ఏర్గట్ల, మే 6: ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు మండల కేంద్రంలోని అమర వీరుల స్తూపం వద్ద బుధవారం రాస్తారోకో చేపట్టారు. నల్ల జెండాలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. కొర్రీలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తున్నదని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతున్నదని మండిపడ్డారు. వడ్లు, మక్కలు కొనుగోలు చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రోడ్డుపై బైఠాయించిన రైతులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, వారు అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి తహసీల్ ఆఫీస్ ఎదుట బైఠాయించారు.
ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని మల్లేశ్ అనే రైతు గడ్డిమందుతో తహసీల్ ఆఫీస్కు వచ్చి ఆవేదన వ్యక్తంచేశాడు. దొడ్డు రకం కొనుగోలు చేయబోమని ప్రభుత్వం ముందే చెబితే తాము వాటిని పండించే వారిమి కాదన్నారు. తక్షణమే ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అకాల వర్షానికి తడిసిన ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ మల్లయ్యకు రైతులు వినతిపత్రం అందజేశారు.
ధాన్యాన్ని తరలించడానికి లారీలు దొరక్క ఆలస్యం అవుతున్నదని తహసీల్దార్ ఈ సందర్భంగా రైతులకు తెలిపారు. ఆందోళన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణానందం, బీజేపీ జిల్లా నాయకుడు నారాయణ రెడ్డి, ఏర్గట్ల, బట్టాపూర్, దోంచంద సర్పంచులు ఉపేందర రెడ్డి, ప్రవీణ్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ మధు, నాయకులు బద్దం శ్రీను, లింగారెడ్డి, నర్సయ్య, సాగర్ తదితరులు పాల్గొన్నారు.