నిజామాబాద్, జూన్ 11, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సన్న వడ్లకు బోనస్ డబ్బులు జమ కావడం లేదు. ఒక్క గింజకు కూడా బోనస్ వర్తించడం లేదు. ధాన్యం సేకరించడమే గగనం అనే స్థాయిలో పరిస్థితి దాపురించడంతో బోనస్ కోసం రైతులు విసిగి వేసాగిపోతున్నారు. అన్ని రకాల పంటలకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందిస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం నిర్వహించాడు. రైతు డిక్లరేషన్‌లోనూ ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బోనస్ అటకెక్కింది.
ఎప్పుడు అమలవుతుందో? ఎప్పుడు నిలిచి పోతుందో అర్థం కాని దుస్థితిలో బోనస్ పథకం మునిగి తేలి పోయింది. 2026 యాసంగిలో సేకరించిన సన్న వడ్లకు పైసా జమ చేయకపోవడం విడ్డూరంగా మారింది. రైతులను నిలువునా దగా చేస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 2025 యాసంగిలోనూ ఇదే విధంగా బోనస్ పథకానికి పంగనామాలు పెట్టారు. తాజాగా మరో సీజన్‌కు పథకం అమలు చేయకుండా చేతులు ఎత్తేశారు. రైతులకు బోనస్ బకాయిలు రూ.వేల కోట్లలో జమ అయ్యాయి. వీటి చెల్లింపులపై ప్రభుత్వం నోరు విప్పకపోవడం విడ్డూరంగా మారింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాయి పడ్డది. రైతుభరోసా పెట్టుబడి సాయంతో పాటుగా సన్న వడ్ల బోనస్ చెల్లింపుల్లోనూ తీవ్రంగా విఫలమైంది. రెండు పంట కాలాల్లో బోనస్ చెల్లించాల్సిన మొత్తం విలువ కుప్పలు తెప్పలుగా చేరినప్పటికీ సర్కారు స్పందించడం లేదు. గతేడాది 2025 యాసంగికి బోనస్ రూపంలో సన్న వడ్లకు క్వింటాకు రూ.500 చిల్లి గవ్వ చెల్లించలేదు. సన్న వడ్లకు డబ్బులు వస్తాయని భావించగా రైతులంతా దగా పడ్డారు.
ఏడాది దాటింది. మరో యాసంగి సీజన్ ముగిసింది. 2026 యాసంగి ముగిసి వానాకాలం సీజన్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు తాజాగా ముగిసిన యాసంగిలోనూ పైసా బోనస్ జమ కాలేదు. గతేడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.449 కోట్లు మేర బకాయిలు పేరుకు పోయాయి. నిజామాబాద్ జిల్లాలో రూ.360 కోట్లు, కామారెడ్డి జిల్లాలో రూ.89కోట్లుగా ఉంది. మొన్న ముగిసిన యాసంగి సీజన్లో సన్న వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున లెక్కిస్తే బోనస్ మొత్తం రూ.364.25కోట్లుగా ఉంది. కామారెడ్డి జిల్లాలో క్వింటా సన్న వడ్లకు రూ.115కోట్లుగా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.479.25కోట్లు బోనస్‌కు నిధులు చెల్లింపులు చేయాలి. రెండు యాసంగి సీజన్లలో బకాయిలు కలిపితే మొత్తం బకాయిలు రూ.928.25కోట్లు అంటే దాదాపుగా రూ.వేయి కోట్లకు చేరువైంది.
కర్షకులకు కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా మోసం చేస్తోంది. చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే ఉండటం లేదు. అధికారంలోకి రాక ముందు ఒక మాట… వచ్చిన తర్వాత మరో మాట అన్నట్లుగా పాలకులు ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విశ్వసనీయత అన్నదే అర్థం లేకుండా పోయింది. తద్వార అడుగడుగునా రైతులంతా దగా పడుతున్నారు. కేసీఆర్ పాలనలో కొండంత అండ లభించింది. కానిప్పుడు పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాటలకు చేతలకు పొంతనే ఉండటం లేదు.
రైతుభరోసా పథకం విషయంలో పూటకో తీరులో మాట్లాడి నవ్వుల పాలవుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఆధారరహితంగా నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు. రుణమాఫీ అందరికీ వర్తింపజేశామని చెప్పుకుని తిరుగుతున్నాడు. కానీ క్షేత్ర స్థాయిలో ఎవ్వరికీ పూర్తి స్థాయిలో రుణాల రద్దు కాలేదు. రైతుభరోసా అందరికీ ఇచ్చామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. మొన్న యాసంగిలో వరి కోత దశలో రెండు ఎకరాలకే పెట్టుబడి సాయం అందించి కాంగ్రెస్ ప్రభుత్వం నవ్వుల పాలైంది. ఇలా బోనస్ పథకం అమలవుతోన్న తీరు హాస్యాస్పదంగా మారడంతో రైతులంతా లబోదిబోమంటున్నారు. సన్న వడ్లకు బోనస్ వస్తుందని ఎంతో ఆశగా పంటలు సాగు చేశామని చెబుతున్నారు. కానిప్పుడు క్వింటాకు రూ.500 వర్తింపజేయకపోవడం అన్యాయమని రేవంత్ రెడ్డిపై రైతులు మండిపడుతున్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన 8 రకాల సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం దారుణం. ఏ సన్న రకం వరి పండించినా బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిబంధనలు విధించడం సరికాదు. రైతు తన భూమిలో ఏ రకమైన ధాన్యం ఎక్కువ దిగుబడి వస్తుందో ఆ రకం ఎంచుకొని సాగుచేస్తాడు. ప్రభుత్వం సూచించిన సన్న రకం వడ్లు మాకు సాగు చేయాలని ఉన్నా మా నేలలు సహకరించకపోతే ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఏ రకం వడ్లయినా బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
-నారెడ్డి దశరత్‌రెడ్డి, మాజీ ఎంపీపీ,రామారెడ్డి
బోనస్ డబ్బులు అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం మా పై కేసులు నమోదు చేసింది. రైతులు, కౌలు రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి, హామీని మరిచిపోయింది. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క మా గ్రామం సిరికొండ మీదుగా వెళ్తుండగా బోనస్ గురించి అడిగాం. మా దుస్తులను చూసి మీరు రైతులు కాదు బీఆర్ఎస్ నాయకులని, రైతులకు బోనస్ డబ్బులు ఎప్పుడో వారి ఖాతాల్లో జమచేశామని చెప్పారు. ఐదుగురు సామాన్య రైతులపై కేసులు పెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది. అక్రమ కేసులను ఎత్తివేసి, బోనస్ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
-ల్యాగల మహిపాల్, రైతు, సిరికొండ