విద్య, వైద్యం.. ప్రతి ఒక్కరికీ అందాల్సిన అత్యవసర సేవలివి. అందుకే ఏ ప్రభుత్వమైనా ఈ రెండు రంగాలను ప్రాధాన్యతగా ఎంచుకొని, ప్రత్యేక దృష్టిసారిస్తుంటాయి. ఇందుకు తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ ప్రభుత్వమే నిదర్శనం. బీఆర్ఎస్ పాలనలో వైద్యరంగం పురోగమించింది. కేసీఆర్ కిట్, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ వంటి వినూత్న పథకాలు, బస్తీ దవాఖానలు వంటి విప్లవాత్మక పథకాలు, జిల్లాకో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ వంటి కార్యక్రమాలతో వైద్యరంగం కొత్త పుంతలు తొక్కింది. ప్రభుత్వ దవాఖానల అభివృద్ధి, నగరం నలువైపులా టిమ్స్ నిర్మాణం, వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం, నిమ్స్ విస్తరణ వంటి భవిష్యత్తు అవసరాలు తీర్చే ప్రాజెక్టులు.. ఇలా తొమ్మిదిన్నరేండ్ల పాలన ఓ స్వర్ణయుగంలా గడిచింది.
కానీ.. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలోనే వైద్యరంగం తిరోగమిస్తున్నది. కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేయాలన్న కక్షతో కీలక పథకాలకు మంగళం పాడింది. కేసీఆర్ కిట్ ఎత్తేసి, ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేసింది. ‘కంటి వెలుగు’ను కనుమరుగు చేసింది. బస్తీ దవాఖానలను నిర్వీర్యం చేస్తూ పట్టణ పేదల గోస పుచ్చుకుంటున్నది. మెడికల్ కాలేజీల నిర్వహణ, నిర్మాణంపై అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకొంటున్నది. ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించే బృహత్తర లక్ష్యంతో శ్రీకారం చుట్టిన సూపర్‌స్పెషాలిటీ దవాఖానల నిర్మాణ పనులపైనా వివక్ష ప్రదర్శిస్తున్నది. వెరసి కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో వైద్యారోగ్య రంగం ఆగమాగం అవుతున్నది.
గర్భిణులు, బాలింతల కోసం మానవీయ కోణంలో ఆలోచించి, రెండు బృహత్తర లక్ష్యాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ‘కేసీఆర్ కిట్’. గర్భిణులు, బాలింతలకు ఆర్థికంగా సహాయం అందించడంతోపాటు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించి ఆయా కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించేలా ఈ పథకానికి రూపకల్పన చేశారు. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన నవజాత శిశువులను అందించడమే లక్ష్యంగా 2017 జూన్ 2న అప్పటి సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ దవాఖానలో ప్రసవించి, మగబిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13వేలు నగదు సాయం అందజేశారు. కేసీఆర్ కిట్‌లో బాలింత, శిశువుకు ఉపయోగపడే 14 రకాల వస్తువులు పొందుపర్చారు. ఈ పథకం పక్కాగా అమలు చేయడంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. 2014లో 30 శాతంగా ఉన్న ప్రసవాలు.. 2023 నాటికి 70 శాతానికి చేరాయి.

కేసీఆర్ కిట్ పథకం అమలుతో 2014లో 35గా ఉన్న శిశు మరణాల రేటు 2023 నాటికి 18కి తగ్గింది. 2014లో 92గా ఉన్న మాతృ మరణాల రేటు 2021 నాటికి 45కి పరిమితం అయ్యింది. అంటే మాతాశిశుమరణాల రేటు సగానికి తగ్గిపోయింది. ఈ పథకం ఏ స్థాయిలో సత్ఫలితాలు ఇచ్చిందో ఈ గణాంకాలే నిదర్శనం. కేసీఆర్ కిట్‌ను ఆదర్శంగా తీసుకొని అనేక రాష్ర్టాలు అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఇదే పథకాన్ని ఎన్టీఆర్ బేబీ కిట్ పేరిట ప్రస్తుతం అమలు చేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌కు పేరు వస్తుందనే కక్షతో ఈ మహత్తర పథకాన్ని నిలిపివేసింది. మొదట కేసీఆర్ కిట్ పథకానికి పేరు మారుస్తున్నామని నమ్మబలికింది. మాతా శిశు సంరక్షణ(మదర్ అండ్ చైల్డ్ హెల్త్-ఎంసీహెచ్) కిట్‌గా పేరు మారుస్తున్నట్టు ప్రకటించింది. పేరు మార్చినా కొనసాగించకుండా పూర్తిగా పక్కన పెట్టేసింది.
మాతాశిశు సంరక్షణలో భాగంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరో విప్లవాత్మక పథకం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. గర్భిణులకు సరైన పోషకాహారం అందకపోవడంతో రక్తహీనత కలుగుతున్నదని, ఫలితంగా తల్లీబిడ్డలపై తీవ్ర ప్రభావం చూపుతున్నదన్న నివేదికల నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారు. రక్తహీనత అధికంగా ఉన్న 9 జిల్లాలను ఎంపిక చేసి 2022 డిసెంబర్ 21న పథకాన్ని ప్రారంభించారు. 1.25 లక్షల మంది గర్భిణులకు రెండు కిట్ల చొప్పున పంపిణీ చేశారు. రెండో ఏఎన్సీ చెకప్ సమయంలో ఒక కిట్, మూడో ఏఎన్సీ చెకప్ సమయంలో రెండో కిట్ అందజేశారు.
ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండే పోషకాహారాన్ని అందించడం ద్వారా హిమోగ్లోబిన్‌ను పెంచడం, రక్తహీనత తగ్గించడం, తద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడటం, మాతాశిశు మరణాలను తగ్గించడం ఈ పథకం ముఖ్యఉద్దేశం. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసింది. ఈ మేరకు ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించింది. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని రద్దు చేసింది. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేసే లక్ష్యంలో భాగంగా ఈ మానవీయ పథకాన్ని కనుమరుగు చేసింది. మహిళల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో అవినీతి జరిగిందంటూ ప్రచారం చేసింది.

న్యూట్రిషన్ మిక్స్ – 1 కిలో
ఖర్జూర -1 కిలో
నెయ్యి- 500 గ్రాములు
ఐరన్ సిరప్ – 3 బాటిల్స్
ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు
కప్పు -1
బాస్కెట్-1
పట్టణ ప్రజలకు వైద్యసేవలు చేరువ చేయడం, చిన్నచిన్న వ్యాధులకు ప్రైవేట్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారికి ఆర్థిక భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం బస్తీ దవాఖానలకు రూపకల్పన చేసింది. 10 వేల జనాభాకు ఒకటి చొప్పున బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. మొదట జీహెచ్ఎంసీలో ప్రారంభించి, ఆ తర్వాత ఇతర మున్సిపాలిటీలకు విస్తరించింది. మొత్తంగా 400కుపైగా బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. ఒక్కో దవాఖానలో ఒక డాక్టర్ లేదా ఎంఎల్‌హెచ్‌పీ, ఒక ఫార్మాసిస్టు, సహాయకుడు ఉంటారు. ఇందులో 253 రకాల మందులు అందుబాటులో ఉండేవి. 57 రకాల పరీక్షలు, మరో 157 ఉపపరీక్షలు ఉచితంగా నిర్వహించేవారు. గతంలో ఒక్కో బస్తీ దవాఖానలో సగటున రోజుకు 150-200 మంది వైద్యం పొందేవారు. బస్తీ దవాఖానల పనితీరు భేష్ అంటూ ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ పబ్లిక్ హెల్త్’ కితాబు సైతం ఇచ్చింది.

జాతీయ వైద్య సదస్సులో బస్తీ దవాఖానల సేవలను కేంద్ర ఆరోగ్య ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇతర రాష్ర్టాలు ఈ పథకం అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. 2023 నాటికి సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేయగా, దాదాపు 2.5 కోట్ల మంది బస్తీ దవాఖానల్లో చికిత్స పొందారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత బస్తీ దవాఖానలకు సుస్తీ చేసింది. నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. దవాఖానల్లో డాక్టర్లు, స్టాఫ్‌నర్సులు, ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు చెల్లించలేదు. దీంతో వారి కుటుంబపోషణ భారంగా మారింది. ఫలితంగా బస్తీ దవాఖానల్లో ఖాళీలు పెరుగుతున్నట్టు సిబ్బంది చెప్తున్నారు. మరోవైపు మందులు సైతం సరిపడా అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. క్రమంగా బస్తీ దవాఖానలను ఎత్తివేసేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలో గతంలో మూడు బస్తీ దవాఖానలు ఉండగా తాజాగా ఒకటి మూసివేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ సేవలకు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ మాత్రమే పెద్ద దిక్కుగా ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర్వాత సైతం ఆయా దవాఖానలపై విపరీతమైన ఒత్తిడి ఉండేది. వైద్యసిబ్బంది ఎంత కృషిచేసినా పేషెంట్లకు సరైన వైద్యం అందని పరిస్థితి. ఈ దుస్థితిని అర్థం చేసుకున్న అప్పటి సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేయాలని సంకల్పించారు. హైదరాబాద్‌లో మూడు, వరంగల్‌లో ఒక సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌కు వచ్చే రోగులకు మూడు వైపులా అందుబాటులో ఉండేలా సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్లో టిమ్స్(తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని సంకల్పించారు.
2022 ఏప్రిల్ 26న వీటి నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వీటి ద్వారా ఒక్కో దవాఖానలో వెయ్యి పడకలు అందుబాటులోకి వస్తాయి. సనత్‌నగర్ టిమ్స్‌కు రూ.882 కోట్లు, ఎల్బీనగర్ టిమ్స్‌కు రూ.900 కోట్లు, అల్వాల్ టిమ్స్‌కు రూ.897 కోట్లు కేటాయించింది. వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి 2021 జూన్‌లో శంకుస్థాపన చేశారు. రూ.1,116 కోట్లతో 24 అంతస్తుల్లో నిర్మాణాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలోనే సనత్‌నగర్ టిమ్స్ పనులు 60 శాతం పూర్తయ్యాయి. మిగతా రెండు టిమ్స్ పనులు దాదాపు 40-50 శాతం పూర్తయ్యాయి. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను 68 శాతం పూర్తి చేశారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ నాలుగు దవాఖానల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. మొదట ఈ దవాఖానల పనుల్లో అవినీతి జరిగిందంటూ విచారణకు ఆదేశించి, పనులను పూర్తిగా పక్కన పెట్టేసింది. విచారణలో ఏమీ తేలకపోవడం, మరోవైపు ప్రజలు, ప్రతిపక్షం నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో పనులు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నత్తనడకన సాగాయి.
పనుల్లో జాప్యంతో సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభోత్సవం పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఇటీవల ఈ దవాఖానను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అయితే పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి రాలేదు. వైద్యులు ఓపీ సేవలతో సరిపెట్టాల్సిన పరిస్థితి. గతంలోనే దాదాపు 70 శాతం పూర్తయిన వరంగల్ దవాఖానపై ప్రభుత్వం నిర్లక్ష్యం ఇంకా కొనసాగుతుండగా, మిగతా రెండు టిమ్స్ పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియడం లేదు.
స్వరాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలో గాంధీ (1954), ఉస్మానియా(1946), కాకతీయ మెడికల్ కాలేజీ(1959), రిమ్స్ ఆదిలాబాద్(2008), నిజామాబాద్ మెడికల్ కాలేజీ(2013)లు మాత్రమే ఉండేవి. సీట్లు తక్కువగా ఉండడంతో తెలంగాణ బిడ్డలకు డాక్టర్ కావాలన్న కల కలగానే ఉండేది. మరోవైపు జిల్లాల్లో మెరుగైన వైద్యసేవలు అందేవి కాదు. ఈ పరిస్థితిని మార్చాలని, తెలంగాణ యువతకు అవకాశాలు కల్పించడంతోపాటు, జిల్లాల్లో స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తేవాలని మాజీ సీఎం కేసీఆర్ సంకల్పించారు. దానికి కార్యరూపమే జిల్లాకో మెడికల్ కాలేజీ.
బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో రాష్ట్రంలో కొత్తగా 29 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. 2014లో 850గా ఉన్న ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య, 4,590కి చేరింది. బీఆర్ఎస్ హయాంలో మొత్తం, 3,740 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. 2014లో 1,183గా ఉన్న పీజీ మెడికల్ సీట్లు 2023 నాటికి 2,869కి చేరుకున్నాయి. బీఆర్ఎస్ పాలనలో మొత్తం 1,686 పీజీ సీట్లు పెరిగాయి. దీంతోపాటు నర్సింగ్ విద్యకు సైతం నాడు ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో 5 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు ఉండగా.. 2023 నాటికి ఆ మొత్తం 23కి పెరిగింది. 2014లో 380గా ఉన్న నర్సింగ్ సీట్ల సంఖ్య 2023 నాటికి 3,300కు చేరింది.

ఒక వైపు మెడికల్ కాలేజీలు, మరోవైపు నర్సింగ్ కాలేజీల ఏర్పాటుతో వైద్యరంగాన్ని కేసీఆర్ పటిష్టపర్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్యవిద్యకు పట్టం కట్టగా.. కాంగ్రెస్ సర్కార్ దానిని మిథ్యగా మార్చుతున్నది. మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైంది. వైద్య కళాశాలల నిర్వహణను గాలికొదిలేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలను నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ దుస్థితిని పరిశీలించిన జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది జూన్‌లో రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై సీరియస్ అయ్యింది. అయినా సర్కార్ పనితీరు మారలేదు.
రాష్ట్రంలో అంధత్వ నివారణ లక్ష్యంగా వెలుగుల యజ్ఞాన్ని కేసీఆర్ సర్కార్ నాడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. 2018లో నిర్వహించిన కంటి వెలుగులో 1.54 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించారు. రెండో విడతలో 1.65 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. సమస్యలు ఉన్నవారికి ఉచిత కంటి పరీక్షలు చేయడంతోపాటు ఉచితంగా కంటి అద్దాలు, మందులను అందజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ స్కీమ్‌ను సైతం నిలిపేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ సీఎం వైఎస్సాఆర్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు లబ్ధి చేకూరుతున్నదనే సదుద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం కొనసాగించింది. చికిత్సల సంఖ్యను, కవరేజీని పెంచి మరింత పటిష్టం చేసింది. సాధారణ సేవలకు రూ.5 లక్షలు, అవయవ మార్పిడి, క్యాన్సర్‌లాంటి చికిత్సలకు రూ.10 లక్షల కవరేజీని అందించింది. 2023 మే నాటికి 15.4 లక్షల మంది ఆరోగ్యశ్రీ సేవలు వినియోగించుకోగా, ప్రభుత్వం రూ.6,823 కోట్లు ఖర్చు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ఆగం అయ్యింది.
గతంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌ను నేటి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్నది. నిధుల కేటాయింపులో అంతులేని జాప్యం చేస్తున్నది. దీంతో నెట్వర్క్ దవాఖానలు పలుమార్లు సేవలను నిలిపివేశాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రూ.1,800 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయాయి. గతంలో నెలకు రూ.100 కోట్ల చొప్పున కేటాయిస్తామని హామీ ఇచ్చిన సర్కార్ మాట తప్పింది. మరోవైపు పెద్దాసుపత్రులైన గాంధీ, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నయాపూల్ ప్రసూతి, సుల్తాన్‌బజార్ మెటర్నిటీ, కోఠి ఈఎన్టీ, సరోజినిదేవీ కంటి దవాఖానల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రోజువారీ వైద్య సేవలకు వినియోగించే కీలక సర్జికల్స్ ఐటమ్స్ లేకపోవడంతో ఆపరేషన్లు చేయలేని పరిస్థితి నెలకొన్నదని వైద్యులే చెప్తున్నారు.
