బాంబే ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య వ్యవహారంలో అక్కడి డీన్పై వేటు పడటం ఇటీవల సంచలనం కలిగించింది. ఇలాంటివి జరిగినప్పుడు అయ్యో మరో విద్యాకుసుమం ఉసూరుమంటూ రాలిపోయిందే అని బాధపడుతాం. ఆ తర్వాత అందరూ ఆ ఘటనను మరచిపోవడం యథావిధిగా జరిగిపోతుంది. సదరు విద్యార్థి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న తర్వాత హాస్టల్ గదుల్లో ఫ్యాన్లు తీసేయాలని యాజమాన్యం నిర్ణయించడం హాస్యాస్పదమేనని చెప్పాలి. విద్యార్థుల ఆత్మహత్యలను వ్యక్తిగత బలహీనతగా కాకుండా, వ్యవస్థల వైఫల్యంగా గుర్తించాల్సిన అవసరాన్ని ఈ ఘటన నొక్కి చెప్పింది.
ఐఐటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు వంటి ప్రతిష్టాత్మక ఉన్నత విద్యాసంస్థలు జ్ఞానాన్ని పంచే ఆలయాలుగా కాకుండా, ఒత్తిడితో ఊపిరాడనివ్వని చీకటికొట్టాలుగా మారుతున్నాయనే కఠిన వాస్తవం భయపెడుతున్నది. విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు ఇప్పటివరకు చూపిన నిర్లక్ష్యం ఘోర వైఫల్యం. ఒకరి తరువాత ఒకరు ప్రాణాలు కోల్పోతున్నా, వ్యవస్థ మాత్రం ’ఇది వ్యక్తిగత సమస్య’ అంటూ చేతులు దులుపుకొంటున్నది. ఉన్నత విద్యాలయాల్లో తరచుగా జరుగుతున్న ఇలాంటి ఘటనలపై దీర్ఘకాలిక వ్యూహంతో ఇటు ప్రభుత్వాలు గానీ, అటు విద్యాసంస్థలు గానీ దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. దేశంలో ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు నియమించిన నేషనల్ టాస్క్ఫోర్స్ (ఎన్టీఎఫ్) దాఖలు చేసిన నివేదిక ఆ దిశగా ఒక కీలక ముందడుగుగా భావించాలి.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవీంద్రభట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన టాస్క్ఫోర్స్ దేశవ్యాప్తంగా 2.43 లక్షల మంది విద్యార్థులపై నిర్వహించిన సర్వేలో భయానక వాస్తవాలు వెలుగు చూశాయి. ఉన్నత స్థాయి విద్యాలయాల్లో చదివే విద్యార్థుల్లో 15 శాతం మంది తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. 9 శాతం మందిలో ఆత్మహత్య గురించిన ఆలోచనలు ఉన్నట్టు ఆ అధ్యయనంలో వెల్లడైంది. 34 శాతం మందిలో ’పరాయీకరణ’ భావనలు గూడుకట్టుకున్నాయి. ఈ తరహా భావనలు ఉన్నవారిలో 67 శాతం విద్యార్థులు ఎస్.సి., ఎస్.టి., ఓబీసీ సామాజిక వర్గాలకు చెందినవారే కావడం గమనార్హం. అడ్డగోలు పోటీ తత్వం, మార్కుల పిచ్చి, ప్లేస్మెంట్ భయం వంటివి ఎప్పుడైనా పేలేందుకు సిద్ధంగా ఉన్న మానసిక బాంబులను తయారు చేస్తుండటం దారుణం.
కులవివక్ష, సామాజిక ఒంటరితనం, ఆత్మీయ స్పర్శ లోపించిన బోధనా విధానాలు విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని మరింతగా పెంచుతున్నాయి. విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్న అంశాల్లో లైంగిక వేధింపులు కూడా ఉన్నాయి. మెడికల్/ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో లైంగిక వేధిపుల సమస్య తీవ్రస్థాయిలో ఉన్నట్టు టాస్క్ఫోర్స్ సర్వే బయటపెట్టింది. తగిన విద్యాప్రణాళిక లేకపోవడం, బోధనా ఖాళీలు భర్తీచేయకపోవడం, అనుభవం లేని గెస్ట్ లెక్చరర్లతో పాఠాలు చెప్పించడం, అత్యంత కఠినమైన హాజరు విధానాలు, హాస్టళ్లలో దారుణమైన క్రమశిక్షణ వంటివి సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి.
విద్యార్థులు తనువు చాలించాలని అనుకోవడం కేవలం వ్యక్తిగత వైఫల్యం కాదు, ఇది సంస్థల విలువల సంక్షోభం. ఇంకా తీవ్రమైన విషయం ఏందంటే, చాలా సంస్థల్లో సరైన కౌన్సెలింగ్ వ్యవస్థలు లేవు. ఉన్న చోట్ల కూడా అవి నామమాత్రంగా పనిచేస్తున్నాయి. సర్వేలో పరిశీలించిన 70 శాతం సంస్థల్లో పూర్తిస్థాయిలో మానసిక నిపుణులను నియమించలేదని వెల్లడైంది. మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడట మే ఆత్మన్యూనతకు దారితీసే భయానక వాతావరణం కొనసాగుతున్నది. ‘సక్సెస్’ అనే ఒకే కొలమానంతో విద్యార్థులను అంచనా వేయడం, వైఫల్యాన్ని అవమానకరమైనదిగా చూడటం ఈ విషాద స్థితికి మూల కారణం.
అక్టోబర్ 31న సుప్రీంకోరుకు టాస్క్ఫోర్స్ తుది నివేదిక సమర్పిస్తుంది. ఇది కేవలం విద్యార్థుల సమస్య కాదు, దేశ భవిష్యత్తు సమస్య. ప్రతి ఆత్మహత్య ఒక కలను చిదిమివేస్తుంది. దాంతో ఒక కుటుం బం భవిష్యత్తు కుప్పకూలిపోతుంది. ఈ విషాదాలకు ముగింపు పలుకాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతి ఉన్నత విద్యాసంస్థలోనూ తప్పనిసరిగా సమర్థవంతమైన మానసిక ఆరోగ్య కేం ద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రారంభ దశలోనే ప్రమాద సంకేతాలను గుర్తించే వ్యవస్థలు ఉండా లి. ఉపాధ్యాయులకు సున్నితంగా వ్యవహరించడంపై శిక్షణ ఇవ్వాలి. లింగ వివక్ష, కులవివక్షపై కఠిన చర్యలు తీసుకునే పారదర్శక వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా, విద్యా విధానంలో మానవీయ దృక్పథాన్ని తీసుకురావాలి.