వర్ని(రుద్రూర్), మే 18: విద్యాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను వంచిస్తున్నదని అఖిలపక్ష విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. రుద్రూర్ మండలం అక్బర్‌నగర్‌లో ఉన్న వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను విలీనం పేరుతో విద్యార్థులకు సాంకేతిక విద్యను దూరం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను జగిత్యాలలోని పొలాస కళాశాలలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థిసంఘాలు, స్థానికులు కలిసి కాలేజీ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
ఈ విద్యాసంవత్సరం నుంచి ఇక్కడ ప్రవేశాలు కల్పించకూడదని నిర్ణయించడం సరికాదన్నారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ, విద్యార్థులు లేరనే సాకుతో కాలేజీని తరలించాలని చూస్తున్నారని మండిపడ్డారు. హాస్టల్ వసతి, సరిపడా తరగతి గదులు, ప్రాక్టికల్‌గా తెలసుకోవడానికి వ్యవసాయ భూమి సహా శాస్త్రవేత్తలు, అధ్యాపకులు అందుబాటులో ఉన్నా కళాశాలను తరలించే ప్రయత్నం జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్మిషన్ల సంఖ్య ఎలా పెంచుకోవాలో చూడాలి తప్ప ఉన్న కళాశాలను మూసివేడం సరికాదన్నారు. జిల్లాలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఒకటే ఉన్నదని, దాన్ని ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సర్పంచ్ సీతారాంరాజు, ఉప సర్పంచ్ హబీబ్‌ఖాన్, నేతలు కార్తీక్, సంజీవులు, రామాగౌడ్, గంగాధర్, గౌతమ్ కామ్లే, రాజు, చిన్న సాయిలు, మతీన్, నీరడి శంకర్, విద్యార్థులు పాల్గొన్నారు.