నిజామాబాద్, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో బతుకమ్మ పండుగ సాంస్కృతిక, సాంప్రదాయ ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఈ పండుగ సందర్భంగా మహిళలకు చీరెలు పంపిణీ చేయడం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక సంప్రదాయంగా జరిగింది. ప్రస్తుతం కాంగ్రె స్ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని కొనసాగించకపోవడంతో మహిళల్లో నిరాశ నెలకొంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీ చీఫ్ హోదా లో రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా బతుకమ్మ చీరెలపై నోరు పారేసుకున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశాడు.
సీఎం పదవిలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ చీరెల పంపిణీని పూర్తిగా నిలిపి వేయడంపై మహిళలు మండిపడుతున్నారు. కేసీఆర్ హ యాంలో ఏటా బతుకమ్మ పండుగకు చీరెల పంపిణీతో లక్షలాది మంది మహిళలకు లబ్ధి చేకూరింది. ఈ చీరెలు పండుగ సందర్భంగా ఆనందాన్ని, ఆర్ధిక భారాన్ని తగ్గించే విధంగా ఉపయోగపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చీరెల పంపిణీని చేపట్టకపోవడంతో మహిళలు కాంగ్రెస్ సర్కా రు తీరుపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీరుపై నిరాశను వ్యక్తం చేస్తున్నారు. పట్టణాలు, నగరాలు, గ్రామీణ ప్రాంత మహిళలు సైతం రేవంత్ రెడ్డి సర్కా రు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారు. తొలి ప్రభుత్వంలో మహిళల అభ్యున్నతికై అనేక పథకాలు తీసుకు వచ్చారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలతో పాటుగా సాంస్కృతి, సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ 2017, ఆగస్టు నెలలో బతుకమ్మ చీరెల పంపిణీని మొదలు పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో 18ఏళ్లు నిండిన యువతులతో పాటుగా మహిళలందరికీ చీరెలను బతుకమ్మ సారెగా తెలంగాణ సర్కారు తరపున కేసీఆర్ అందించారు.
ఖర్చు ఎంతైనా నాణ్యమైన చీరెలను పంపిణీ చేసే విధంగా నాటి కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చేనేత కార్మికులకు రోజంతా పని లభించేలా చర్యలు తీసుకుంటూనే నేతన్నలు తీర్చిదిద్దిన చీరెలను తెలంగాణ అంతటా మహిళా లోకానికి ఉచితంగా అందించారు. రాజన్న సిరిసిల్లాలోని వందలాది చేనేత కుటుంబాల జీవితాల్లో బతుకమ్మ చీరెల తయారీ ఆర్డర్ ఇప్పించి వెలుగులు నింపారు. నాటి సర్కారు తీసుకున్న నిర్ణయం మూలంగా దసరా పండుగకు ముందే ఇటు చేనేత కార్మికులు, మరోవైపు తెలంగాణ ఆడబిడ్డలందరిలోనూ ఏటా సంతోషం నింపారు. బతుకమ్మకు ప్రభుత్వమే సారె రూపంలో చీరను అందివ్వడంపై సర్వత్రా మహిళా లోకం హర్షం వ్యక్తం చేసింది. నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 4లక్షలు, కామారెడ్డి జిల్లాలో సుమారుగా మొత్తం 3.41లక్షల మందికి చీరెలను పంపిణీ చేశారు.
బతుకమ్మ చీరలను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పంపిణీ చేయగా కాంగ్రెస్ సర్కారు అర్ధాంతరంగా నిలిపేసింది. చీరల తయారీలో ఎక్కడా రాజీ పడకుండా రూ.కోట్లు వెచ్చించి నాణ్యమైన చీరలను తయారు చేయించి ఏడాది పొడవునా నేత కార్మికులకు ఉపాధి అవకాశాలను కేసీఆర్ కల్పించారు. మరోవైపు తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి ప్రతిబింబమైన బతుకమ్మ పండుగను కానుకగా చీరలను మహిళలకు అందిచేలా చూశారు. బతుకమ్మ చీరెలను రాష్ట్ర వ్యాప్తంగా 1.10కోట్లు ఉత్పత్తి చేసి రాష్ట్ర చేనేత సహకార సంస్థ ద్వారా జిల్లాలకు అందించేవారు.
17రంగులు, 17డిజైన్లతో కలిపి మొత్తం 289 వర్ణాలతో చీరెలను రూపొందించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి బతుకమ్మ, బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అధికారికంగా అద్భుతంగా నిర్వహించారు. కానిప్పుడు బతుకమ్మకు ఆడబిడ్డల మోములో సంబురం లేకుండా కాంగ్రెస్ సర్కారు కుటిల నీతికి పాల్పడుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికొచ్చిన హామీలిచ్చి, చీరెల పంపిణీపై దుష్ప్రచారం చేసి రాజకీయంగా దెబ్బ తీశారు. ప్రజల్లో లేనిపోని అనుమానాలను పెంచి పోషించారు. కుటిల దాడితో బీఆర్ఎస్ సర్కారును బద్నాం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అసలుకే మోసం చేస్తోంది. చీరెల పంపిణీని పూర్తిగా పక్కన పడేసి మహిళలను దగా చేస్తుండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఈ సర్కారు వచ్చినుంచి మా ఆడవాళ్లకు బతుకమ్మ పండుగకు చీరలే ఇస్తలేరు.. ఇందకు ముందు కేసీఆర్ సారూ ఉండగా ప్రతి బతుకమ్మ పండగకు కచ్చింతగా చీరలు ఇస్తుండే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆచ్చినంక ఏం చేస్తలేదు. బతుకమ్మ చీరలు ఇచ్చుండే లేదు. కేసీఆర్ ఉండగా ఏడాదికోక సారి ప్రతి ఏడాది పండుగకు కొత్త చీర ఇస్తుండేజ అదే చీరతో బతుకమ్మ ఆడేవాళ్లం. కేసీఆర్ సారూ సీఎంగా ఉండగానే మంచిగుండే.. -పల్లెపు సావిత్రి కొత్తపల్లి, కోటగిరి మండలం
బతుకమ్మ పండగ అస్తుందంటే సా లు.. ఇంట్ల ప్రతి ఒక్కోళ్లకు ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇస్తుం డే.. కేసీఆర్ బాపు ఉండగా చాలా బాగుం డే. ఆ రోజు లు మళ్ల ఎప్పుడు ఆస్తదో.. ఎలక్షన్ అయినకా గీ కాగ్రెస్ సర్కారు ఆచ్చినప్పటి కెంచి బతుకమ్మ చీరలు ఆస్తలేవు. ఈ గోవర్నమెంట్ ఎం పట్టించుకోవట్లేదు. – ఎంకవ్వ, కొత్తపల్లి, కోటగిరి మండలం