హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యుత్తు స్టోర్లలో ‘నో స్టాక్’ అటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. డబ్బులు చెల్లించి నెలలు గడుస్తున్నా మెటీరియల్ లేక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు, వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో మాదిరిగా టర్న్‌కీ సిస్టమ్‌లో కాకుండా ప్రస్తుతం టెండర్ విధానంలో క్షేత్రస్థాయిలో పనులు కేటాయిస్తున్నారు. అలా దక్షిణ డిస్కమ్ (ఎస్పీడీసీఎల్) పరిధిలోని 21 సర్కిళ్లలో టెండర్లు పిలిచి పనులు కేటాయించారు. ఆ పనులు జరగాలంటే సామాగ్రి కావాలి. అందుకోసం స్టోర్లకు వెళ్తే ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డీటీఆర్లు, సీటీమీటర్లు తదితర వస్తువులు లేక కాంట్రాక్టర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు చెల్లించి నెలలు గడిచినా ఇప్పటివరకు వారికి సామగ్రి ఇవ్వకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. మరోవైపు ప్రస్తుత వర్షాకాలంలో చేపట్టాల్సిన అత్యవసర పనులకు కూడా సామగ్రి అందుబాటులో లేకపోవడంతో సెక్షన్ కాంట్రాక్టర్లు బయట నుంచి సామగ్రి కొనుగోలు చేసి పనులు చేయాల్సి వస్తున్నది. ఈ భారాన్ని మోయలేకపోతున్నామని సదరు కాంట్రాక్టర్లు మొరపెట్టుకుంటున్నా సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో పలు చోట్ల అత్యవసర పనులను కూడా నిలిపివేసినట్టు సమాచారం.
చేతులెత్తేసిన ఎస్పీడీసీఎల్
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో 60 లక్షలకుపైగా విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో రోజురోజుకూ వినియోగదారులు పెరుగుతున్నారు. వీరికి విద్యుత్తు కనెక్షన్లు అందించేందుకు అవసరమైన సామగ్రిని ఎస్పీడీసీఎల్ సరఫరా చేయలేకపోతున్నది. అరకొరగా ఉన్న సామగ్రిని లంచాలు ఇచ్చిన వారికి, ప్రజాప్రతినిధుల సిఫారసు ఉన్నవారికే ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొత్త ఇండ్లు, కమర్షియల్ కాంప్లెక్సులకు కరెంట్ కనెక్షన్లు పెట్టుకోవాలన్నా, ట్రాన్స్ఫార్మర్లు తెచ్చుకోవాలన్నా విద్యుత్తు శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. గతంలో టర్న్‌కీ విధానంలో ఈ పనులు జరిగేవి. కానీ, గత 2-3 నెలలుగా విద్యుత్తు శాఖ తరపున టెండర్లు పిలిచి పనులు కేటాయిస్తున్నారు. ఇందుకోసం వినియోగదారుల నుంచి ముందస్తుగానే మొత్తం డబ్బులు కట్టించుకుంటున్నారు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోగా కనెక్షన్లు ఇవ్వాలి. కానీ, స్టోర్లలో మెటీరియల్ కొరత వల్ల కనెక్షన్లు, ఇతర పనులన్నీ అటకెక్కాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొద్దిపాటి సామగ్రితో కొన్ని చిన్నచిన్న పనులే చేయగలుగుతున్నామని, పెద్ద పనులు చేయలేకపోతున్నామని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. కనీసం ఏబీ స్విచ్‌లు, బుష్‌లు, కండెన్సర్లు తదితర సామాగ్రి కూడా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అత్యవసర పనులకు అవసరమైన సామగ్రి కూడా అందుబాటులో లేకపోవడంతో తామే బయట స్టోర్ల నుంచి మెటీరియల్ తీసుకొచ్చి పనులు చేస్తున్నామని కొందరు కాంట్రాక్టర్లు చెప్పారు. ఈ మెటీరియల్‌ను మళ్లీ డిస్కమ్ స్టోర్ల నుంచి పొందడం చాలా కష్టమని, గతంలో చేసిన పనులకు సంబందించిన మెటీరియల్ ఇప్పటివరకు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డీటీఆర్లు, సీటీమీటర్లు, కేబుళ్లు లేవు
ఎస్పీడీసీఎల్ పరిధిలో జిల్లాకొక స్టోర్ ఏర్పాటు చేసినప్పటికీ డీటీఆర్లు, సీటీమీటర్లు, కేబుళ్లు, ఇతర సామగ్రి అందుబాటులో లేదు. చాలా స్టోర్లలో ఒక వస్తువు ఉంటే మరో వస్తువు ఉండటం లేదు. ఈ సమస్యను ఇప్పటికే పలుమార్లు డిస్కమ్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. డిస్కమ్ స్టోర్లలో తప్పనిసరిగా అన్ని రకాల మెటీరియల్ అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఇటీవల నిర్వహించిన సమీక్షలో విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు. కానీ, క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలు అమలైన దాఖలాలు లేవు. చాలా స్టోర్లలో 25 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు లభిస్తున్నప్పటికీ 63 కేవీఏ, 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు, డీటీఆర్లు, కేబుళ్లు అందుబాటులో లేవు. కొన్ని స్టోర్లలో ఈ సామగ్రి ఉన్నప్పటికీ అధికారులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
కాంగ్రెస్ నేతల దందా వల్లే..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఈ పరిస్థితి దాపురించిందని, ఆ పార్టీ నేతల కమీషన్ల దందా అన్ని వస్తువులకు పాకడంతో కంపెనీలు సామాగ్రి సరఫరాకు ముందుకురావడం లేదని విద్యుత్తు శాఖలోని ఓ సీనియర్ అధికారి చెప్పారు. ఒకవేళ మెటీరియల్ సరఫరా చేసేందుకు ఏదైనా కంపెనీ ముందుకొచ్చినప్పటికీ కమీషన్లల్లో తేడావస్తే టెస్టులో ఆ సామగ్రి ఫెయిలైందని చెప్తున్నారని, అందుకే డీటీఆర్లు, కేబుళ్లు, ఇతర మెటీరియల్ నెలల తరబడి అందుబాటులో ఉండటం లేదని తెలిపారు. చిన్న వస్తువుల నుంచి డీటీఆర్‌ల వరకు ప్రతి మెటీరియల్‌ను బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి రావడం కాంట్రాక్టర్లకు పెనుభారంగా పరిణమించింది. అయినప్పటికీ ఆ మెటీరియల్‌లో నాణ్యత లోపిస్తే తాము బాధ్యత వహించబోమని ఎస్పీడీసీఎల్ అధికారులు తేల్చిచెప్తున్నారు. దీంతో ఆ డిస్కమ్ స్టోర్లలో సామగ్రి అందుబాటులో ఉన్నప్పుడే తీసుకోవాలని కాంట్రాక్టర్లు నిర్ణయించుకున్నట్టు తెలిసింది.