మోర్తాడ్, ఏప్రిల్1 : ఇంటింటికీ శుద్ధ జలాలు అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికీ గ్రామాలకు భగీరథ నీళ్లు సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో మిషన్ భగీరథ నిర్వహణపై నిర్లక్ష్యం నెలకొన్నది. దీంతో చాలా గ్రామాల్లో నీళ్లు రాని పరిస్థితి ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో కలుషిత నీరు రావడం, రంగుమారడం పరిపాటిగా మారింది. మరికొన్ని గ్రామాల్లో పురుగులు ఉన్న నీళ్లు వస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వేసవి కాలం రావడంతో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మిషన్‌భగీరథ ఏర్పాటుకు ప్లాంట్ నుంచి ఇంటికి వచ్చే నల్లా కనెక్షన్ వరకు చేపట్టిన పనులకు ప్రతి మండలానికి రూ. కోట్లు ఖర్చుచేశారు. ముప్కాల్ మండలానికి రూ.21.89 కోట్లు, మెండోరా రూ.32.69 కోట్లు, మోర్తాడ్ రూ.39.15కోట్లు, ఏర్గట్ల రూ.20.87కోట్లు, కమ్మర్పల్లి రూ.42.79కోట్లు, భీమ్‌గల్ రూ.78.58కోట్లు, వేల్పూర్ రూ.57.20కోట్లు, బాల్కొండ మండలంలో రూ.35.58 కోట్ల ఖర్చుతో మిషన్‌భగీరథ పనులను పూర్తి చేశారు. జలాల్పూర్ ఎత్తిపోతల నుంచి పైప్‌లైన్ పనులు, ట్యాంకుల నిర్మాణం, గ్రామాల్లో పైప్లైన్ల ఏర్పాట్లు, ఇంటింటికీ కుళాయి కనెక్షన్ల వరకు పనులు పూర్తిచేసి విజయవంతంగా ఫిల్టర్ నీళ్లను అందించారు. ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీళ్లు రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
కొంతకాలంగా చాలా చోట్ల పైప్లైన్లు లీకేజీలు ఏర్పడినా పట్టించుకోవడంలేదు. ముప్కాల్‌లో పైప్‌లైన్ లీకేజీ కారణంగా జాతీయరహదారిపైకి మిషన్‌భగీరథ నీళ్లు వస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. లీకేజీల కారణంగా కలుషిత నీరు వస్తున్నదని గ్రామస్తులు వాపోతున్నారు. కమ్మర్పల్లి మండలంలో మిషన్ భగీరథ నిర్వహణ అధ్వానంగా మారింది. ఎప్పుడు నీళ్లు సరఫరా చేస్తారో తెలియని పరిస్థితి. ఒకవేళ నీళ్లు ఇచ్చినా ఒకటి రెండు బిందెల కన్నా ఎక్కువ నిండడంలేదు, అవికూడా మట్టి రంగుతో వస్తున్నాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
అమీర్‌నగర్ గ్రామంలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. మండలంలో మిషన్ భగీరథ నీళ్లు రాని ఇండ్లు కూడా చాలానే ఉన్నాయి. భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ శివారులోని పంటపొలాల్లో మిషన్‌భగీరథ పైప్‌లైన్ ధ్వంసమై నీరు వృథాగా పోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. వేసవికాలం ప్రారంభం కావడంతో తాగనీటి సమస్య తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నా అధికారులు స్పందించడంలేదు. గ్రామాల్లో మరమ్మతు పనులను పంచాయతీలకు జనవరి 24 నుంచి ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం పంచాయతీల్లో నిధులు లేక పనులు ముందుకుసాగడంలేదు. ఈనేపథ్యంలో గ్రామాల్లో మిషన్‌భగీరథకు సంబంధించి మరమ్మతులు చేయాల్సి వస్తే, పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
‘మిషన్ భగీరథ’లో కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్న ఆపరేటర్లు, లైన్మెన్లకు ఆరు నెలలుగా వేతనాలు అందడంలేదు. దీంతో వారు గత నెల10న మిషన్‌భగీరథ ఎత్తిపోతల వద్ద ధర్నా నిర్వహించారు. దాదాపు 40 మంది ఆందోళన చేపట్టి, తమకు రావాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎక్కడికైనా వెళ్లి పనులు చేయాల్సి వస్తే గతంలోమాదిరిగా పనులు త్వరంగా జరగడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.