మోర్తాడ్, జూన్ 29: కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. సహకార సంఘాల వద్ద ఎక్కడ చూసినా రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. ఇప్పటికే నాట్లు వేస్తుండడంతో సరిపడా యూరియా సరఫరా కాకపోవడంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో రైతులు వానకాలం పంటలు మొదలైనప్పటి నుంచి పంటలు పండే వరకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు రోజురోజుకు మారుతున్నాయి.
మళ్లీ వెనకటికి ఎవుసం కోసం పడ్డ కష్టాలు గుర్తుకొస్తున్నాయని రైతులు చెబుతున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో రైతులను సాగు కష్టాలు వెంటాడుతున్నాయి. మొన్నటికి మొన్న కమ్మర్‌పల్లిలో విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. నిన్న యూరియా బస్తాల కోసం రైతులు కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొన్నది. రెండురోజుల క్రితం ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో, ఆదివారం ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో రైతులు యూరియా కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
శెట్పల్లి సొసైటీ పరిధిలో ఒకలోడ్ యూరియా బస్తాలు నేరుగా రైతుల ఇండ్లకే వెళ్లినట్లు సమాచారం.దీంతో సొసైటీ పరిధిలోని ఇతర గ్రామాల రైతులకు యూరియా అందే విషయంలో ఇబ్బందులు తలెత్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శెట్పల్లి గ్రామంలోని కొందరు రైతులు వారే డబ్బులు జమచేసి లోడ్ యూరియా బస్తాలకు కట్టడంతో లోడ్ మొత్తం వారికే వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన ఇతర రైతులు మాకేమన్న ఊరికే ఇస్తున్నారా, మాకుకూడా డబ్బులకే ఇస్తారు కదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అరకొరగా యూరియా సరాఫరా ఉన్న నేపథ్యంలో కొంతమందికే పెద్దమొత్తంలో యూరి యా బస్తాలు ఇవ్వడంపై మిగతా గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సొసైటీ పరిధిలోని రైతులందరికీ యూరియా అవసరానికి దొరక్కపోతే ఎవరు బాధ్యత వహిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా యూరి యా బస్తాల పంపిణీ విషయంలో రైతులందరికి అవసరం మేర అందేలా చూడాలని కోరుతున్నారు. అరకోర ఉన్న పరిస్థితుల్లో కృత్రిమ కొరత సృష్టిస్తే రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వర్షాలు కురుస్తుండడంతో పంటకు సరైన సమయంలో యూరియా లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మూడు గంట లు క్యూలో ఉన్నా యూ రియా దొరకలేదు. ప్రభు త్వం స్పందించి యూరియా కొరత తీర్చి రైతులను ఆదుకోవాలి.
-పేపర్ భూమన్న, రైతు, తొర్తి గ్రామం
ఏర్గట్ల, జూన్ 29: మండలంలోని తొర్తి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గిడ్డంగి వద్ద యూరియా కోసం ఆదివారం రైతులు బారులు తీరారు. మంగళవారం రాత్రి వచ్చిన యూరియా లోడ్ గోదాంలో అన్లోడ్ చేయకుండా సరాసరి కొందరు రైతుల ఇంటివద్ద దించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 450 బస్తాల యూరియా సంచులను కేవలం నలుగురు రైతులకు ఎలా ఇస్తారని పలువురు రైతులు అధికారులను నిలదీశారు. ప్రతి కుటుంబానికీ ఐదు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని, అవి ఏమాత్రం సరిపోవడంలేదని వాపోయారు.
పట్టాపాసు పుస్తకం అడగకుండా ఒక ఆధార్‌కార్డు ఆధారంగా ఇవ్వడంతో రెండు సంచులు అవసరం ఉన్న కొందరు రైతులు కూడా అవసరానికి మించి యూరియా తీసుకుంటున్నారని ఆరోపించారు. కుంటుంబానికి కేవలం ఐదు బస్తాలు ఇచ్చినా కొందరు రైతులకు అందకపోవడంతో చాలాసేపు నిరీక్షించి ప్రభుత్వం పై మండిపడుతూ వెనుదిరిగారు. యూరియా కోసం ప్రతిరోజూ గోదాముల చుట్టూ తిరగాల్సివస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు వెంటనే స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.