మోర్తాడ్, ఫిబ్రవరి 20: నిరుద్యోగ యువత ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. వారికి ఉపాధి కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన ‘హస్తం’.. వారి భవిష్యత్తును ఆగమాగం చేసింది. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన కార్మికులను అందించడానికి బాల్కొండ నియోజకవర్గంలో గత కేసీఆర్ ప్రభుత్వం న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్) కేంద్రాన్ని మంజూరుచేసింది. ఇందుకోసం రూ.5 కోట్ల నిధులు మంజూరుచేయగా.. మోర్తాడ్ మండల కేంద్రంలో అప్పటి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి న్యాక్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో ఈ ప్రాంత యువతీయువకులు ఎంతో సంతోషించారు. తమ భవిష్యత్తుకు దారి దొరికిందని సంబురపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆనందాన్ని ఎక్కువసేపు నిలువకుండా చేసింది.కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన న్యాక్ కేంద్రాన్ని రద్దు చేస్తున్నట్లు ఇటీవల జీవో విడుదల చేసి నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు గుమ్మరించింది. మంజూరైన న్యాక్ కేంద్రం రద్దు జీవోను వెనక్కి తీసుకోవాలని ఇక్కడి యువత డిమాండ్ చేస్తుంది.
బాల్కొండ నియోజకవర్గంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన యువత ఉపాధి కోసం ఎక్కువగా గల్ఫ్‌బాట పడుతున్నది. ఒక్క బాల్కొండ నియోజకవర్గం నుంచే దాదాపు 18వేల మందికిపైగా ఉపాధికోసం గల్ఫ్‌లో ఉంటున్నారంటే ఇక్కడి దయనీయ పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. గతంలో ఉపాధి కోసం భీవండి, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లేవారు. కాలక్రమేనా గల్ఫ్ దేశాలకు వెళ్లడం ప్రారంభించారు. ఏండ్ల తరబడి కుటుంబాలకు దూరంగా అక్కడ కూలిపనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. గల్ఫ్ వెళ్లే క్రమంలో చాలమంది యువకులు ఏజెంట్ల చేతిలో మోసపోయి అప్పుల బారిన పడ్డ కుటుంబాలు కోకొల్లలు. ఇలాంటి పరిస్థితుల్లో గత కేసీఆర్ ప్రభుత్వం మోర్తాడ్‌కు న్యాక్ కేంద్రం మంజూరు చేయడంతో తమకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని నిరుద్యోగ యువతీయువకులు భావించారు. కానీ న్యాక్‌ను రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుకోవడంతో యువత ఆందోళన చెందుతున్నది.
న్యాక్ కేంద్రం ఏర్పాటును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. న్యాక్ కేంద్రం మోర్తాడ్‌కు మంజూరుకావడంతో యువకులందరం అదృష్టంగా భావించాం. వివిధ రంగాల్లో సాంకేతికంగా శిక్షణను పొంది రాష్ట్రంతోపాటు విదేశాల్లో సైతం మంచి వేతనాలపై ఉపాధి పొందే అవకాశాలు ఉండేవి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈవిషయాన్ని గుర్తించి న్యాక్ కేంద్రం రద్దును విరమించుకోవాలి.
న్యాక్ కేంద్రం ఏర్పాటు రద్దు నిర్ణయం యువకుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. న్యాక్ కేంద్రం ఏర్పాటయితే టెక్నికల్‌గా ముందుకు వెళ్లాలనుకునే యువకులు ఉచిత వసతి, భోజనంతోపాటు శిక్షణ, సర్టిఫికెట్లను పొంది వివిధ కంపెనీల్లో ఉపాధి పొందే అవకాశాలు మెరుగపడేవి. అసలు రాష్ట్ర చరిత్రలోనే నియోజకవర్గ స్థాయిలో న్యాక్ కేంద్రం ఏర్పాటు చేయడమనేది ఎంతో సంతోషించదగ్గ విషయం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే న్యాక్ కేంద్రాన్ని రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడం శోచనీయం.
అప్పటి ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి యువకుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మోర్తాడ్‌కు న్యాక్ కేంద్రాన్ని మంజూరు చేయించారు.కలెక్టర్ ఆధ్వర్యంలో స్థలాన్ని కూడా సేకరించి శంకుస్థాపన కూడా చేశారు. నిర్మాణ పనులే తరువాయి అనే పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాక్ కేంద్రాన్ని రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడం అమానుషం. ఇక్కడి నుంచి గల్ఫ్‌కు వెళ్లే యువతను దృష్టిలో ఉంచుకుని రద్దు నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలి. లేదంటే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తాం.
మోర్తాడ్‌లో న్యాక్ కేంద్రం ఏర్పాటు రద్దు జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విద్యార్థిసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. యువతీ యువకుల ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు న్యాక్ కేంద్రం ఏర్పాటును రద్దు చేస్తే ఉద్యమాలు చేస్తామని ఇప్పటికే యువత హెచ్చరించింది. న్యాక్ కేంద్రం ఏర్పాటు కోసం విద్యార్థి సంఘాలు ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నాయి. న్యాక్ కేంద్రం ఏర్పాటుపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అసెంబ్లీలో కూడా మాట్లాడారు. నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో ఉపాధి కోసం గల్ఫ్ వెళ్తారని, వృత్తి నైపుణ్యంలో శిక్షణను ఇస్తే మంచి వేతనాలతో ఉద్యోగాలు లభిస్తాయన్న ఉద్దేశంతో మోర్తాడ్‌లో న్యాక్ కేంద్రానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.
ఇక్కడి ప్రాంత యువకులు ఎటువంటి నైపుణ్యం లేకుండా ఉపాధి కోసం గల్ఫ్ వెళ్తుంటారు. దీంతో వారు అక్కడ కూలి పనులను చేసుకోవాల్సిన పరిస్థితి.
గల్ఫ్‌కు వెళ్లడానికి లక్షల రూపాయలు వెచ్చించి తీరా అక్కడికి వెళ్లాక జీతాలు వేల రూపాయల్లో ఉంటున్నాయి. దీంతో వారు చేసిన అప్పుల తీర్చడానికే సమయాన్ని వృథా చేసుకోవాల్సిన దుస్థితి. చదువొచ్చినా, రాకున్నా నైపుణ్యం ఉంటే ఉపాధి కచ్చితంగా దొరుకుతుంది. ఉపాధి దొరకాలంటే నైపుణ్యం ఉండాలల్సిందే. అంతటి నైపుణ్యాన్ని, ఉపాధిని చూపిస్తున్నది న్యాక్ కేంద్రం.
న్యాక్ కేంద్రంలో ఉచిత వసతి, భోజన సౌకర్యాలతో ఎలక్ట్రికల్, కార్పెంటర్, వైండింగ్, మెకానికల్ తదితర రంగాల్లో శిక్షణను ఇస్తారు. శిక్షణ కాలం పూర్తయ్యాక ప్రభుత్వం సర్టిఫికెట్లను ప్రదానం చేస్తుంది. దీని కారణంగా ప్రైవేటు రంగంలో వివిధ కంపెనీల్లో ఇక్కడే ఉపాధి పొందే అవకాశాలు మెరుగయ్యేవి. అంతే కాక గల్ఫ్‌లో ఎక్కువ వేతనాలు పొందే అవకాశాలు ఉండేవి. నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఇంత మంచి అవకాశాన్ని కల్పించాలని కేసీఆర్ ప్రభుత్వం యోచిస్తే, వచ్చిరాగానే న్యాక్ కేంద్రాన్ని రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.