నిజాంసాగర్/బిచ్కుంద, అక్టోబర్ 31: ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి అన్నదాతలు నానా అవస్థలు పడాల్సి వస్తున్నది. ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర వస్తుందని సోయా పంటను తీసుకువచ్చిన రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. పంట చేతికి వచ్చి నెల రోజులు గడుస్తున్నా జుక్కల్ నియోజకవర్గంలోని ఏ ఒక్క మండలంలోనూ ఇంతవరకూ సోయా తూకం ప్రారంభించకపోవడం గమనార్హం. ఓ వైపు వర్షాలు, మరోవైపు తూకం ప్రారంభం కాకపోవడంతో రైతులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. గత్యంతరం లేని పరిస్థితిల్లో కొంతమంది రైతులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వ్యాపారులకు రూ.4000-4200లకు అమ్ముకుంటూ నష్టపోతున్నారు.
ప్రభుత్వం సోయా పంటకు మద్దతు ధర రూ.5,328 ప్రకటించింది. నెల రోజుల క్రితం సోయా పంట చేతికివచ్చింది. ఓ వైపు పంట వర్షానికి తడిసి పోతున్నది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకూ తూకం ప్రారంభించలేదు. దీంతో చాలా మంది రైతులు మహారాష్ట్ర వ్యాపారులకు రూ.4000 నుంచి రూ.4200లకు విక్రయిస్తుండగా, క్వింటాలుకు రూ.వెయ్యి 1100 రుపాయల వరకు నష్టపోతున్నారు. ఈ యేడాది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 3 నుంచి 4 క్వింటాలు మాత్రమే వచ్చిందని రైతులు వాపోతున్నారు. తీవ్రంగా నష్టపోతున్న తమకు ప్రైవేటు వ్యాపారులు మరింత నష్టాన్ని మిగుల్చుతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా తూకం ప్రారంభించి, ఆదుకోవాలంటూ రైతులు కోరుతున్నారు.
జుక్కల్ నియోజకవర్గంలో నిజాంసాగర్, మహ్మద్‌నగర్, పిట్లం మండలాల్లో సోయా పంట అంతమాత్రంగానే సాగు చేసినా బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, డోంగ్లీ, పెద్దకొడప్గల్ మండలాల్లో సింహభాగం సాగు చేస్తారు. ఆయా మండలాల్లో 37వేల మంది రైతులు 73వేల ఎకరాల్లో సోయా పంటను సాగు చేశారు.