నిజామాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రజాపాలనలో రైతులకు కన్నీరే మిగులుతోంది. అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. రెండున్నరేళ్లలో అడుగడుగునా అన్నదాతలకు ఇక్కట్లే దాపురిస్తున్నాయి. సాఫీగా సాగు కాలం సాగకపోవడంతో నిత్యం కంట కన్నీరు తప్పడం లేదు. యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లలో అడుగడుగునా రవాణా కష్టాలు ఎదురవుతున్నాయి. హమాలీలు అందుబాటులో లేకపోవడంతో పాటుగా లారీల కొరత వేధిస్తుండటంతో కల్లాల్లో ధాన్యం నిలిచి పోతుంది. రోజుల తరబడి వేచి చూస్తే కానీ ధాన్యం అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. దొడ్డు ధాన్యాన్ని దించుకునేందుకు రైస్ మిల్లర్లు తీవ్రంగా సతాయిస్తున్నారు. నాలుగైదు కిలోలు తరుగు పేరిట దోచేస్తున్నారు.
లేదంటే లారీల్లోని ధాన్యం సంచులు దించుకునేందుకు ససేమిరా అంటున్నారు. లారీల యజమానులు సైతం సంచికి రూ.4వరకు వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైస్ మిల్లర్లకు తోడుగా పీఏసీఎస్ సెంటర్లలో సహకార సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రైతులను నిలువునా ముంచేస్తున్నారు. ధాన్యం తరలించడంలో జాప్యం జరుగుతుండటంతో రైతులు రోడ్డు ఎక్కి ఆందోళనలు చేయాల్సి వస్తోంది. రామారెడ్డి ఏరియాలోనైతే రైతులు ఏకంగా ధాన్యం కుప్పలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ పరిపాలనలో రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్, రవాణా, పౌరసరఫరాల సంస్థ, పౌరసరఫరాల శాఖ, గ్రామీణాభివృద్ధి, సహకార శాఖల మధ్య సమన్వయం ఉండేది. ఇప్పుడి శాఖల మధ్య పరస్పరం అవగాహన లోపించింది. ఏ రైతును కదిలించినా… కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది… ఇప్పుడంతా కష్టాల కాలం అంటూ నిట్టూరుస్తున్నారు. ప్రజాపాలనలో రైతులకు సంతోషమే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మక్కలు, జొన్న రైతుల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జరగాల్సిన కొనుగోళ్లు మచ్చుకూ ముందుకు కదలడం లేదు. అనుమతులు రాకపోవడంతో కొనుగోళ్ల ప్రక్రియనే చేపట్టలేదు. మే 20 నుంచి జొన్న కొనుగోళ్లకు మార్క్ఫెడ్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే మార్కెట్ యార్డుల్లో నెలల తరబడి పంట ఉత్పత్తులతో రైతులు పడిగాపులు కాస్తూ వేచి చూస్తున్నారు. ఈ కేంద్రాలు ఎన్ని రోజులు అందుబాటులో ఉంటాయో? అర్థం కావడం లేదు. ఎప్పటి వరకు కొనుగోళ్లు జరుగుతాయో? కూడా రైతులు తెలియక సతమతం అవుతున్నారు. మక్క రైతుల పరిస్థితి దయనీయంగానే చేరింది. కొనుగోళ్లు తూతూ మంత్రంగా చేపట్టి చేతులు ఎత్తేశారు. రూ.2400 కనీస మద్ధతు ధర అన్నది మచ్చుకూ అమలు కావడం లేదు. మక్క రైతులు కన్నీర్రె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు. మార్క్ఫెడ్ అధికార యంత్రాంగం చేతులు ఎత్తేసినట్లే కనిపిస్తోంది. కొనుగోళ్ల విషయంపై మౌనం పాటిస్తోంది.
నిజామాబాద్ జిల్లాలో 4లక్షల 27వేల 825 ఎకరాల్లో వరి సాగవ్వగా 59,834 ఎకరాల్లో దొడ్డు, 3,67,991 ఎకరాల్లో సన్నరకం సాగైంది. మొత్తం 11లక్షల 91వేల 836 మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి అంచనాలున్నాయి. ప్రైవేటు కొనుగోళ్లు మినహాయించగా 8లక్షల 65వేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 6లక్షల 29వేల 915 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించారు. 76వేల 537 మంది రైతుల నుంచి నేటి వరకు రూ.1504.85కోట్లు విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో రూ.1322 కోట్లు చెల్లింపులు పూర్తి చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 739 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
అన్ని చోట్ల కేంద్రాలను తెరిచారు. ప్రస్తుతం 653 చోట్ల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. 86 చోట్ల కొనుగోళ్లు పూర్తయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 2లక్షల 57వేల 785 ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో 1లక్షా 315 ఎకరాల్లో సన్న రకం, 1లక్షా 50వేల 470 ఎకరాల్లో దొడ్డు రకం ఉంది. మొత్తం ఈ సీజన్లో 6లక్షల 6వేల 899 మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి అంచనాలున్నాయి. కామారెడ్డి జిల్లాలో 5లక్షల 11వేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించేందుకు టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 3లక్షల 14వేల 589 మెట్రిక్ టన్నులు సేకరించారు. 42వేల 225 మంది రైతుల నుంచి రూ.751.55 కోట్లు చెల్లింపులు పూర్తి చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 414 కొనుగోలు కేంద్రాలు ప్రతిపాదించారు. అన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా 329 కేంద్రాల్లో ప్రస్తుతం కొనుగోళ్లు జరుగుతున్నాయి. 67 చోట్ల కొనుగోళ్లు పూర్తి కావడంతో మూసేశారు.
మోర్తాడ్, మే 20: రెండులక్షల రుణమాఫీ అన్నరు. రైతుబంధు 15 వేలన్నరు. బోనస్ 500 అన్నరు. రైతులను ఆగం జేసిండ్రు. ఓట్లు దండుకున్నాక తమాషా చేస్తున్నరు తప్పితే, చెప్పిన ఏ ఒక్కటి సక్కగా చేసింది లేదు. అబద్ధాల కాంగ్రెస్ అన్నది తేలిపోయింది. ఇక ధాన్యం కొనుగోలు చేస్తమని ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుడు తప్ప కొనుగోళ్లు జరగకున్నా, రైతులు కల్లాల కాడనే పండే పరిస్థితి దాపురించినా ఒక్కడన్న పట్టించుకునెటోడే లేడు. రైతులను ఏడిపిస్తున్న వారికి గోస కొడ్తది. దొడ్డు వడ్లు కొనమని చెబితే రైతులు ప్రభుత్వాన్ని అడగరు, రోడ్డుపైకి రారు. కొంటామని చెప్పి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఇబ్బందులు పెట్టుడు ఎందుకు?
– సంత రాజేశ్వర్, రైతు, కమ్మర్పల్లి
నాగిరెడ్డిపేట్, మే 20: ధాన్యం తూకం వేసి మూడు రోజులైతుంది. లారీలు వస్తలేవని సంచులు తీసుకుపోలే. ఎండనేమో ఎక్కువగా ఉన్నది. తూకం వేసిన బస్తాలు ఎండల్లోనే ఎండిపోతున్నాయి. డ్రైవర్లకు రూ.2 ఇస్తేనే లారీలు వస్తాయని చెబితే దానికీ ఒప్పుకున్నాం. అయినా లారీలు వస్తలేవు. పంట పం డించుడే కాదు, అమ్ముకోవడానికి కూడా కష్టమైతుంది. డబ్బులు ఖర్చు చేసి వడ్లు అమ్ముకోవాల్సి వస్తున్నది.
– బాబు, రైతు, నాగిరెడ్డిపేట్
కోటగిరి, మే 20: గన్నీ సంచులు లేవని, లారీలు వస్తలేవని మక్కలు కాంటా చేస్తలేరు. మూడెకరాల్లో మక్క పంట సాగు చేసిన. కోత కోసి మక్కలను రోడ్డు మీద పోసి నెల రోజులు అవుతున్నా పట్టించుకునే వారు లేరు. కాంటా పెట్టాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. గన్నీ సంచులు లేవు మీరే కొనుక్కోవాలని అంటున్నారు. మా దగ్గర పైసలు లేవు. అకాల వర్షానికి 10 బస్తాల మక్క తడిసిపోయింది.
-పులి పోశెట్టి, రైతు, వల్లభపూర్, కోటగిరి మండలం
కేసీఆర్ హయాంలో రైతు ఆనందంగా ఉన్నాడు. కానీ నేడు ఆగ్రహంతో రోడ్లెక్కాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నాడు కల్లాల్లో ధాన్యం కుప్పలు కనిపించేవే కాదు. కాని నేడు ఏడజూడు వడ్ల కుప్పలే దర్శనమిస్తున్నాయి. నాడు యూరియా కొరత లేదు, సంచుల కొరతలేదు, లారీల కొరతలేదు, మరీ ఇప్పుడెందుకు అన్నింటికి కొరత వచ్చింది. నాడు తరుగు లేకుండే, ఇప్పుడేమో పది కిలోల దాకా కడ్తా తీస్తుండ్రు. ఈ విషయం ప్రభుత్వానికి, అధికారులకు తెలిసినా పట్టించుకునేటోళ్లు లేరు. తరుగులో వాటాలు ఉన్నాయేమోనన్న అనుమానాలు అందుకే వస్తున్నాయి.
– చౌట్పల్లి రవి, రైతు, భీమ్గల్
కాంగ్రెస్ పాలనలో పంట పండించడానకే కాదు, అమ్ముకోవడానికి కూడా కష్టపడాల్సి వస్తున్నది. కేసీఆర్ సారు ఉన్నప్పుడే మంచిగా ఉండే. నాట్లు వేయడానికి ముందే రైతుబంధు ఇచ్చి ఆదుకున్నాడు. పంట కోసిన వెంటవెంటనే కాంటాలు వేసి, డబ్బు ఖాతాల వేసిండు. కానీ, ఇప్పుడట్ల లేదు. పంట కోసి 20 రోజులైనా కల్లం దాటలేదు. ఈ నెల 1వ తేదీన ధాన్యం తీసుకొస్తే మొన్న కాంటా వేసిండ్రు. మూడు రోజులైనా లారీ రాలే. బస్తాలు పోలే. కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమైండ్రు.
– మల్లేశం, రైతు, మాల్కాపూర్