ముంబై, సెప్టెంబర్ 30 : ముంబైలో శిథిలావస్థలో ఉండే ఒక ఇంటిలో ఒక మహిళ ఒంటరిగా నివసిస్తున్నది. ఆమెతో పాటు ఉండే తండ్రి నాలుగేండ్ల క్రితం కన్నుమూశాడు. అప్పటి నుంచి ఆ మహిళ బయటకు వచ్చేది కాదు.. ఎవరితో మాట్లాడేది కాదు.. అయితే ఇటీవల ఆ భవనం నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో ఆ మహిళ మరణించిందేమోనన్న అనుమానంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మలాడ్ ఈస్ట్‌లో ఉన్న ఆ ఇంటి ఇనుపగేటును తెరచి లోపలికి వెళ్లిన పోలీసులు షాక్ తిన్నారు. ఆ మహిళ అక్కడ ఒంటరిగా వారికి కన్పించింది. అయితే ఆమెకు సమీపంలో ఒక మృతదేహం లభ్యమైంది.
పోలీసులు ఆ మృతదేహం ఎవరిదా అని ఆరా తీయగా, అది నాలుగేండ్ల క్రితం మరణించిన ఆమె తండ్రిదని తెలిసి విస్తుపోయారు. వాస్తవానికి 2022 జూన్‌లో ఆమె తండ్రి గుండెపోటుతో మరణించాడు. అయితే తండ్రి మరణించినా, ఆయన తనతోనే ఉండాలని ఆయన కుమార్తె గాఢంగా కోరుకుంది. దాంతో మృతదేహాన్ని ఎలాగైనా భద్రపర్చాలని నిర్ణయించుకుని, మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి బదులుగా, మృతదేహాన్ని భద్రపర్చడానికి ఒక విదేశీ కంపెనీని సంప్రదించింది. ఆ నాలుగేండ్లు ఆ మృతదేహాన్ని తనతోనే ఉంచుకుంది. ఆ మహిళకు తన తండ్రిపై ఉన్న అపారమైన ప్రేమే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసికుని దర్యాప్తు చేస్తున్నారు.