అదను దాటిన తర్వాత అవగాహన!
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్టడం లేదు. అన్నదాతల విషయంలో సరైన అవగాహన కొరవడింది. జూన్ నెల ప్రారంభంతోనే వానాకాలం మొదలైంది. మరో పది రోజుల్లో వానాకాలం సీజన్ మొదలై రెండు నెలలు పూర్తవుతుంది. ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో సగానికి ఎక్కువ మంది రైతులంతా వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు.
- ఇప్పటికే వరి నాట్లు వేసిన సగం మంది రైతులు..
- ఎకరం నారుమడికి రూ.5వేలు పెట్ట్టుబడి వ్యయం
- నాట్లకు మరో రూ.5వేలు వెచ్చించిన అన్నదాతలు
- ప్రత్యామ్నాయ పంటలు వేయాలంటోన్న ప్రభుత్వం
- ఎల్‌నినో హెచ్చరికల అమలుకు సర్కారు మొద్దు నిద్ర
- ఉమ్మడి జిల్లా సమీక్షకు ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క గైర్హాజరు
నిజామాబాద్, జూలై 20, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్టడం లేదు. అన్నదాతల విషయంలో సరైన అవగాహన కొరవడింది. జూన్ నెల ప్రారంభంతోనే వానాకాలం మొదలైంది. మరో పది రోజుల్లో వానాకాలం సీజన్ మొదలై రెండు నెలలు పూర్తవుతుంది. ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో సగానికి ఎక్కువ మంది రైతులంతా వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. వరి నాట్లు సైతం పూర్తి చేసుకున్నారు. క్వింటాకు రూ.500 బోనస్ ఆశతో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఆంక్షల మేరకు ఏడు రకాల వంగడాలనే సాగు చేసేందుకు సిద్ధం అయ్యారు. నారుమడులు వేసుకునేందుకు ఎకరానికి దాదాపుగా రూ.5వేలు వెచ్చించారు.
ఎకరానికి వరి నాట్లు పూర్తి చేసేందుకు మరో రూ.5వేలు వరకు పెట్టుబడి పెట్టారు. ఇలా ప్రతి రైతు ఒక ఎకరంలో వరి నాట్లకు దాదాపుగా రూ.10వేలు వెచ్చించిన తర్వాత ప్రభుత్వం ముందుకు వచ్చి నీతి సూక్తులు చెబుతోంది. రెండు నెలల సాగు కాలం పూర్తవుతోన్న ఈ సమయంలో సమీక్షలు, సమావేశాల నిర్వహించడంపై రైతులు మండిపడుతున్నారు. నారుమడులు వేయక ముందు చెప్పాల్సిన సూక్తులు… ఆలస్యంగా చెప్పడం ఏమిటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా వానాకాలం పంటల సాగు అంచనాల్లో వ్యవసాయ శాఖ సైతం భారీగా వరి సాగవుతుందని అంచనాలు వేసింది. ఉమ్మడి జిల్లాలో 11లక్షల ఎకరాల్లో సాగు భూముల్లో పంటలు సాగైతే 60నుంచి 70శాతం వరి సాగయ్యే వీలున్నట్లుగా గణాంకాల్లో వెల్లడించారు. తీరా ఇప్పుడు వ్యవసాయ శాఖతో పాటుగా ప్రభుత్వ పెద్దలంతా కలిసి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టాలంటూ రైతులను కోరుతుండటం విడ్డూరంగా మారింది.
ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క గైర్హాజరు..
ఉమ్మడి జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా నియమకమైన తర్వాత సీతక్క అడపా దడపా వస్తున్నారు. పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లా పరిపాలనపై దృష్టి సారించడం లేదన్న అపవాదు సీతక్కను వెంటాడుతోంది. గతంలో ఇన్‌ఛార్జి మంత్రిగా జూపల్లి కృష్ణారావు ఉన్నప్పుడు కనీసం నెలకో, రెండు నెలలకో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా వైపు చుట్టపు చూపుకైనా వచ్చి వెళ్లేవారు. జూలై నెల ప్రారంభంలో అధికారిక కార్యక్రమాల్లో సీతక్క పాల్గొన్నారు. వ్యవసాయ శాఖపై రివ్యూ మీటింగ్‌కు ఇన్‌ఛార్జి మంత్రిగా పాల్గొనాల్సి ఉండగా గైర్హాజరు అయ్యారు. ఉమ్మడి జిల్లాకు మంత్రి లేరు. ఈ సమయంలో ఇన్‌ఛార్జి మంత్రికి కీలక బాధ్యతలు ఉన్నాయి. ఎల్‌నినో వంటి ఉపద్రవం పొంచి ఉన్న ఈ సమయంలో సంబంధిత శాఖలకు కీలక ఆదేశాలు జారీ చేయాల్సి ఉండగా ప్రభుత్వ సలహాదారుడు, పీసీసీ చీఫ్ సమక్షంలోనే రివ్యూ మీటింగ్ ముగిసింది.
సమావేశంలో ప్రత్యామ్నాయ పంటలపై చర్చ జరిగింది. కొంత మంది రైతులు వారి అభిప్రాయాలను పంచుకున్నారు. సమీకృత వ్యవసాయం, ఆరుతడి పంటల సాగు, సేంద్రియ వ్యవసాయంతో లాభాలు పొందవచ్చని రైతులు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో మొదలైన ఆయిల్‌పాం సాగుపై రైతులు, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి అనేక మార్లు నొక్కి చొప్పారు. ఆయిల్‌పాం సాగుతో దీర్ఘకాలికంగా లాభాలు వస్తాయని అభిప్రాయం వెలిబుచ్చారు. సాగు నీటి కొరత నేపథ్యంలో వరి నాట్లు వేసిన వారికి పరిహారం అందిస్తే తక్షణం ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్తామంటూ అనేక మంది రైతులు కోరుతున్నారు. రైతుభరోసా, బోనస్ అమలుకే మొండి చేయి చూపిస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈమేరకు పరిహారం ఇవ్వడం కష్టమేనన్న అభిప్రాయం వెలుగు చూస్తోంది.
వ్యూహం లేని ప్రజా పాలన
ప్రజాపాలనలో అస్తవ్యస్త నిర్ణయాలు, అవగాహన లోపాలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని భారత వాతావరణ సంస్థతో పాటుగా అనేక అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ఏప్రిల్ నుంచే హెచ్చరికలు జారీ చేస్తోంది. నీటి కొరతతో కరువు తాండవించే ప్రమాదం ఉన్నట్లుగా నాలుగైదు నెలల నుంచి ప్రభుత్వానికి ఐఎండీ హెచ్చరిస్తోంది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చలనం కరువైంది. వర్షాలు అంతంత మాత్రంగానే కురుస్తుండటంతో చేసేది లేక రైతులపైనే నెపం నెట్టేసేందుకు పాకులాడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్‌ఛార్జి మంత్రులు, మంత్రులు, ఆయా ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, రైతులు, రైతు సంఘాలు, వ్యవసాయ, ఉద్యానవన, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, పోలీస్ శాఖలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా జూలై 20న నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా మీటింగ్ జరిగింది. ప్రభుత్వ సలహాదారుడు పి.సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆరుతడి పంటల సాగువైపు రైతులను మళ్లించాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల వరి సాగుకే రైతులు ముందడుగు వేశారు. వరి నాట్లు పూర్తి చేసిన వారంతా వెనక్కి రావడం కష్టం. పెట్టుబడి నష్టం భారీగా ఉంటుంది. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ఆకట్టుకోవాలంటై ఏప్రిల్ నుంచే అవగాహన కల్పించి ఉంటే సత్ఫలితాలు వచ్చి ఉండేదని రైతులు భావిస్తున్నారు. కానీ ప్రజాపాలనలో వ్యూహాలు లేకపోవడం, ఫక్తూ రాజకీయం తప్పా ప్రజల మేలు కోరే నేతలు కొరవడటం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ప్రజలంతా కోడై కూస్తున్నారు.
ముందే ఎందుకు హెచ్చరించలేదు?
ఐఎంవో అంతర్జాతీయ వాతావరణ సంస్థ జనవరిలోనే ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తాయని, కరువు పరిస్థితులు ఏర్పడే ఆఅవకాశం ఉందని ప్రకటించింది. మరి అప్పుడే ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేసి ఉంటే మేము ప్రత్యామ్నాయ పంటలవైపు ఆలోచించే వాళ్లం. కానీ ఇప్పుడు వరి నాట్లు పూర్తయిన తర్వాత ఆరుతడి పంటలు వేయాలని చెప్పడం ఎంత వరకు సమంజసం. రైతుల జీవితాలతో ప్రయోగాలు చేయొద్దు.
-రమేశ్, రైతు, మంగ్లూర్
ఇప్పుడు అవగాహన సదస్సులా!
వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు. ఇవే కార్యక్రమాలు రెండు మూడు నెలల క్రితం నిర్వహించి ఉంటే మా లాంటి రైతులందరికి ఉపయోగపడేవి . బోరు బావులు, చెరువులు, కుంటల కింద ఇప్పటికే చాలా మంది రైతులు వరి నాట్లు పూర్తిచేసుకున్నారు. ఇప్పుడు ఆరుతడి పంటలు వేయమంటే మేము వేసిన వరిని పీకేయాలా.
-గౌస్, రైతు, బంజపల్లి
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

