నిజామాబాద్, నవంబర్ 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికలకు ముందు నోటికొచ్చిన హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటిని అమలు చేసేందుకు ఉత్సాహం చూపడం లేదు. ప్రధానంగా రైతులకు సంబంధించిన హామీల విషయంలో తాత్సారం చేస్తూ మోసం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు నాలుగు పంట కాలాలు పూర్తయ్యాయి. ఇందులో ఈ వానాకాలంలో మాత్రమే రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని అందించారు. రూ.15వేలు ఇస్తామని చెప్పి ఎకరాకు రూ.12వేలకు కుదించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి రైతులను నిండుగా ముంచారు.
మరోవైపు పంటలకు బోనస్ హామీ సైతం అరకొరగానే అమలవుతోంది. గత యాసంగి సీజన్లో బోనస్ చెల్లింపులు జరగలేదు. ఒక్క రైతుకు కూడా పైసా బోనస్ ఇవ్వలేదు. ఈ వానాకాలంలో పంటల సేకరణలో భాగంగా కొంత మందికి బోనస్‌ను వర్తింప జేస్తున్నారు. ధాన్యం సేకరించిన తర్వాత కనీస మద్ధతు ధరను జమ చేసిన కొద్ది రోజులకు బోనస్‌ను ఇస్తున్నారు. అయితే ఇదీ ఎవరెవరికి ఏ ప్రాతిపదికన అందిస్తున్నారనేది అంతు చిక్కకపోవడంతో గందరగోళం ఏర్పడింది. గత యాసంగి బోనస్ చెల్లించాల్సి ఉండగా ఆ ఊసే లేకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వరి సాగు విస్తృతంగా ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ప్రతి పంట కాలంలో సుమారుగా 15లక్షల మెట్రిక్ టన్నులు మేర వరి ఉత్పత్తి అవుతుంది. దీంతో పుట్లకొద్దీ వడ్లు వచ్చే వీలు ఏర్పడుతుంది. సమైక్యపాలనలో ధాన్యం ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉండేది. నీటి వసతి పెరగడం మూలంగా కేసీఆర్ హాయాంలో వరి సాగు రెట్టింపు అయ్యింది. ఇప్పటికీ అదే ప్రభావంతో పంటల సాగు భారీ ఎత్తున జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు డిక్లరేషన్‌లో పంటలకు బోనస్ కింద రూ.500 అందిస్తామని పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం పంటకు మాత్రమే పరిమితం చేసింది. అందులోనూ సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని మెలిక పెట్టి రైతులను నిరాశకు గురి చేసింది.
ఇచ్చిన అబద్ధపు హామీని సైతం కాంగ్రెస్ పార్టీ సరైన రీతిలో అమలు చేయడం లేదు. గడిచిన నాలుగు సీజన్లలో బోనస్ చెల్లించిన పరిస్థితులు అరకొరగానే ఉన్నాయి. గత యాసంగిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.449 కోట్లు మేర బోనస్ బకాయిలు పేరుకు పోయాయి. నిజామాబాద్ జిల్లాలో రూ.360 కోట్లు, కామారెడ్డి జిల్లాలో రూ.89కోట్లు మేర యాసంగి సీజన్‌కు సంబంధించి బోనస్ బకాయి పెండింగ్‌లో ఉంది. అయినప్పటికీ చెల్లింపులపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు. రైతులంతా ఆశగా బోనస్ కోసం ఎదురు చూస్తున్నారు. క్వింటా సన్న వడ్లకు రూ.500 చొప్పున బోనస్ వస్తే తమకు లాభం వస్తుందని వారంతా సంబుర పడుతుంటే ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. అసంబద్ధమైన హామీలిచ్చి రైతులను ఆకర్షించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేమో బోనస్‌పై శ్రద్ధ వహించడం లేదు.
ఈ వానాకాలం రైతులకు గడ్డు కాలాన్ని పరిచయం చేసినైట్లెంది. ఊహించని విధంగా పంట నష్టం సంభవించి రైతులు తీవ్రంగా నష్ట పో యారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బోధ న్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొం డ నియోజకవర్గాల్లో అతి భారీ వానలకు రైతులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. వరి సాగుపై ఏకధాటి వానలు ప్రభావం చూపాయి. ఫలితంగా ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ఎకరాకు సుమారుగా 2 నుంచి 3 ట్రాక్టర్ల మేర వడ్లు రావాల్సి ఉండగా ఈసారి ఒక ట్రాక్టర్‌కే పరిమితమైంది. ఫలితంగా రైతులకు కోలుకోలేని విధంగా నష్టం వాటిల్లింది. ఈ వానాకాలంలో పంట ఉత్పత్తి భారీగా అంచనా వేసినప్పటికీ ఆశించిన స్థాయిలో రావడం కష్టంగానే ఉంది.
ఉభయ జిల్లాల్లో ఇప్పటి వరకు 8లక్షల మెట్రిక్ టన్ను లు వరకు ధాన్యం సేకరించారు. మరో 2లక్షలు మెట్రిక్ టన్నులు వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో సన్న వడ్లు సగానికి ఎక్కువ ఉన్నప్పటికీ యాసంగి సాగు కంటే తక్కువే ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ధాన్యం తక్కువ రావడంతోనే ప్రభుత్వం తెలివిగా బోనస్ వర్తింపజేసేందుకు పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. భారీ స్థాయిలో యాసంగిలో వరి ఉత్పత్తి వచ్చింది. బోనస్ వర్తింపజేయలేదు. ఈసారి రైతులకు చెడగొట్టు వానలు, భారీ వర్షాలు తీవ్రంగా నష్టపర్చడంతో బోనస్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అది కూడా అరకొరగానే జమ చేస్తుండగా యాసంగి బోనస్‌పై నోరెత్తకపోవడం రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.