రుద్రూర్, అక్టోబర్ 29: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన.. రైతుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వర్ని మండల కేంద్రంలో నియోజకవర్గ నాయకులతో కలిసి మంగళవారం ‘రైతు నిరసన’ చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలేదని మండిపడ్డారు. రైతు భరోసా, వరికి బోనస్‌ను తుంగలోకి తొక్కిందన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఇప్పటివరకు ధాన్యాన్ని సేకరించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన వెంటనే ధాన్యం సేకరణ ప్రారంభించి రైతులను ఆదుకోవాలని కోరారు. రూ. 2 లక్షల రుణమాఫీపై రైతులకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, మండల నాయకులు మధు, మాధవరెడ్డి, నర్సింహులు, అఫ్రోజ్, సాయిలు, ప్రవీణ్‌యాదవ్, రాము, సాయికిరణ్, పోచయ్య, పుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.