హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతిని ధి, జూలై 30 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌ను పునరుద్ధరించాలని రైతులు కోరుతుంటే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చెబితేనే చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లుగా మొండికేసింది. ‘మాకేం సంబంధం, మేం సాంకేతిక సలహాలు మాత్రమే ఇస్తాం’ అని ఎన్డీఎస్ఏ కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో ఎగువన అన్నారం, సుందిళ్లలోనూ లోపాలు ఉన్నాయంటూ ప్రభుత్వం కొత్త రాగం అందుకున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తుంటే.. నీళ్లు ఎత్తిపోసి ఎక్కడ పోయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచిత్ర వ్యాఖ్యలు చేశారు.
కొన్నిరోజుల క్రితం నార్లాపూర్ పంపుల వెట్న్ నిర్వహించి, నీటి ఎత్తిపోతలకు మోటర్లను సిద్ధం చేస్తామని ప్రకటించారు. గత రెండున్నరేండ్లుగా రాష్ట్రంలోని కీలకమైన సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఇది. ఇప్పుడు వీటి సరసన హైదరాబాద్ తాగునీటి పథకమైన సుంకిశాల కూడా చేరింది. మనసుంటే మార్గముంటుంది.
కానీ, సర్కార్‌కు మాత్రం ప్రాజెక్టుల ద్వారా నీటిని ఎత్తిపోయాలనే మనసు లేదు. రైతులను ఆదుకోవాలని, ప్రజల దాహార్తి తీర్చాలనే చిత్తశుద్ధి అంతకన్నా లేదు. కారణం, బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిన ఈ ప్రాజెక్టులతో సాగునీరు అందిస్తే కేసీఆర్‌కు పేరొస్తుంది. అందుకే కాళేశ్వరంలో పరీక్షల పేరిట… పాలమూరు-రంగారెడ్డిలో భూసేకరణ సాకుతో… సుంకిశాల పథకంలో డిజైన్‌పై అధ్యయనం ముసుగుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొనిరాకుండా కాలయాపన చేస్తున్నారు.
రెండేండ్ల కిందటనే అందుబాటులోకి రావాల్సిన సుంకిశాల పథకం ఇప్పటికీ అతీగతీ లేదు. రెండుమూడు రోజులుగా వర్షాలు పడుతున్నాయేగానీ లేకపోతే హైదరాబాద్ మహానగరానికి తాగునీటి గండం పొంచి ఉండేది. వర్షాలు పడి, ఇన్‌ఫ్లోలు మొదలవడంతో పనులు ముందుకు సాగే పరిస్థితి ఉండదు. అంటే సుంకిశాల పథకం ఇంకో ఏడాదికి కూడా అందుబాటులోకి వచ్చేది కష్టమేనని అధికారికవర్గాలే అంటున్నాయి. పైగా, పథకం చివరి దశలో డిజైన్‌ను తెరపైకి తెచ్చి అధ్యయనాలు చేపట్టడమంటే కాంగ్రెస్ ప్రభుత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు సరికొత్త డ్రామాకు తెర లేపుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రిటెయినింగ్ వాల్ కుప్పకూలిన ఘటన జరిగిన సమయంలో ఘటనాస్థలాన్ని పరిశీలించిన ముగ్గురు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు దానినో చిన్న ఘటనగా అభివర్ణించారు. వెంటనే పునరుద్ధరణ పనులు మొదలుపెట్టి త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రకటించారు. నిర్మాణ సంస్థ మేఘా ఇన్ఫ్రా తమదే తప్పు అని అంగీకరించి, పునరుద్ధరణకు అయ్యే వ్యయాన్ని తామే భరిస్తామని స్పష్టం చేసింది.
ఆ తర్వాత జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి, కార్యాచరణ కూడా రూపొందించామని ప్రకటించారు. పంపుహౌస్‌లో కుప్పకూలిన రిటెయినింగ్ వాల్ శిథిలాలను తొలగించడం, డీవాటరింగ్ ప్రక్రియ ద్వారా అందులోని నీటిని తొలగించారు. భారీ సాగునీటి ప్రాజెక్టులకు గేట్లు అమర్చడంలో నైపుణ్యం ఉన్న ఇంజినీరింగ్ నిపుణులు కన్నయ్య నాయుడిని తీసుకెళ్లారు.
నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీరు నేరుగా టన్నెల్ నుంచి పంపుహౌస్‌లోకి కాకుండా జలాశయం వద్దనే నియంత్రణ ఉండేలా గేట్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో 2025, ఏప్రిల్‌లోనే పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కానీ, ఆ తర్వాత ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. దాదాపు 85-90% వరకు పనులు పూర్తయిన పథకంపై పునఃసమీక్షకు పూనుకున్నారు.
ఈ మేరకు సుంకిశాల పథకం డిజైన్‌పై రివ్యూ, విశ్లేషణ, సూచనలు ఇవ్వడం, ఇన్‌టేక్‌వెల్ గోడల మధ్య ఉన్న గ్యాప్‌లను పూడ్చడం, వివిధ రకాల పరీక్షలే కాకుండా సామర్థ్య ధృవీకరణ పత్రాలను జారీ చేయడం వంటి ప్రక్రియలు నిర్వహిస్తామని, ఈ ప్రక్రియలు నిర్వహించే బాధ్యతను ఐఐటీ మద్రాస్‌కు అప్పగించినట్టు జలమండలి అధికారులు ప్రకటించారు. ఇందుకయ్యే రూ.4 కోట్ల వ్యయాన్ని నిర్మాణ ఏజెన్సీ మేఘా ఇన్ఫ్రా భరిస్తుందని చెప్పారు.
సుంకిశాలలో రిటెయినింగ్ వాల్ కుప్పకూలిన ఘటనను కప్పి పుచ్చుకొనేందుకు జలమండలి అధ్యయనం అనే అంశాన్ని తెరపైకి తెచ్చిందా? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లేకపోతే పథకం చివరి దశలో డిజైన్‌పై అధ్యయనం ఎందుకు? తద్వారా ఏమి తేల్చనున్నారనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ అలవాటుగా మారిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెపం నెట్టేందుకు ఐఐటీ మద్రాస్‌తో అధ్యయనాన్ని తెరపైకి తెచ్చి డిజైన్లోనే లోపం ఉన్నదంటూ ప్రచారం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారా? అనే సందేహాలూ లేకపోలేదు. కాగా, నాగార్జునసాగర్‌లో నీటిమట్టం తక్కువగా ఉన్న సమయంలోనే సుంకిశాల పథకం టన్నెల్ నుంచి పంపుహౌస్‌కు నీటి తరలింపు, నియంత్రణ కోసం చేపట్టే పనులతోపాటు మోటర్లు, ప్యానల్ ఏర్పాటు పనులు చేయడం సులవు అవుతుంది. నిన్నటిదాకా పరిస్థితులు అనువుగా ఉన్నాయి. కానీ, ఈ వేసవిని జలమండలి సద్వినియోగం చేసుకోలేదు. అధ్యయనాల పేరిట కీలకమైన పనుల జోలికి వెళ్లలేదు. ఒకవేళ అధ్యయనం పూర్తయి నివేదిక వచ్చినా ఇప్పుడు పనులు మొదలయ్యే పరిస్థితులు కనిపించడంలేదని తెలుస్తున్నది. నాగార్జునసాగర్‌కు కూడా ఇన్‌ఫ్లోలు మొదలుకావడంతో జలాశయంలో నీటిమట్టం పెరుగుతుంది. దీంతోపాటు వర్షాలు పడుతుండటంతో సైట్లో పనులు కూడా చేయడం కష్టసాధ్యమవుతుంది. దీంతో వర్షాకాలం పూర్తయితే తప్ప పనులు సక్రమంగా జరుగవు. దీంతో సుంకిశాల పథకం సమీప భవిష్యత్తులోనూ పూర్తయ్యేలా కనిపించడం లేదు.
రాష్ట్రంలోని సాగునీటి, తాగునీటి పథకాలకు కాంగ్రెస్ గ్రహణం పట్టుకున్నది. రెండున్నరేండ్లుగా గోదావరి, కృష్ణా నదులపై ఉన్న కీలకమైన సాగునీటి ప్రాజెక్టులను పడావు పెట్టిన రేవంత్ సర్కార్.. హైదరాబాద్ తాగునీటి పథకాన్ని సైతం ఒడ్డు ఎక్కించకుండా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నది. దీంతో రూ.1,500 కోట్ల ప్రజాధనం ఖర్చయినప్పటికీ చివరి దశలోని పథకం పనులు పూర్తి కాకపోవడంతో కృష్ణా బేసిన్లో ఇన్ఫ్లోలపైనే హైదరాబాద్ తాగునీటి సరఫరా ఆధారపడాల్సి వస్తున్నది. ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లో కనీసం 510 అడుగుల నీటిమట్టం ఉంటేనే మాధవరెడ్డి ప్రాజెక్టులో ఎత్తిపోతల సాధ్యమవుతుంది. అంతకంటే తక్కువ ఉన్నట్లయితే అత్యవసర మోటర్లు ఏర్పాటు చేయాలి. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా సరిపడేంత నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాదు. అందుకే, కేసీఆర్ ప్రభుత్వం నాగార్జునసాగర్‌లో నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి (సుమారు 460 అడుగులు) వచ్చినా హైదరాబాద్ తాగునీటికి ఢోకా లేకుండా ఉండేలా సుంకిశాల పథకాన్ని రూపొందించింది. 80 శాతానికిపైగా పనులు పూర్తి చేసింది. కానీ 2023, డిసెంబరు 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీశైలం సొరంగం ప్రాజెక్టు పూర్తయితే, సుంకిశాల పథకం ఎందుకనే ఉద్దేశంతో పథకాన్ని నిర్లక్ష్యం చేసింది. నిర్మాణ సంస్థ మేఘా ఇన్ఫ్రా సైతం అప్రమత్తత లేకుండా… నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి వచ్చే ఇన్‌ఫ్లోను అంచనా వేయడంలో విఫలమై, పథకం పంపుహౌస్‌లోని రిటెయినింగ్ వాల్‌ను కుప్పకూల్చింది.