నిజామాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ డాంభికాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు తోక ముడిచింది. హైకోర్టు తుది తీర్పును సాగుగా చూపి మునుపటి ప్రక్రియ వైపే అడుగులు వేస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అసెంబ్లీలో, పబ్లిక్ మీటింగ్లలో జనాలను నమ్మించారు. జీవో 29 తీసుకువచ్చి అమలు చేస్తున్నట్లుగా బీసీలను నమ్మించారు. న్యాయ సమీక్షలో ఈ జీవో చెల్లుబాటు కాదని తెలిసినప్పటికీ మొండిగా ముందుకెళ్లి హైకోర్టు ముందు బొక్కా బోర్లా పడింది.
బీసీలకు న్యాయం చేస్తామని చెప్పిన రేవంత్ సర్కారు ఇప్పుడేకంగా అన్యాయానికి గురి చేస్తోంది. మంత్రివర్గ సమావేశంలో డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్కు జై కొట్టి తుదకు బీసీ రిజర్వేషన్లకు నై అంటూ ప్రజానీకాన్ని నిరాశకు గురి చేశారు. ఆగమేఘాల మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదటగా సర్పంచ్ పోరుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఏర్పాట్లు వేగవంతం చేసింది. సర్పంచ్ స్థానాలకు రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు కొత్తగా జీవో నెంబర్ 46ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీవోను అనుసరించి నేడు, రేపటి కల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సర్పంచ్ స్థానాల కేటాయింపు జరుగనుంది.
జీవో 29 రద్దు కావడంతో ఆ స్థానంలో జీవో 46ను ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఫలితంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు అటకెక్కినట్లే. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో 50శాతం లోపు రిజర్వేషన్లు అమలు అవుతుండటంతో సెప్టెంబర్ చివర్లో ఖరారైన రిజర్వేషన్లు పూర్తిగా మారనున్నాయి. కొత్త జీవో ప్రకారం మరోసారి ప్రక్రియను మొదలు పెడుతుండటంతో ఏ గ్రామంలో ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు వర్తిస్తాయి అన్నది ఉత్కంఠకు గురి చేస్తోంది. ఆశావాహులు చాలా మంది సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు.
ఇందులో భాగంగా రిజర్వేషన్లు వర్తింపు కీలకంగా మారనుంది. కొత్తగా కేటాయించబోయే రిజర్వేషన్లు ఎవరికి అదృష్టాన్ని తీసుకు వస్తుందో? ఎవరికి నిరాశకు గురి చేస్తుందో అన్నది వేచి చూడాల్సి ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఈ వారంలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం నవంబర్ 20 నుంచి 23 వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితా సవరణ చేపడుతోంది. నేడు (నవంబర్ 23న) తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలను ప్రచురించనున్నారు. నిజామాబాద్ జిల్లాలో 545 జీపీలు, 5022 వార్డులున్నాయి. 5053 పోలింగ్ స్టేషన్లు గతంలో ఖరారు చేశారు. కామారెడ్డి జిల్లాలో 532 గ్రామ పంచాయతీలు, 4656 వార్డులున్నాయి. 4670 పోలింగ్ స్టేషన్లు గతంలో ఎంపిక చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభుత్వం జీవోలో మార్గదర్శకాలను పేర్కొంది. రిజర్వేషన్లు 50శాతం మించకూడదని పేర్కొంది. కుల గణన ఆధారంగా వార్డుల సభ్యుల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కల్పించనున్నారు. కుల గణన ఆధారంగా బీసీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు ఇస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు కేటాయిస్తారు. సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లను ఆర్డీవోలు ఖరారు చేయనున్నారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు ఖరారు చేస్తారని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.
వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్లు నిర్ధారిస్తారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని చాటుకోవడంలో విఫలం కావడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు 42శాతం రిజర్వేషన్లకు మోకాలడ్డు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తీరును బీసీ సంఘాలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు. కాకపోతే కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను మట్టి కరిపించాలని బీసీ సంఘాలు ప్రచారం చేస్తున్నాయి. పార్టీ గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ తగిన విధంగా గుణపాఠం చెప్పాలని బీసీలు నిశ్చయించారు.