నిజామాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్‌రెడ్డి అనేక హామీలు గుప్పించారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కాక దారుణంగా వంచించారు. ఎన్నికల ముందర పీసీసీ చీఫ్‌గా అనేక హామీలిచ్చిన రేవంత్‌రెడ్డి.. అధికారం చేపట్టాక ఆయా హామీలను ఎగ్గొట్టారు. సీఎం బాధితుల్లో రైతులు, మహిళలే కాదు.. సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులు కూడా చేరారు. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు వారు సమ్మె చేస్తున్నా కనీసం స్పందించడం లేదు. ఓట్ల కోసం ఉద్యోగులు, మహిళలు, రైతులు.. ఇలా సబ్బండ వర్గాలను రేవంత్‌రెడ్డి మోసం చేశారు. రుణమాఫీ చేయకుండా, రైతుబంధు ఇవ్వకుండా రైతులను నట్టేటా ముంచారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలపై అనేక వరాలు కురిపించి అమలు చేయకుండా చేతులెత్తేశారు. ఉద్యోగుల కష్టాలు తీరుస్తామని కల్లబొల్లి మాటలు చెప్పిన కాంగ్రెస్ అధికారం చేపట్టాక చేతులెత్తేసింది. సర్కారు వైఖరిపై అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
మాటఇచ్చి.. మడమ తిప్పి..
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను రేవంత్‌రెడ్డి దారుణంగా మోసగించారు. విద్యాశాఖలో విలీనం చేసి తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఎస్ఎస్ఏ ఉద్యోగులు 2023లో సమ్మె చేపట్టారు. అప్పట్లో 22 రోజుల పాటు సమ్మె చేశారు. టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి గతేడాది సెప్టెంబర్ 13న హన్మకొండలోని సమగ్ర శిక్ష ఉద్యోగుల శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలు హామీలిచ్చారు. తాము అధికారంలోకి రాగానే చాయ్ తాగినంత సమయంలోనే సమస్యను పరిష్కరిస్తానని హామీనిచ్చారు. ఏడాది దాటిపోయింది. కానీ ఇచ్చిన హామీ అమలు కాలేదు. మాట నిలబెట్టుకోవాలని ఉద్యోగులు పలుమార్లు విన్నవించారు. అయినా స్పందన కరువవడంతో ఆగ్రహానికి గురైన వారు రేవంత్ వైఖరిపై దుమ్మెత్తి పోస్తూ ఈ నెల 10 నుంచి సమ్మెబాట పట్టారు. వాస్తవానికి గతేడాది అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హయాంలోనే ఎస్ఎస్ఏ ఉద్యోగుల పే స్కేల్ ఫైల్ సిద్ధమైంది. కానీ ఎన్నికలు రావడంతో పైల్ మరుగున పడిపోయింది. లేదంటే అప్పుడే తమ సమస్యకు పరిష్కారం లభించి ఉండేదని ఉద్యోగులు వాపోతున్నారు.
అందరూ రోడ్లపైనే..
సమగ్ర శిక్ష ఉద్యోగులు విద్యాశాఖలో 18 ఏండ్ల నుంచి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న వీరికి వేతనాలు మాత్రం అరకొరగానే ఉన్నాయి. 2006లో రాజీవ్ విద్యామిషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థలో కలెక్టర్లు చైర్మన్లుగా ఉన్న త్రీమెన్ కమిటీ ద్వారా రోస్టర్ మెరిట్ ఆఫ్ రిజర్వేషన్ పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఒప్పంద ఉద్యోగులుగా వీరిని ఎంపిక చేశారు. జిల్లాస్థాయిలో ఏపీవో, సిస్టం అనాలసిస్ట్ టెక్నికల్ పర్సన్స్, ఆపరేటర్స్, డీఎల్‌ఎంటీ, మెసెంజర్లుగా, మండల స్థాయిలో ఎంఐఎస్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐఆర్సీఎస్ మెసెంజర్స్, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో క్లస్టర్ రిసోర్స్‌పర్సన్స్, పాఠశాల స్థాయిలో పార్ట్‌టైం ఇన్ఫాస్ట్రక్చర్స్, కేజీబీవీ యూఆర్ఎస్లలో స్పెషల్ ఆఫీసర్స్, పీజీసీ ఆర్టిస్టులు, సీఆర్టీలు, పీఈటీలు, ఏఎన్ఎంలు, అకౌంటెంట్, క్రాఫ్ట్ అండ్ కంప్యూటర్ ఇన్ఫాస్ట్రక్చర్స్, వాచ్మెన్, వంట చేసే సిబ్బంది (కుక్‌లు), స్కావెంజర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖకు అనుబంధంగా కీలక విధులు నిర్వర్తిస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెతో వ్యవస్థ కుంటుపడుతున్నది. మరోవైపు కేజీబీవీలు సైతం మూత పడే పరిస్థితికి వచ్చింది.
వీరే కీలకం..
సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రభుత్వం అప్పగించిన పనిలో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా విద్యను బోధిస్తూ వారిలో సృజనాత్మకతను వెలికి తీస్తున్నారు. బడి బయట పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. విద్యార్థులకు దుస్తులు, పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యం సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. యూడీఎస్ ప్లస్‌లో డ్రాప్ట్ పిల్లల్ని ఇంపోర్ట్ చేయడం, రాపోట్ చేయడం, ప్రొఫైల్స్ అప్డేట్ చేయడం, డీఎస్ఈ, ఎఫ్ఆర్ఎస్ విద్యార్థుల ఆన్లైన్ హాజరును చూసుకోవడం, ఆన్లైన్, ఆఫ్‌లైన్‌కు సంబంధించిన ప్రతి విషయంలో సమగ్రశిక్ష ఉద్యోగులు కీలకంగా వ్యవహరిస్తూ విద్యావ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇతర కార్యక్రమాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే విధులు నిర్వహిస్తూ అరకొర వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాలు సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా వేతనాలు అందుతున్నాయి. మహారాష్ట్ర, ఒడిశా, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో పేస్కేల్ అమలుచేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో నంబర్ 4 ప్రకారం చాలా రాష్ర్టాల్లో సమానపనికి సమాన వేతనం అమలవుతున్నది. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఇందుకు భిన్నంగా వేతనాలు ఇస్తున్నారు. విధి నిర్వహణలో ఉద్యోగి మరణిస్తే కనీసం దహనక్రియల ఖర్చులు కూడా చెల్లించడం లేదు. 61 ఏండ్లు నిండిన తర్వాత ఉద్యోగ విరమణ చేస్తే రిటైర్మెంట్ ప్రయోజనాలు కూడా కల్పించడం లేదు. దీంతో ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు.
పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో భారీర్యాలీ
శక్కర్‌నగర్, డిసెంబర్ 12 : సమగ్ర శిక్ష ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతుగా బోధన్ పట్టణంలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి గురువారం ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి అనిల్ టాకీస్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు గౌతంకుమార్ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థ సవ్యంగా కొనసాగాలంటే సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్. కార్తీక్, జిల్లా నాయకులు కె. సాయినాథ్, ఆకాశ్ కుమార్, రమణి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వానికి పట్టింపు లేదు..
ఉద్యోగ భద్రత కల్పిస్తామని రేవంత్‌రెడ్డి స్వయంగా హామీ ఇచ్చారు. ఏడాది పూర్తయినా ఇప్పటికీ ఆయన మాటకు దిక్కులేకుండా పోయింది. డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన చేస్తూనే ఉన్నాం. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. గత నెల 22న తెలంగాణ సమగ్ర వర్క్ ఆర్ట్స్ ఫిజికల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్ఎస్యుఎస్) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖకు మొదటిసారి నోటీసు ఇచ్చారు. 15 రోజుల వ్యవధిలో స్పందన రాకపోవడంతో ఈ నెల 6న మరోసారి సమ్మె నోటీసు ఇచ్చాం. అయినా రేవంత్ సర్కారు మమ్మల్ని కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. అందుకే ఈ నెల 10 నుంచి నిరవధిక సమ్మెకు దిగాం. ఉద్యోగ భద్రత కల్పించే దాకా ఉద్యమాన్ని ఆపేది లేదు.