అమెరికా : ఈబీ-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఫీజులను అమెరికా ప్రభుత్వం భారీగా పెంచుతున్నది. దీనివల్ల పెట్టుబడి పెట్టి గ్రీన్‌కార్డ్ పొందాలనుకునే విదేశీయుల ఖర్చు పెరుగనున్నది. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ఖరారు చేసిన కొత్త ఫీజుల విధానం నవంబర్ 30 నుంచి అమల్లోకి రానున్నది. స్వతంత్ర పెట్టుబడిదారులు ఉపయోగించే ఫామ్ ఐ-526 ఫీజు 3,675 అమెరికన్ డాలర్ల నుంచి 7,615 డాలర్లకు పెరుగనున్నది. పీటీఐ వార్తాసంస్థ తెలిపిన ప్రకారం, రెండు ప్రారంభ పిటిషన్లకు 75 అమెరికన్ డాలర్ల టెక్నాలజీ ఫీజు కూడా ఉంటుంది. రీజినల్ సెంటర్ పెట్టుబడిదారులు ప్రత్యేకంగా ఇన్వెస్టర్ ఇంటెగ్రిటీ ఫీజు కూడా చెల్లించాలి. శాశ్వత నివాస హోదాపై ఉన్న షరతులను తొలగించేందుకు ఉపయోగించే ఫామ్ ఐ-829 ఫీజు కూడా 3,750 నుంచి 5,000 డాలర్లకు పెరుగనున్నది.
ఇతర ఉపాధి ఆధారిత ఇమ్మిగ్రేషన్ కేటగిరీల్లో దీర్ఘకాలిక నిరీక్షణను ఎదుర్కొంటున్న భారతీయులు ఈబీ-5 మార్గంపై ఆసక్తి చూపుతున్నారు. అమెరికన్ బజార్ డాటా ప్రకారం.. భారత్ నుంచి 2022 ఆర్థిక సంవత్సరంలో ఈబీ-5 దరఖాస్తులు 75 ఉండగా 2025 నాటికి దాదాపు 1,900కు పెరిగాయి. హెచ్-1బీ, ఎఫ్-1 తాత్కాలిక వీసాలపై ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో కూడా ఈ ప్రోగ్రామ్‌పై ఆసక్తి పెరిగింది. అయితే అధిక ఈబీ-5 ఫీజులు చెల్లించడం ద్వారా వెంటనే గ్రీన్‌కార్డ్ లభిస్తుందన్న హామీ లేదు. యూఎస్సీఐఎస్ ప్రకారం.. ఆ సంస్థకు పన్నుల కంటే వసూలు చేసే ఫీజుల ద్వారానే ప్రధానంగా నిధులు సమకూరుతాయి. దరఖాస్తులను పరిశీలించడం, బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లు నిర్వహించడం, అర్హతను నిర్ధారించడం, మోసాలను గుర్తించడం, ప్రోగ్రామ్ నిర్వహణ వంటి ఖర్చులను ఈ ఫీజులు భరిస్తాయని సంస్థ తెలిపింది. ఫీజుల పెంపు వల్ల అందుబాటులో ఉన్న ఈబీ-5 వీసాల సంఖ్య మారదు. దేశాలవారీ పరిమితులు కూడా తొలగించబడవు. కొత్త ఫీజుల విధానం కింద భారతీయ పెట్టుబడిదారులు దరఖాస్తు చేసేందుకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.