మాక్లూర్, మే 27: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై విత్తన భారం మోపి, ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న సర్కార్.. అన్నదాతను అదనుచూసి దెబ్బకొడుతున్నది. ఇప్పటికే పథకాల అమలులో అనేక కొర్రీలు పెడుతున్న ప్రభుత్వం.. జీలుగ విత్తన ధరలు పెంచి మరో పిడుగు వేసింది. ఏకంగా రెండింతలు ధర పెంచేసి రైతులపై మోయలేని భారం మోపింది. రైతులు ఏటా సాగుకు ముందు భూమి సారవంతానికి, పంట దిగుబడి కోసం జీలుగ విత్తనాలను చల్లుకుంటారు.
ఏపుగా పెరగగానే కలియదున్ని ఎరువుగా మార్చుకొని నేలను సాగుకు సిద్ధం చేసుకుంటారు. అయితే ఈ ఏడాది విత్తన ధరను భారీగా పెంచేసింది. దీంతో రైతులపై ఆర్థిక భారం పడనున్నది. పంట వేసే సమయం వస్తుందటే చాలు రైతులు జీలుగ విత్తనాల కోసం ఎదురు చేసేవారు. విత్తనాల కోసం బారులు తీరి తీసుకునేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది. రైతులు జీలుగ విత్తనాల గురించి ఊసేత్తడం లేదు. ఇందుకు కాంగ్రెస్ ప్రభు త్వం విత్తన ధరలను ఆమాంతం పెంచడమే కారణంగా కనిపిస్తున్నది.
బీఆర్ఎస్ హయాంలో రూ.880లకే బస్తా
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 30 కిలోల జీలుగ బస్తా రూ.800 లోపు ఉండేది. ఒక బస్తా రెండున్నర ఎకరాలకు సరిపోయేది. సరాసరిగా రైతుకు ఎకరానికి రూ.300 మాత్రమే ఖర్చయ్యేది. సన్న, చిన్నకారు రైతులు పెద్ద రైతులకు తీసి పోకుండా జీలుగ విత్తనాల కోసం పోటీపడేవారు. విత్తనాల పంపిణీ కేంద్రాల వద్ద రైతుల సందడి కనిపించేది. నేడు సన్న, చిన్న కారు రైతులు జీలుగా విత్తనాలను కొనాలంటేనే జంకుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 కిలోల బస్తాను 2,137.50 రూపాయలకు పెంచేసింది. దీంతో రెండెకరాల్లోపు ఉన్న రైతులు అంతధర పెట్టి కొనుగోలుచేయలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద రైతులు సైతం కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బస్తా ధర రూ.800 లకు లభించేది. దీంతో జీలుగ విత్తనాల కోసం పోటీపడిన అదే రైతులు, నేడు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడంలేదు. గత వానకాలం మండలంలో 360 క్వింటాళ్లకు పైగా జీలుగ విత్తనాలు అమ్ముడు పోగా, ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 187 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే సగంమంది మాత్రమే కొన్నారు. మాక్లూర్ పీఏసీఎస్‌లో మాత్రమే విత్తనాలు పూర్తిగా అ మ్ముడు పోగా, అమ్రాద్ పీఎసీఎస్, ఆలూర్ మండలం కల్లడి గో దాంలో విత్తనాలు మిగిలాయని అధికారులు చెబుతున్నారు. దీంతో పెరిగిన ధరలకు భయపడికొనుగోలు చేయలేదని స్పష్టమవుతున్నది.
రెండు రెట్లు పెంచిన ప్రభుత్వం
జీలుగ విత్తనాల 30 కిలోల బస్తాను ప్రభుత్వం రెండురెట్లు పెంచింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 30 కిలోల బస్తా 800 రూపాయలకు లభించేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బస్తా ధర రూ.2137.50లకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. గతంలో జీలుగ విత్తనాలను ఎన్ని బస్తాలైన కొనేవాళ్లం. ఇప్పుడు ధర చూసి రెండు, మూడు బస్తాలు కన్నా ఎక్కువగా కొనలేకపోయాం. ప్రభుత్వం ధరలను అమాంతం పెంచి రైతుల నడ్డి విరిచింది. జీలుగ విత్తనాలు మిగిలాయంటే రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా
ఉందో అర్థం చేసుకోవచ్చు.
-బండి సురేశ్, రైతు, మాదాపూర్