 3: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులందరికీ రుణమాఫీ అందిస్తామని చెప్పి మోసం చేసింది. కొన్ని గ్రామాల్లో కొందరికే రుణమాఫీ చేసి అందరికీ చేశామని చెబుతున్నది. నాకు రూ. 2 లక్షల రుణం ఉంది..కానీ ఇంతవరకు మాఫీ కాలేదు.
– పాలెపు బాలరాజు, మోతె, aవేల్పూర్ మండలం