బోధన్, ఆగస్టు 13 : రైతుల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. అన్నదాతలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో ఘోరంగా విఫలమవుతున్నది. సన్నరకం వడ్లకు బోనస్ ఇస్తామని ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊదరగొట్టారు. గత యాసంగి సీజన్లో సన్నాలకు బోనస్ ఇస్తామని ప్రకటించిన రేవంత్ సర్కారు..ఇప్పటివరకూ ఇచ్చిన దాఖలాలు లేవు. నిజామాబాద్ జిల్లాలో రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి నెలలు గడుస్తున్నా బోనస్‌పై స్పష్టత కరువైంది. సుమారు లక్ష మంది రైతులకు బోనస్ కింద రూ.369.38 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. అసలు ఇస్తారా లేదా బోనస్ బోగస్సేనా అని అన్నదాతలు మండిపడుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో ధాన్యం సేకరణ పూర్తయి సుమారు రెండు నెలలవుతున్నది. బోధన్‌తోపాటు పలు ప్రాంతాల్లో రైతులు నాలుగు నెలల క్రితం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించారు. వారం రోజుల్లో అటుఇటుగా కనీస మద్దతు ధరను జమచేసిన ప్రభుత్వం బోనస్‌ను మాత్రం ఇవ్వలేదు. బోనస్ వస్తుందన్న ఆశతో సన్నరకం ధాన్యాన్ని జిల్లా రైతులు ఇబ్బడిముబ్బడిగా పండించారు. మరో నెలన్నరలో వానకాలం పంట కోతలు ప్రారంభంకానున్నాయి. అయితే, యాసంగి సీజన్‌కు సంబంధించిన పంటలకు బోనస్ రాకపోవడం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా పథకాలను పూర్తిస్థాయిలో అమలుచేయకపోవడంతో జిల్లాలో లక్షలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రైతు భరోసాలోనూ అనేక మంది రైతులకు దగా జరిగింది. దీనికితోడు ఇప్పుడు సన్నాల బోనస్ విషయంలో నెలల తరబడిగా జాప్యం నెలకొంటున్నది.
యాసంగి సీజన్లో 8, 40,143 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం, బోనస్ ఇస్తుందన్న నమ్మ కం లేకపోవడంతో చాలా మంది రైతు లు సుమారు రెండు లక్షల టన్నుల మేరకు ధాన్యాన్ని దళారులు, ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించినట్లు ఒక అంచనా. ధాన్యం సేకరణ కేంద్రాలకు లక్షా 4 వేల 751 మంది రైతులు 8,40,143 మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయించారు.ఇందులో 7,38,662 మెట్రిక్ టన్నుల సన్నాలు ఉన్నాయి. క్వింటాలుకు రూ.500 బోనస్‌ను ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నది. ఈ లెక్కన బోనస్ కింద సుమారు లక్ష మంది రైతులకు రూ.369.38 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది. యాసంగి సీజన్‌కు సంబంధించిన బోనస్ ఇస్తే ఈ వానకాలం పంటల పెట్టుబడుల కోసం ఎంతో కొంత చేదోడుగా ఉండేదని రైతులు భావిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పంటల పండించే తమపై కాంగ్రెస్ సర్కార్ వివక్షతను చూపుతున్నదని వాపోతున్నారు. బోనస్ వస్తుందా.. అసలు రాదా అనే విషయంపై స్పష్టం కరువైందని ఆందోళన చెందుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలకు చేతలకు ఎలాంటి పొంతన లేదు. సన్నాలకు బోనస్ ఇస్తామని చెబితే నిజమేనని నమ్మినం. బోనస్ వస్తుందన్న ఆశతో నాకున్న ఎకరం పొలంలో పండిన 42 క్వింటాళ్ల బీపీటీ కొనుగోలు కేంద్రంలో విక్రయించినం. నెలలు గడుస్తున్నా బోనస్ ఊసే లేదు. బోనస్‌పై బోగస్ మాటలు చెబుతున్నారన్న అనుమానం కలుగుతున్నది.
-మాల పెద్దులు, రైతు, మంగళ్‌పాడ్, ఎడపల్లి మండలం
వడ్లు సర్కార్ కాంటాకు ఇచ్చి నాలు గు నెలలయ్యింది. 500 రూపాయలు ఎక్కు వ వస్తాయని సన్నం వడ్లు పండించిన. మా ఊరి పక్కన గోవూరు శివారులో మూడెకరాల 20 గుంటలు వడ్లు పండినయి.. ఈ వడ్లను అమ్మి నెలలు అవుతున్నా బోనస్ ఇవ్వడంలేదు. సొసైటీల్లోనూ అడిగితే ఎప్పుడొస్తాయో చెప్పడంలేదు. బోనస్ రాకపోవడంతో రైతులు పరేషాన్ అవుతున్నరు.
-రత్నావత్ సునీల్, రాజీవ్‌నగర్ తండా, బోధన్ మండలం